ఫైనల్ టచ్! | general election campaign final touch | Sakshi
Sakshi News home page

ఫైనల్ టచ్!

Apr 27 2014 1:28 AM | Updated on Mar 18 2019 7:55 PM

ఫైనల్ టచ్! - Sakshi

ఫైనల్ టచ్!

సార్వత్రిక ప్రచారం కీలక దశకు చేరుకుంది. రెండ్రోజుల్లో తెరపడనున్న ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది.

 - నేడు జిల్లాకు సోనియా, కేసీఆర్, చంద్రబాబు
 - ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆయా పార్టీల కార్యకర్తలు
 - అభ్యర్థుల ఆశలన్నీ అతిరథుల ప్రచారంపైనే..
 
 సాక్షి, రంగారెడ్డి జిల్లా : సార్వత్రిక ప్రచారం కీలక దశకు చేరుకుంది. రెండ్రోజుల్లో తెరపడనున్న ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. ముగ్గురు అగ్రనేతల రాకతో సార్వత్రిక పోరు అంతిమ దశకు చేరుకుంది. ఎన్నికల ప్రచారానికి ‘ఫైనల్ టచ్’ ఇచ్చేందుకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌ల అతిరధులు జిల్లాకు తరలివస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.

ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, టీఆర్‌ఎస్ సారథి కేసీఆర్, దేశం దళపతి చంద్రబాబు  జిల్లాలో జరిగే ప్రచారసభల్లో పాల్గొంటుండడంతో భారీగా జనసమీకరణ జరిపేం దుకు ఆయా పార్టీల నాయకత్వాలు సర్వశక్తులొడ్డుతున్నాయి. అగ్రనేతల సభలను సక్సెస్ చేయడం ద్వారా కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపాలని భావిస్తున్నాయి.

 చేవెళ్లలో సోనియా..
 కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదివారం చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు. జిల్లా గ్రామీణ ప్రాంతానికి తొలిసారిగా సోనియా రానుండడంతో పార్టీ కార్యకర్తలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సోనియా సభకు పెద్దఎత్తున జనాలను తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. సుమారు 700 బస్సుల ద్వారా ప్రజలను చేవెళ్లకు చేరవేసేందుకు సన్నాహాలు చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు షాబాద్ మార్గంలో జరిగే సభ ఏర్పాట్లను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు.

 కేసీఆర్ సుడిగాలి పర్యటన
 టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదివారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తాండూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం పరిగి, వికారాబాద్‌లలో జరిగే రోడ్‌షోల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో మేడ్చల్ చేరుకుంటారు. అక్కడ రోడ్‌షో అనంతరం ఎల్‌బీనగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. గ్రామీణ నియోజకవర్గాలపై గంపెడాశ పెట్టుకున్న టీఆర్‌ఎస్.. ఇక్కడ అధినేత సభలను విజయవంతం చేయడం ద్వారా ప్రత్యర్థులకు సవాల్ విసరాలని భావిస్తోంది.

 మహేశ్వరానికి టీడీపీ అధినేత బాబు..
 చంద్రబాబు ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో పర్యటిస్తారు. తర్వాత ఇబ్రహీంపట్నంలో 3గంటలకు జరిగే సభలో ప్రసంగిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement