మళ్లీ ‘చైనా’ గాయం! | again china episode | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘చైనా’ గాయం!

Mar 19 2014 11:37 PM | Updated on Jul 29 2019 7:43 PM

విజయానికి తండ్రులెందరో...అపజయం మాత్రం అనాథ’ అంటారు. ఎంత అనాథ అయినా అపజయం ఊరకే ఉండిపోదు. మౌనంగా కనుమరుగైపోదు.

సంపాదకీయం
 
 ‘విజయానికి తండ్రులెందరో...అపజయం మాత్రం అనాథ’ అంటారు. ఎంత అనాథ అయినా అపజయం ఊరకే ఉండిపోదు. మౌనంగా కనుమరుగైపోదు. తిరిగితిరిగొస్తూ, వచ్చినప్పుడల్లా వివాదం రేకెత్తిస్తూ ఇబ్బందిపెడుతూనే ఉంటుంది. యాభెరైండేళ్లనాడు...1962లో చైనాతో జరిగిన యుద్ధంలో మన దేశం ఎదుర్కొన్న ఓటమి అలాంటిదే. అది హృదయానికి తగిలిన గాయం. అందుకే, అయిదు దశాబ్దాలు దాటుతున్నా బాధిస్తూనే ఉంది.
 
 ఆనాటి ఘోరపరాజయంపైనా, అందుకు దారితీసిన కారణాలపైనా ఇప్పటికి ఎన్నో గ్రంథాలు వెలువడ్డాయి. అలా కొత్త పుస్తకం వచ్చిన ప్రతిసారీ చిన్నదో, పెద్దదో వివాదం రేకెత్తడమూ రివాజైంది. భారత-చైనా యుద్ధం జరిగి యాభైయ్యేళ్లు అయిన సందర్భంగా రెండేళ్లక్రితం కూడా ఆ సమరంపై భిన్నకోణాలనుంచి కథనాలు వెలువడ్డాయి. సైన్యంలో పనిచేసి రిటైరైన సీనియర్ అధికారులు కొందరు తమ తమ అంచనాలను చెప్పారు. ఇప్పుడు మరోసారి ఆ ఓటమిపై దుమారం రేగుతోంది. ఆ ఘోరపరాజయం వెనకున్న కారణాలపై అప్పట్లోనే రూపొందిన ఒక రహస్య నివేదికలోని భాగాలు వెల్లడికావడం తాజా దుమారానికి మూలం. యుద్ధంలో పాల్గొన్న ఆనాటి లెఫ్టినెంట్ జనరల్ హెండర్సన్ బ్రూక్స్ ఈ నివేదికను రూపొందించారు.

 

ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిందీ... అన్నివిధాలా కాపాడుకుంటూ వస్తున్నదీ కూడా తామేనని చెప్పుకుంటున్న నెహ్రూ కుటుంబవారసుల చేతుల్లోనే ఇంకా అధికార పగ్గాలున్నాయి. పైగా ఇప్పుడు ఎన్నికల కోలాహలం మొదలైంది. అందువల్లే బ్రూక్స్ నివేదిక ఇప్పుడు మరింత సంచలనం సృష్టిస్తోంది. నెహ్రూకు పోటీగా సర్దార్ పటేల్‌ను నిలుపుతున్న బీజేపీ ఈ నివేదిక పూర్తి ప్రతిని బయటపెట్టాలని డిమాండుచేస్తోంది. సర్దార్ పటేల్ సంస్థానాలన్నిటినీ దారికితెచ్చి దేశాన్ని దృఢంగా నిలిపితే, నెహ్రూ తన చేతగాని విధానాలతో ఓటమి అంచులకు నెట్టారని బీజేపీ విరుచుకుపడుతోంది.
 
 

