ట్రంప్‌ ‘ఆత్మ విమర్శ’

Editorial On American President Donald Trump Impeachment - Sakshi

‘అభిశంసన’ భూతం వైట్‌హౌస్‌ తలుపు తడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. పశ్చిమాసియా యుద్ధ క్షేత్రాలనుంచి తమ సైన్యాలు నిష్క్ర మించడం ఖాయమని ట్విటర్‌ ద్వారా ఆయన ప్రపంచానికి చాటారు. అయితే తమ అధ్యక్షుడు చేసిన ప్రకటనను అక్కడి విదేశాంగ శాఖ ఎలా తీసుకుంటుందో, రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంట గాన్‌ ఏమంటుందో, ప్రత్యేకించి ట్రంప్‌ను నెత్తిన పెట్టుకుని ఆయన్ను దేశాధ్యక్షుణ్ణి చేసిన రిపబ్లికన్‌ పార్టీ ఏం చేస్తుందో, అమెరికన్‌ కాంగ్రెస్‌ ఎలా స్పందిస్తుందో ఇంకా చూడాల్సి ఉంది. ఆ దేశంలో అంతర్గత పరిణామాలు చివరకు ఎటు పయనిస్తాయన్న సంగతలా ఉంచితే... వరస ట్వీట్ల ద్వారా ట్రంప్‌ చాలా విషయాలే చెప్పారు. చెప్పారనేకంటే అందరూ దశాబ్దాలుగా చెబుతున్న అంశాలనే ఆయన ధ్రువీకరించారనాలి. జన విధ్వంసక ఆయుధాలున్నాయన్న తప్పుడు అభిప్రాయంతో పశ్చి మాసియాలోకి ప్రవేశించడం దేశ చరిత్రలో అత్యంత దారుణమైన నిర్ణయమని ట్రంప్‌ అంగీకరిం చారు. అలాంటి ఆయుధాలు లేవని అనంతరకాలంలో తేలిందని ఆయన గుర్తు చేశారు. ఈ తప్పుడు నిర్ణయం పర్యవసానంగా దేశం 8 లక్షల కోట్ల డాలర్లు నష్టపోయిందని, వేలాదిమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఆయన వాపోయారు.  

అమెరికాకు జరిగిన నష్టం గురించే ట్రంప్‌ మాట్లాడుతున్నారు. తాము దురాక్రమించిన, దాడులు చేసిన దేశాల స్థితిగతుల గురించి మౌనంవహిస్తున్నారు.  ఆ దేశాల దుస్థితి చూస్తే ఎలాంటి వారికైనా కళ్లు చెమరుస్తాయి. ఇరాక్‌ నుంచి సిరియా వరకూ అన్ని దేశాలదీ ఒకే వ్యథ. ఆ దేశాలన్నీ దాదాపు వల్లకాళ్లుగా మారాయి. లక్షలాదిమంది ప్రజానీకం బాంబు దాడుల్లో, క్షిపణి దాడుల్లో దుర్మ రణం పాలయ్యారు. మరిన్ని లక్షల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. తమ ఆప్తుల్లో అనేకులు మరణించారో... సముద్రాలు దాటి వేరే దేశాల్లో తలదాచుకుంటున్నారో తెలియని అయోమయంలో అనేక కుటుంబాలున్నాయి. ఇంటికి కనీసం ఇద్దరు, ముగ్గురు అంగవికలులయ్యారు. అమెరికా నిర్వాకం వల్ల ఐఎస్‌ వంటి ఉగ్రవాద భూతాల పాలబడి మహిళలు, బాలికలు ఎదుర్కొన్న హింస చెప్పనలవికానిది. వారు అత్యాచారాలకూ, ఇతర లైంగిక హింసలకూ బలైపోయారు. సర్వస్వం కోల్పోయారు. వారిని నడిరోడ్డుపై సంతలో పశువుల్లా వేలం వేసిన ఉదంతాలు వెల్లడై ప్రపంచం దిగ్భ్రాంతిలో మునిగింది. చిన్న చిన్న పిల్లలు సైతం బలవంతంగా మానవ బాంబులుగా మారి తమ ప్రాణాలు బలిపెట్టారు. భారీ విధ్వంసాలకు కారకులయ్యారు.

