నామినేషన్ల జోరు | heavly nominations in kurnool district | Sakshi
Sakshi News home page

నామినేషన్ల జోరు

Apr 17 2014 3:39 AM | Updated on Aug 14 2018 4:21 PM

సెంటిమెంట్ పండింది. నామినేషన్ల పర్వం అట్టహాసంగా సాగింది. బుధవారం ఒక్క రోజే 53 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు.

కర్నూలు, న్యూస్‌లైన్: సెంటిమెంట్ పండింది. నామినేషన్ల పర్వం అట్టహాసంగా సాగింది. బుధవారం ఒక్క రోజే 53 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు కదలగా.. పార్టీ శ్రేణులు, అభిమానులు వేలాదిగా తరలిరావడం విశేషం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాలకు ప్రధాన రాజ కీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లను దాఖలు చేశారు.
 
 వైఎస్‌ఆర్‌సీపీ తరఫున కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బుట్టా రేణుక ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక బళ్లారి చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు పార్టీ శ్రేణులతో ర్యాలీగా వచ్చి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుదర్శన్‌రెడ్డికి నామినేషన్ సమర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి, పత్తికొండ అభ్యర్థి కోట్ల హరిచక్రపాణిరెడ్డి, నాయకులు విష్ణువర్దన్‌రెడ్డి, బుట్టా నీలకంఠం, తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ హఫీజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
 
 నంద్యాల ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. బొమ్మలసత్రంలోని ఆయన నివాసం నుంచి పద్యావతినగర్‌లోని భూమా నివాసానికి వెళ్లి ఆయనతో కలసి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించారు. అనంతరం ఆర్‌డీఓ కార్యాలయం చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ కన్నబాబుకు నామినేషన్ పత్రాలను అందించారు.
 
 అదేవిధంగా నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భూమా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వచ్ఛందంగా తరలిరావాలని భూమా ఇచ్చిన పిలుపునకు శ్రేణులు స్పందించాయి. స్థానిక ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డిపై వ్యతిరేకతను స్పష్టం చేసేలా ప్రజలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ప్రత్యర్థి పార్టీల నాయకులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి తన ఇంటి నుంచి టీబీ రోడ్డు, పాత బస్టాండ్, మెయిన్ బజారు మీదుగా ర్యాలీ చేపట్టారు. ఆ తర్వాత ఆర్‌ఓ నరసింహులుకు నామినేషన్ పత్రం సమర్పించారు. కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఎస్వీ మోహన్‌రెడ్డి తన తండ్రి, మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డితో కలసి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఎస్వీ విజయ మనోహరి కూడా మరో సెట్ నామినేషన్ వేశారు. భాగ్యనగర్‌లోని పార్టీ కార్యాలయం నుంచి ఐదు రోడ్ల కూడలి, వైఎస్‌ఆర్ జంక్షన్, పాత కంట్రోల్ రూమ్ మీదుగా తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు.
 
 అభిమానులతో రోడ్లన్నీ హోరెత్తాయి. పాణ్యం అభ్యర్థి గౌరు చరితారెడ్డి భర్త గౌరు వెంకటరెడ్డితో కలసి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మెయిన్ రోడ్డు మీదుగా తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నాలుగు మండలాల నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చి మద్దతు తెలిపారు. బనగానపల్లెలో కాటసాని రామిరెడ్డి తన ఇంటి నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు పార్టీ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను అందజేశారు. కోడుమూరులో నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల అభిమానులు పెద్ద ఎత్తున గూడూరుకు తరలిరాగా అభ్యర్థి ఎం.మణిగాంధీ నామినేషన్ వేశారు.
 
 ఎమ్మిగనూరు అభ్యర్థి జగన్మోహన్‌రెడ్డి ఒక సెట్, ఆయన తండ్రి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గ్రామాల నుంచి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంత్రాలయంలో బాలనాగిరెడ్డి తరఫున డమ్మీ అభ్యర్థిగా ఆయన సోదరుడు వై.సీతారామిరెడ్డి మరో సెట్ నామినేషన్ అందజేశారు. ఆలూరులో గుమ్మనూరు జయరాం సాయిబాబా దేవాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
 
 శైలం అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి నంద్యాల టర్నింగ్ నుంచి గౌడు సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి తహశీల్దారు కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్, టీడీపీ, స్వతంత్ర అభ్యర్థులు సైతం ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 19వ తేదీతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. 18వ తేదీన సెలవు ఉం డటంతో 17, 19  తేదీల్లో మిగిలిన అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement