
బాబూ... ఇదా మీ నిర్వాకం?!
‘నువ్వు నిజంగా తూర్పు వైపు వెళ్లాలనుకుంటే పడమర దిశగా పోవద్దు...’ అంటాడు రామకృష్ణ పరమహంస.
‘నువ్వు నిజంగా తూర్పు వైపు వెళ్లాలనుకుంటే పడమర దిశగా పోవద్దు...’ అంటాడు రామకృష్ణ పరమహంస. విజయవాడ నగరంలో పదిరోజులనాడు బయటపడిన కాల్‌మనీ-సెక్స్ రాకెట్ విషయమై చట్టసభల్లో గంభీర ఉపన్యాసాలిచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... చేతల్లోకొచ్చేసరికి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అందరినీ దిగ్భ్రమకు గురిచేస్తున్నారు. నూతన రాజధాని నిర్మాణాన్ని దెబ్బతీసేలా, అప్రదిష్టపాలు చేసేలా ఆరోపణలు చేయడాన్ని మానుకుని ఆధారాలుంటే ఇవ్వాలని విపక్షాలకూ, మీడియాకూ సవాళ్లు విసురుతున్నారు. ఉన్న ఆధారాలపై తీసుకున్న చర్యేమిటో, కీలక నిందితులంతా ఇంకా చట్టానికి చిక్కకపోవడానికి కారణాలేమిటో సంజాయిషీ ఇవ్వాల్సిన సమయంలో బాబు ఈ బాపతు ఎదురుదాడులకు దిగుతున్నారు.
కాల్ మనీ-సెక్స్‌రాకెట్ వ్యవహారం అత్యంత హేయమైనది. సమాజం ఉనికినే ప్రశ్నార్థకం చేసే ఉదంతమది. విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఇంతవరకూ 300కుపైగా ఫిర్యాదులు రావడమేకాక...వాటి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. అధిక వడ్డీ వసూలు, ఆస్తుల కబ్జా, బెదిరింపుల వంటివి మాత్రమే కాదు...మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడటం, వారితో అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించడం, వాటిని రహస్యంగా చిత్రీకరించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడటంవంటి ఎన్నో దారుణాలు అందులో ఉన్నాయి. బాధితులు వెల్లడిస్తున్న అంశాలు మాట్లాడుకోవడానికీ, తిరిగి చెప్పడానికీ సాధ్యంకానంత ఘోరంగా ఉన్నాయని సీనియర్ పోలీస్ అధికారి చేసిన వ్యాఖ్యానం ఆ దుర్మార్గుల ఆగడాలకు అద్దం పడుతుంది.
ఇందులో కొందరు పాలకపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల ప్రమేయం ఉన్నదని ...నిందితుల్లో కొందరికి అమాత్యుల అండదండలున్నాయని మీడియాలో ఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసు విస్తృతి, లోతు గమనించినవారెవరైనా రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించి ఆ ఆరోపణల్లోని నిజానిజాలను బయట పెట్టాలని ఆశిస్తారు. కానీ ఇంతవరకూ ఏడుగురు నిందితులపై మాత్రమే నిర్భయ చట్టంతోపాటు వేర్వేరు సెక్షన్లకింద కేసులు నమోదుకాగా అందులో ముగ్గురే అరెస్టయ్యారు. మిగిలినవారు ఏమయ్యారో తెలియకముందే బాధితులకు బెదిరిం పులు మొదలయ్యాయని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తమపై సాగిన దౌష్ట్యాలను బయటపెట్టుకోవడం ఇష్టంలేనివారు కొందరైతే...చెప్పుకున్నా న్యాయం లభిస్తుందన్న భరోసా లభించనివారు మరికొందరు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం వేసే ప్రతి అడుగూ బాధితులకు మనోస్థైర్యాన్నిచ్చేదిగా ఉండాలి. తమను వేధించిన దుర్మార్గులపై కఠిన చర్యలుంటాయన్న నమ్మకం ఏర్పరచాలి. జరిగిన ఘోరం వ్యక్తులుగా వారికి మాత్రమే పరిమితమైనది కాదనీ...అది మొత్తం సమాజంపై సాగించిన దాడి అనీ వారికి నచ్చజెప్పాలి. మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. కేసులకు సంబంధించిన ప్రగతి ఎలా ఉన్నదో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అది సవ్యంగా సాగేలా చూడాలి.