ఇప్పటికీ ఆ దేశాలు జరిగిన నష్టం నుంచి కోలుకోలేదు.  అక్కడ శిథిల గృహాలు, చిన్నాభిన్నమైన జీవనం, మనిషి అన్న ప్రతివాడినీ అను మానంతో చూసే కళ్లూ దర్శనమిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికా తీసుకున్న తప్పుడు నిర్ణయం పర్యవసానంగా ఆ దేశాల్లో కనీసం రెండు, మూడు తరాల భవిష్యత్తు సర్వనాశనమైంది. తిండి, బట్ట, విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస అవసరాలకు కూడా దిక్కులేని స్థితి ఏర్పడింది. ఆ దేశాల ప్రజానీకానికి జరిగిన నష్టాలముందు... వారు ఎదుర్కొన్న, ఇప్పటికీ ఎదుర్కొంటున్న కష్టా లముందు అమెరికా కోల్పోయింది లేశమాత్రమే అని చెప్పాలి. ట్రంప్‌ ప్రకటన ఏమేరకు సాకారమవు తుందన్న సంగతలా ఉంచితే ఆయనే స్వయంగా తమ దేశం చేసినవి తప్పుడు పనులని అంగీకరిం చారు గనుక పశ్చిమాసియా దేశాల ప్రజలకు క్షమాపణ చెప్పడం, వారికి పరిహారం చెల్లించడం కనీస బాధ్యత.

దాన్ని ఆయన గుర్తించకపోతే ఐక్యరాజ్య సమితి ఆ పని చేయించాలి. బోస్నియాలో 1992లో సాగిన నరమేథానికి కారకులైనవారిని 20 ఏళ్ల పాటు విచారించి యుద్ధ నేరస్తులుగా నిర్ధారించి శిక్షలు విధించారు. దశాబ్దంక్రితం శ్రీలంకలో తమిళ టైగర్లను అణిచేపేరిట సాగిన నరమేథాన్ని యుద్ధ నేరంగా పరిగణించాలంటూ భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్‌లు కోరుతున్నాయి. రెండేళ్లలో ఆ దేశం తనకు తానుగానే నిష్పాక్షిక న్యాయవిచారణ నిర్వహించి నేరగాళ్లపై చర్యలు తీసుకోవాలని మండలి గత మార్చిలో గడువు విధించింది. మరి ఇప్పుడు పశ్చిమాసియా విషయంలో అమెరికా, దాని మిత్ర దేశాలపై సమితి ఈ పనిచేయగలదా? దాని తరం కాదన్న భరోసాతోనే ట్రంప్‌ ఈ మాదిరి ట్వీట్లు చేయగలుగు తున్నారు.

అమెరికా సైన్యం చొరబడినంత సులభం కాదు... వెనక్కి రావడం. ఆ దేశాలన్నీ ఇప్పుడు పర స్పర అవిశ్వాసంతో, ఘర్షణలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇరుగు పొరుగుతో నిత్యం సంఘర్షిస్తు న్నాయి. ఇప్పుడు సిరియా స్థితి అదే. తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటామని ట్రంప్‌ చెప్పిన కొన్ని గంటలకే సిరియా ఉత్తర ప్రాంతంలోని కుర్దుల ప్రాంతాలపై టర్కీ బాంబుల వర్షం కురిపిం చడం ప్రారంభించింది. వేలాదిమంది ఇళ్లూ వాకిళ్లూ వదిలి ప్రాణభయంతో పరుగులు పెడుతు న్నారు. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని వైట్‌ హౌస్‌ చెప్పడంతో టర్కీ అధ్యక్షుడు ఎర్డో   గాన్‌ మరింత విజృంభిస్తున్నారు. ఇన్నాళ్లూ అమెరికాకు అండగా ఉండి, ఇరాక్‌లో సైతం ఐఎస్‌ను అణ చడంలో తోడ్పడిన కుర్దులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

ఈ పరిణామాలు చూశాక తమ సైన్యాన్ని సిరియా ఉత్తరప్రాంతానికి తరలించాలనుకుంటున్నామని అమెరికా రక్షణ శాఖ ప్రతి నిధి చెబుతున్నారు. దీనికి ట్రంప్‌ ఆమోదం ఉందో లేదో తేలలేదు. సిరియాలో అంతక్రితం తమ సైని కులు 2,000మంది ఉంటే ఆర్నెల్లక్రితం సగం మందిని వెనక్కు రప్పించారు. ఇప్పుడు మరింత తగ్గిస్తా మన్న ప్రకటనను ఆయన నిలబెట్టుకుంటారో లేదో చూడాల్సి ఉంది. ట్రంప్‌ మాటలు నిజంగా ఆచ రణలోకొస్తే ఏం చేయాలన్నది ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు చర్చించి నిర్ణయిం చాలి. తదనుగుణంగా అమెరికా, మిత్ర దేశాలు నడుచుకోవాలి. అఫ్ఘానిస్తాన్, లిబియా, సోమాలియా, ఇరాక్‌ వంటిచోట్ల ఇన్నేళ్లుగా సాగించిన దారుణాలను విచారించడానికి సహకరించాలి. ఇవేమీ చేయ కుండా సైన్యాన్ని వెనక్కి తీసుకొచ్చి అమెరికాను ఉద్ధరిస్తానంటే ప్రపంచ ప్రజానీకం సహించదు.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top