
మోడీ మంచి పాలనాదక్షుడు
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ వెంటరాగా.. ఆ పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ శనివారం గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
అద్వానీ కితాబు
మోడీ వెంటరాగా గాంధీనగర్ నుంచి నామినేషన్
కానీ వాజ్‌పేయితో మోడీని పోల్చలేం
గాంధీనగర్ నుంచి పోటీ సంతోషకరం..
సీటు మారాలని ఏనాడూ అనుకోలేదని వ్యాఖ్య
అద్వానీ నుంచి తానెంతో నేర్చుకున్నానన్న గుజరాత్ సీఎం
గాంధీనగర్(గుజరాత్): బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ వెంటరాగా.. ఆ పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ శనివారం గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అద్వానీ నామినేషన్ పత్రాలను మోడీ స్వయంగా గాంధీనగర్ రిటర్నింగ్ అధికారికి అందజేశారు. 86 ఏళ్ల అద్వానీ ఈసారి ఎన్నికల్లో భోపాల్ నుంచి పోటీ చేయాలని భావించగా.. బలవంతంగా గాంధీనగర్ నుంచే బరిలోకి దిగేలా ఒప్పించారన్న వార్తల నేపథ్యంలో ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకుంది. కొంతకాలంగా మోడీ, అద్వానీ మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయన్న కథనాలు వినిపిస్తుండడం విదితమే. వీటికి తెరదించుతూ తాము ఒక్కటిగానే ఉన్నామన్న సంకేతాన్ని మోడీ, అద్వానీలు నామినేషన్ కార్యక్రమం ద్వారా ఇచ్చారు. దీనికి మోడీతోపాటు రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆనందిబెన్ పటేల్ తదితరులు హాజరయ్యారు.
నామినేషన్ పత్రాల దాఖలుకు ముందు కార్యకర్తలనుద్దేశించి మోడీ మాట్లాడుతూ.. అద్వానీ భారీ మెజారిటీతో విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. అద్వానీని పార్టీకి మూలస్తంభమని ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన పార్టీకి, దేశానికి చేసిన సేవలు ఎన్నతగినవన్నారు. ఆయన్నుంచి తానెంతో నేర్చుకున్నానని చెప్పారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏ ఒక్క రాష్ట్రంలోనూ కాంగ్రెస్ రెండంకెల స్థాయిలో సీట్లను గెలుచుకోలేదని, కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈసారి కాంగ్రెస్‌కు చెందిన కనీసం ఒక్క అభ్యర్థి కూడా ఎన్నిక కాబోడని మోడీ వ్యాఖ్యానించారు. అద్వానీ మాట్లాడుతూ.. మోడీపై ప్రశంసలు కురిపించారు. ఆయన మంచి పాలనాదక్షుడని కితాబిచ్చారు. మోడీని మించిన అద్భుతమైన, అత్యుత్తమమైన ఈవెంట్ మేనేజర్‌ను తానింతవరకు చూడలేదన్నారు.
ఈవిధమైన ఈవెంట్ మేనేజ్‌మెంట్ సామర్థ్యాన్ని ఆయన పాలనలోనూ తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. ఏదేమైనా మోడీ తిరుగులేని నాయకుడిగా నిరూపించుకున్నారన్నారు. అయితే అటల్ బిహారీ వాజ్‌పేయితో మాత్రం పోల్చుకోవద్దని మోడీని ఆయన సుతిమెత్తగా హెచ్చరించారు. వాజ్‌పేయి ఓ దిగ్గజమన్నారు. గాంధీనగర్ నుంచి పోటీ చేయడం తనకు సంతోషకరమైన విషయమని అద్వానీ అన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన స్నేహితులు భోపాల్ నుంచి పోటీ చేయాలని తనను కోరారు తప్ప.. తాను మాత్రం గాంధీనగర్ నుంచి పోటీ చేయరాదని ఎప్పుడూ భావించలేదని ఆయన చెప్పారు. నియోజకవర్గం ఎంపికలో ఎటువంటి వివాదం లేదని స్పష్టం చేశారు. తనకు గాంధీనగర్‌తో, అలాగే గుజరాత్‌తో దశాబ్దాలుగా అనుబంధం ఉన్నదని గుర్తు చేశారు.
అద్వానీ ఆస్తుల విలువ రూ. ఏడు కోట్లు!
అద్వానీ, ఆయన కుటుంబం ఆస్తుల విలువ రూ.ఏడు కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అఫిడవిట్‌ను అనుసరించి.. 2009 ఎన్నికల నాటికంటే ఆయన, ఆయన కుటుంబ ఆస్తులు రెట్టింపయ్యాయి. గత ఎన్నికలప్పుడు ఆయన ఆస్తుల విలువను రూ.3.5 కోట్లుగా చూపారు. ప్రస్తుతం అద్వానీకి గుర్గావ్‌లో రెండు ఇళ్లు, గాంధీనగర్‌లో మరో ఇల్లు ఉంది. ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం వాటి విలువ రూ.5.57 కోట్లు ఉంటుందని అంచనా. అద్వానీ పేరిట రూ.97.23 లక్షల డిపాజిట్లు ఉండగా.. ఆయన భార్య పేరిట రూ.67.13 లక్షల డిపాజిట్లు ఉన్నాయి.
ఈవెంట్ మేనేజర్లు దేశాన్ని పాలించలేరు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: మోడీని అద్భుతమైన ఈవెంట్ మేనేజర్‌గా అద్వానీ వ్యాఖ్యానించడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఈవెంట్ మేనేజర్లు లేదా క్రోనీ కేపిటలిస్టులు(లాలూచీ పెట్టుబడిదారులు) దేశాన్ని పాలించలేరని పేర్కొంది. కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జివాలా శనివారమిక్కడ మాట్లాడుతూ నాయకత్వం, విధానాలు, కార్యక్రమాల ద్వారానే దేశం నడుస్తుంది తప్ప ఈవెంట్ మేనేజర్లు, క్రోనీ కేపిటలిస్టుల ద్వారా కాదని విమర్శించారు.