తొలి ఫిర్యాదు అందిన మొదలుకొని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గమనిస్తే ఇందులో ఏ ఒక్కటీ జరగలేదని స్పష్టమవుతుంది. శాసనసభ సమావేశాలు మొదలైన రోజునుంచి కాల్‌మనీ-సెక్స్ రాకెట్ ఉదంతంలో చంద్రబాబు మాటలు కోటలు దాటాయి. ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రశ్నే లేదనడం... ఎంత పెద్దవాళ్లయినా కఠినంగా చర్యలు తీసుకుంటామనడం వంటివి అందులో కొన్ని. దానికి సమాంతరంగా కేసును నీరుగార్చే పనులు చాపకింద నీరులా సాగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు, అరెస్టులు అందులో భాగమే. ఆ విషయంలో చూపిన శ్రద్ధలో ఒక్క శాతమైనా కాల్‌మనీ-సెక్స్‌రాకెట్‌పై నిలిపి ఉంటే బహుశా నిందితులంతా దొరికి ఉండేవారు.
కేసు బయటపడిన సమయానికి పార్టీ ఎమ్మెల్యేతోపాటు విదేశాల్లో విహరిస్తున్న కీలక నిందితుడు పత్తా లేకుండా పోతాడు. తిరిగొచ్చిన ఎమ్మెల్యేను అనుమానించకపోతే పోయారు...కనీసం ఆ నిందితుడేమయ్యాడని ఆయన్ను ఆరా తీసే దిక్కేలేదు. ఒకపక్క కీలక నిందితుల్లో ఏ ఒక్కరూ ఇంతవరకూ దొరక్కపోగా...దొరికిన వ్యక్తి బుద్దా నాగేశ్వరరావు స్టేషన్ బెయిల్‌తో స్వేచ్ఛగా బయటికొచ్చాడు. తమ పార్టీ ఎమ్మెల్సీకి స్వయానా సోదరుడైనా అరెస్టు చేశామని అసెంబ్లీలో సీఎం గొప్పగా ప్రకటించుకోగా నిందితుడు మాత్రం రాచమర్యాదలతో ఇంటికెళ్లిపోయాడు. 2010లో నేర శిక్షాస్మృతికి చేసిన సవరణల తర్వాత సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది.
ఏడేళ్లలోపు శిక్షపడగల కేసుల్లోని నిందితులను కోర్టుకు హాజరుపరచాల్సిన అవసరం లేకుండా పోలీసులే బెయిల్ ఇవ్వొచ్చునని ఆ మార్గదర్శకాలు చెబుతున్నాయి. న్యాయస్థానాల విలువైన సమయం వృథా కానీయరాదన్నదే ఆ మార్గదర్శకాల జారీలోని ఆంతర్యం. కానీ నిర్భయ చట్టంకింద అరెస్టయినవారికిగానీ, 120బి వంటి సెక్షన్లకింద అరెస్టయినవారికిగానీ ఇలాంటి మినహాయింపులూ, రాచమర్యాదలూ ఉండవు. మరి నాగేశ్వరరావు విడుదల ఎలా సాధ్యమైంది? కేసులోని నిందితులందరూ పట్టుబడని ప్రస్తుత పరిస్థితుల్లో అరెస్టయిన వారిలో ముఖ్యుడనుకున్న వ్యక్తి బయటికెళ్తే పోలీసుల దర్యాప్తు ఏ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారో...వారు దృష్టి సారించిన అంశాలేమిటో అజ్ఞాతంలో ఉండేవారికి వెల్లడయ్యే అవకాశం ఉండదా? కాల్‌మనీ-సెక్స్ రాకెట్ వ్యవహారంపై శాసనసభలో సవివరమైన చర్చ సాగి ఉంటే ఇలాంటి ప్రశ్నలు మరెన్నో తలెత్తగలవన్న భయంతోనే సభ సక్రమంగా సాగకుండా అధికార పక్షం పదే పదే అడ్డుపడింది. చర్చకు చోటే లేకుండా చేసింది. తనకలవాటైన పద్ధతిలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత దూషణలకూ, ఆరోపణలకూ దిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యురాలు రోజా సస్పెన్షన్ వీటన్నిటికీ పరాకాష్ట.
అడవి తగలబడుతుంటే దాన్ని పరిమితం చేయడం కోసం ‘కౌంటర్ ఫైర్’ను మొదలెట్టినట్టు కుట్రపూరిత విధానాలతో దేన్నయినా కప్పేయగలమని బాబు సర్కారు భావిస్తోంది. ఆడపడుచుల మాన ప్రాణాలతో ఆటలాడుకున్న కీచక మూకలకు పరోక్షంగా అండదండలిస్తోంది. నిర్భయ ఉదంతంలో బాల నేరస్తుడి విడుదలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ సాగుతుండగా...ఏపీలో అలాంటి ఎన్నో ఉదంతాలకు కారకులైన పెద్దమనుషులు చట్టానికి దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. బాబు సర్కారు ఇందుకు సిగ్గుపడాలి.