అందరి దృష్టీ ముస్లింల వైపే | all parties are looking to muslims | Sakshi
Sakshi News home page

అందరి దృష్టీ ముస్లింల వైపే

Mar 22 2014 11:47 PM | Updated on Mar 29 2019 9:01 PM

ఇన్నాళ్లూ కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికర అంశంగా మారింది.

ఇన్నాళ్లూ కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికర అంశంగా మారింది. ధరల పెరుగుదల, అవినీతి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం ముస్లింలకు ఈసారి ప్రధాన అంశాలని చెబుతున్నారు.
 
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు మారాయి. కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు ఈసారి ఏం చేస్తారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం నేపథ్యంలో వీరి నిర్ణయం కీల కంగా మారింది. ముఖ్యంగా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్న నేపథ్యంలో ఈ చర్చ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
 
 ఢిల్లీ జనాభాలో 12 శాతమున్న ముస్లింలు చాందినీచౌక్, నార్త్ వెస్ట్ ఢిల్లీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలుగుతారు. దీంతో అన్ని పార్టీలూ వీళ్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 45 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీకి 34 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి.
 
 కాంగ్రెస్ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ తరపున గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో నలుగురు ముస్లింలే. బల్లిమారన్ నుంచి హరూన్ యూసఫ్, ఓఖ్లా నుంచి ఆసిఫ్ మహ్మద్‌ఖాన్, సీలంపూర్ నుంచి మతీన్ అహ్మద్, ముస్తఫాబాద్ నుంచి హసన్ అహ్మద్ భారీ మెజారిటీతో గెలిచారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం వెనుక ముస్లిం ఓటర్ల మద్దతు ఉంది.
 
 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం తరువాత ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటేయడంపై పునరాలోచనలో పడ్డారు. ధరల పెరుగుదల, అవినీతి వంటి అంశాలతోపాటు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం ముస్లింలకు వీరికి ఈసారి ప్రాధాన్య అంశాలుగా ఉన్నాయి. మోడీ ప్రభంజనాన్ని అడ్డుకోగల సత్తా కాంగ్రెస్‌కు లేదని కొందరు ముస్లింలు అంటున్నారు.
 
 ఆమ్ ఆద్మీ పార్టీ దీనిని అవకాశంగా తీసుకుని ముస్లిం ఓటర్లను తనవైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. బీజేపీ కూడా తమ నగరంలో అత్యధిక సీట్లు గెలవాలంటే అన్ని వర్గాల మద్దతు అవసరమన్న విషయాన్ని గుర్తించింది. ఈ మేరకు బీజేపీ ముస్లిం సమ్మేళన్ పేరుతో ఇటీవలే ఢిల్లీలో ఓ కార్యక్రమం నిర్వహించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement