‘దేశం’తో పొత్తు వద్దే వద్దు! | don't alliance with telugu desam party says bjp leaders | Sakshi
Sakshi News home page

‘దేశం’తో పొత్తు వద్దే వద్దు!

Apr 4 2014 11:48 PM | Updated on Mar 29 2019 9:24 PM

ఒంటరి పోరుకే బీజేపీ మొగ్గు చూపుతోంది. తెలుగుదేశంతో పొత్తు పార్టీకి చేటుకుని తెచ్చుకోవడమేనని భావిస్తోంది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  ఒంటరి పోరుకే బీజేపీ మొగ్గు చూపుతోంది. తెలుగుదేశంతో పొత్తు పార్టీకి చేటుకుని తెచ్చుకోవడమేనని భావిస్తోంది. సైకిల్‌పై సవారీకంటే ఒంటరి పోరుతోనే పార్టీకి లాభం చేకూరుతుందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ‘దేశం’తో సీట్ల సర్దుబాటు చేసుకునే దిశగా అధిష్టానం జరుపుతున్న చర్చలపై అసంతృప్తి వ్యక్తంచేసింది. మునిగిపోతున్న నావతో ప్రయాణం సరికాదని, టీడీపీతో పొత్తు కోరి నష్టాలు తెచ్చుకోవడమేనని జిల్లా నాయకత్వం స్పష్టం చేసింది. పొత్తులో భాగంగా జిల్లాలోని రెండు పార్లమెంటరీ స్థానాలను వదులుకునేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నట్టు కన్పించడం లేదు. సంస్థాగతంగా బలంగా ఉన్న ఈ నియోజకవర్గాలను వదిలేందుకు కాషాయదళం కూడా ఇష్టపడడంలేదు.

 రెండింటిలో కనీసం ఒక పార్లమెంటరీ సెగ్మెంట్ అయినా తమకు కేటాయించకపోవడంపై బీజేపీ జిల్లా నాయకత్వం మండిపడుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయిన బీజేపీ ముఖ్యనేతలు.. టీడీపీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేగాకుండా సొంత పార్టీ వ్యవహారశైలిని తప్పుపట్టారు. అత్యధిక శాసనసభా స్థానాలకు ‘దేశం’కు కేటాయిస్తే.. పార్టీని నమ్ముకున్న నేతల పరిస్థితేం టని నిలదీశారు. పొత్తు అనివార్యమైతే హీనపక్షంగా పార్లమెంటు స్థానంసహా ఏడు అసెంబ్లీ సీట్లు ఇచ్చేలా చూడాలని అధిష్టానానికి నివేదిస్తున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం మారిన రాజకీయ సమీకరణలు, మోడీ హవా నేపథ్యంలో జిల్లాలో బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని, ఈ సమయంలో ‘దేశం’తో పొత్తు కుదుర్చుకోవడం బలపడుతున్న పార్టీని దెబ్బ తీసుకోవడమేనని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సీట్ల సర్దుబాటు చర్చలు నిలిపివేసి ఒంటరిగా జిల్లాలోని అన్ని సీట్లకు సొంతంగా పోటీచేయాలని అధినాయకత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి, జిల్లా గ్రామీణ, పట్టణ అధ్యక్షులు అంజన్‌కుమార్‌గౌడ్, పార్టీ నేతలు ఎన్.చంద్రయ్య, ఎం.భీమ్‌రావు, బాలలింగం, మోహన్‌రెడ్డి, ప్రకాశ్, స్వామిగౌడ్, శంకర్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, ఆకుల రమేశ్‌గౌడ్, నర్సింహరెడ్డి, కాంతారావు, దినకర్, వై.శ్రీధర్, ఎస్.మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement