ఆదాయం లేని జోన్‌!

Sakshi editorial On Visakha Railway Zone

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల... ప్రత్యేకించి ఉత్తరాంధ్రవాసుల చిరకాల వాంఛ నెరవేరింది. దశాబ్దాలుగా వారు కోరుకుంటున్న రైల్వే జోన్‌ ఎట్టకేలకు సాకారమైంది. కానీ ఎప్పటిలాగే వారికి అసంతృప్తే మిగిలింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఇస్తున్నట్టు బుధవారం రాత్రి రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. కానీ అది నామమాత్రమైనదేనని కొద్దిసేపటికే ప్రజలందరికీ అర్ధమైంది.  ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నానికి రెండ్రోజుల్లో వస్తారనగా, ఒకటి రెండు రోజుల్లో జమిలి ఎన్నికల నగారా మోగబోతుండగా ప్రకటించిన ఈ రైల్వేజోన్‌ వేరు... రాష్ట్ర ప్రజలు ఇన్ని దశా బ్దాలుగా కోరుకుంటున్న రైల్వే జోన్‌ వేరు. విశాఖ కేంద్రంగా కొత్తగా ఏర్పడే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లుంటాయి. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌లోని ఒక భాగం విజయవాడ డివిజన్‌లోకి విలీనం చేస్తుండగా, మరో భాగాన్ని రాయగడ కేంద్రంగా ఏర్పాటు కాబోయే డివిజన్‌కు తీసుకెళ్తున్నారు. ఆ డివిజన్‌ భువనేశ్వర్‌ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్‌ పరిధిలో ఉంటుంది. ఏతావాతా మూడు నెలలక్రితం 125వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న వాల్తేరు డివిజన్‌ కాస్తా మాయం కాబోతోందన్న మాట! రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకోసం కేంద్రంపై ఒత్తిళ్లు తీసుకురాగలిగే సత్తాలేని పాలకులు రాష్ట్రాన్ని ఏలుతున్నప్పుడు ఈ దుస్థితి తప్పదు.

వాల్తేరు డివిజన్‌ మాయం కావడం కేవలం భావోద్వేగపరమైన అంశం మాత్రమే కాదు...కొత్త రైల్వే జోన్‌కు ఆర్థికంగా కష్టాలు తెచ్చిపెట్టే అంశం కూడా. రద్దవుతున్న వాల్తేరు డివిజన్‌ ఏటా భారీగా ఆదాయాన్ని గడించేది. ఆ విషయంలో అది దేశంలోనే అయిదో స్థానంలో ఉంది. వాల్తేరు డివిజన్‌లో ఉన్న కొత్తవలస–కిరండోల్‌ లైన్‌(కేకే లైన్‌), కోరాపుట్‌–రాయగడ లైన్‌(కేఆర్‌ లైన్‌)లు రెండూ ఆదాయం రీత్యా అత్యంత కీలకమైనవి. బైలదిల్లా గనుల నుంచి విశాఖలోని రెండు ఓడ రేవులకూ రవాణా అయ్యే ఇనుప ఖనిజం వల్లే ఈ స్థాయి ఆదాయం లభిస్తోంది. నిరుడు వాల్తేరు డివిజన్‌ రూ. 7,500 కోట్లకుపైగా ఆదాయాన్ని గడించింది. కానీ తాజా నిర్ణయం ప్రకారం ప్రయాణికుల ద్వారా లభించే ఆదాయం విశాఖ కేంద్రంగా ఏర్పడే రైల్వే జోన్‌కూ... సరుకు రవాణా ద్వారా వచ్చే ఆదాయం భువనేశ్వర్‌ జోన్‌లోని రాయగడ డివిజన్‌కూ  వెళ్తాయి. కానీ కేకే లైన్‌ పరి ధిలో అరకు వరకూ ఉన్న రైలు మార్గం నిర్వహణ భారం మాత్రం విశాఖ జోన్‌కు బదిలీ అవుతుంది.  బైలదిల్లా గనులు ఒడిశా పరిధిలో ఉంటే... అక్కడి ఖనిజం విశాఖ ఓడరేవులకు రవాణా అవు తుంది. కనుక సమన్యాయం చేయదల్చుకుంటే ఇనుప ఖనిజం రవాణా ద్వారా లభించే ఆదా యాన్ని భువనేశ్వర్, విశాఖ రైల్వే జోన్‌లకు చెరి సగం పంచాలి. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల చిరకాల వాంఛను సాకారం చేస్తున్నామని సగర్వంగా చెప్పుకుంటూ కూడా కేంద్రం ఆ దిశగా ఆలోచిం చకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

విశాఖ రైల్వే జోన్‌ కావాలన్న ఉద్యమం బలం పుంజుకున్నకొద్దీ ఒడిశానుంచి కేంద్రంపై ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి. వాల్తేరు డివిజన్‌ను తొలగిస్తే తమ తూర్పు కోస్తా రైల్వే చతికిలబడుతుందని, దీన్ని తాము సహించబోమని నాలుగేళ్లక్రితమే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కేంద్రాన్ని హెచ్చరించారు. అప్పట్లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీతో అంటకాగిన చంద్రబాబు ఈ అంశంలో నోరెత్తలేదు. విశాఖ రైల్వే జోన్‌ తమ హక్కని, అందులో వాల్తేరు డివిజన్‌ ఉండితీరాలని గొంతెత్తి చెప్పాల్సి ఉండగా, కేంద్రంలో తన పలుకుబడిని ఉపయోగించి అది వెనువెంటనే సాకారం కావడానికి కృషి చేయాల్సి ఉండగా ఆయన నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. బీజేపీకి దూరంగా ఉంటూనే నవీన్‌ పట్నాయక్‌ పంతం నెగ్గించుకోగా బాబు మాత్రం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ఎగనామం పెట్టారు. ఇంకా వెనక్కు వెళ్తే... ఆగ్నేయ రైల్వేలో భాగంగా కొనసాగుతూ వస్తున్న విశాఖ డివిజన్‌ 2003లో భువనేశ్వర్‌ జోన్‌ పరిధిలోకి బదిలీ అయింది. ఆ సమయానికి కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఖర్మ కాలి చంద్రబాబే ముఖ్యమంత్రి. అప్పుడు సైతం ఆయన బీజేపీతో కాపురం చేస్తూ కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. అప్పట్లో ఆయన గట్టిగా పట్టుబట్టి ఉంటే వాల్తేరు డివిజన్‌ భువనేశ్వర్‌ జోన్‌కు పోకుండా కొత్తగా ఏర్పడే విశాఖ రైల్వే జోన్‌లో భాగమయ్యేది. ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయమేమంటే... వాల్తేరు డివిజన్‌ను తూర్పు కోస్తా రైల్వేకు వదిలిపెడితేనే ఏపీకి కొత్త రైల్వే జోన్‌ మంజూరు చేస్తామని 2016 సెప్టెంబర్‌లో కేంద్రం మెలిక పెట్టినప్పుడు ‘ఇతరత్రా రాష్ట్ర ప్రయోజనాల కోసం’ అందుకు చంద్రబాబు అంగీకరించారని ఆయన అనుకూల మీడియానే కథనాలు రాసింది. ఇన్నివిధాలుగా జనం ప్రయోజనాలు తాకట్టుపెట్టి ఇప్పుడు ఏం ఎరగనట్టు కేంద్రంపై విమర్శలు గుప్పించడం తెలుగుదేశానికే చెల్లింది. 

ఏపీకి కొత్త రైల్వే జోన్‌ రావడం ఇంత సంక్లిష్టమైన సమస్యగా మారడం, అందుకోసం నాలుగున్నరేళ్లుగా జనం ఉద్యమించాల్సి రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 1951నాటికి దేశంలో కేవలం ఆరు రైల్వే జోన్‌లు ఉంటే, ఆ మరుసటి ఏడాదికే అవి 9 కి చేరాయి. ఆ తర్వాత మరో రెండు కొత్త జోన్లు ఆవిర్భవించి అవి 11కు పెరగ్గా, 2003 నాటికి అవి 17 అయ్యాయి. ఈ రైల్వే జోన్‌లలో చాలావాటికి రాజకీయ పరమార్ధమే తప్ప శాస్త్రీయ ప్రాతిపదిక లేదు. కానీ వాల్తేరు డివిజన్‌కు రైల్వే జోన్‌గా మారడానికి అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నా... దశా బ్దాలుగా ఏపీ ప్రజలు కోరుతున్నా... విభజన సమయంలో వాగ్దానం చేసినా అది సాకారం కావ డానికి ఇన్నేళ్లు పట్టింది. కానీ ఏం లాభం? దానికి న్యాయంగా దక్కాల్సిన ఆదాయ వనరుల్ని తెగ్గోసి, భారాన్ని మాత్రం దండిగా మోపారు. దీన్ని సరిచేయడంతోపాటు విభజన వాగ్దానాల్లో ఒకటైన ప్రత్యేక హోదాకు సైతం ఆమోదముద్ర వేసి ఎన్‌డీఏ ప్రభుత్వం తన బాధ్యతను నెర వేరుస్తుందని ఆశిద్దాం. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top