‘అధికార రహస్యాల’ మాటున దేన్నయినా కప్పెట్టడం, పౌరులకు అందుబాటులో లేకుండా ముసుగు కప్పడం మన పాలకులకు ఆదినుంచీ ఉన్న అలవాటు. బహుశా ఈ దురలవాటు వారికి లేనట్టయితే చైనా యుద్ధంపై ఇప్పుడింతగా దుమారం రేగేది కాదేమో! తొలినాళ్లలో అయితే భావోద్వేగాలు కలిగిస్తుందనో, అనవసర ఆవేశాన్ని రగుల్చుతుందనో భావించి నివేదికను రహస్యంగా ఉంచారంటే అర్ధం చేసుకోవచ్చు. ఏ దేశ పాలకులైనా చేసే పనే అది. అయితే నిర్దిష్ట గడువు తర్వాత అలాంటి నివేదికలను బహిర్గతం చేస్తారు. ముగిసిపోయిన అధ్యాయంలో లోటుపాట్లేమిటో, ఎక్కడ తప్పులు జరిగాయో చర్చించడంవల్ల దేశానికి ప్రయోజనం కలుగుతుందే తప్ప నష్టం సంభవించదు. ఆనాటి చైనా యుద్ధంపై రకరకాల వాదనలు ప్రచారంలో ఉన్నాయి. చాంగ్ కైషేక్ మన దేశ స్వాతంత్య్రోద్యమానికి మద్దతు పలికినా, ఆనాటి కాంగ్రెస్ నాయకులు దాన్ని విస్మరించి, ఆయనపై కత్తిగట్టిన మావో నేతృత్వంలోని కమ్యూనిస్టులకు మద్దతునిచ్చారని...తీరా అధికారంలోకొచ్చాక మావో ప్రభుత్వం ద్రోహచింతనతో యుద్ధానికి దిగిందని కొందరంటారు. కాదు...అమెరికా ప్రేరణతో నెహ్రూ చైనాపై కయ్యానికి కాలుదువ్వారని, దేశ ప్రతిష్టను దెబ్బతీశారని మరికొందరి వాదన. ఎవరి వాద నలు ఎలా ఉన్నా హిమవన్నగాల్లో, గడ్డకట్టించే చలిలో, చాలీచాలని ఆయుధ సామగ్రితోనే మృత్యువుకు వెరవక శత్రు సైన్యంపై భీకరపోరాటం చేసిన చరిత్ర మన సైనికులది. వారి అనుపమ త్యాగాల తర్వాత కూడా మనకు విజయం లభించలేదంటే అది ఆనాటి రాజకీయ నాయకత్వం వైఫల్యమే.
 
 అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడిన 80,000మంది చైనా సైనికులను కేవలం 10,000మంది భారత సైనికులు నిలువరించారు. చివరకు ఓటమే ఎదురైనా...ఇది చైనా కూడా ఊహించని ప్రతిఘటన. ఏకపక్షంగా భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చి నెలరోజుల అనంతరం చైనా తనంతతానే యుద్ధాన్ని విరమించి వెళ్లిపోయింది. సైనికపరంగా కీలకమైన ప్రాంతాలను అధీనంలోకి తెచ్చుకుంది. బ్రూక్స్ రూపొందించిన నివేదిక రాజకీయ నాయకత్వంవైపు ఎలాంటి తప్పిదాలు జరిగాయో చెప్పలేదు. సైనికాధికారిగా ఉంటూ బ్రూక్స్ ఆ పనిచేస్తారని కూడా అనుకోలేం. కానీ, ఆయన లేవనెత్తిన అంశాలు చాలా ముఖ్యమైనవి. లడఖ్ నుంచి చైనా సైనికులను తరిమికొట్టడమే మన ప్రాథమిక లక్ష్యమైనా... సైనికపరంగా మనకున్న ఇబ్బందులేమిటన్న అంశాలపై ఎవరూ దృష్టిపెట్టలేదని, మన సైనికులు ముందుకురికితే చైనా సైనికులు అక్కడినుంచి నిష్ర్కమిస్తారన్న ఇంటెలిజెన్స్ బ్యూరో అంచనాలకే విలువిచ్చారని నివేదిక పేర్కొంది. ఈ విషయంలో ఆర్మీ ప్రధాన కార్యాలయం తప్పిదం కూడా ఉన్నదని అభిప్రాయపడింది.
 
 బ్రూక్స్ నివేదికను దేశ పౌరులకు అందకుండా చేసినా అది దేశదేశాల్లోని సైనిక నిపుణులకు రహస్యమేమీ కాదు. ఈ నివేదికను చదివే మాక్స్‌వెల్ అనే జర్నలిస్టు ‘ఇండియాస్ చైనా వార్’ అనే గ్రంథం రాశాడు. బ్రూక్స్ నివేదికైనా, మరొకటైనా దాచేస్తే దాగే పరిస్థితి లేదు. ఇప్పుడు వెలుగుచూసిన నివేదిక భాగాలుకూడా ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్నవే. అధికారికంగా విడుదలచేసి దాన్ని చర్చించడంవల్ల ఈనాటికీ అస్తవ్యస్థంగా ఉంటున్న మన విదేశాంగ విధానానికి, మరీ ముఖ్యంగా చైనా విషయంలో అనుసరిస్తున్న వైఖరికి పదునుపెట్టుకోవచ్చు. లోపాలను సరిదిద్దుకోవచ్చు. దానివల్ల దేశానికి ప్రయోజనం కలుగుతుంది తప్ప నష్టం జరగదు. కానీ, ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. బ్రూక్స్ నివేదికను బయటపెట్టాలని డిమాండు చేస్తున్న బీజేపీ తీరు కూడా ఆశ్చర్యకరం. అధికారంలో ఉన్నప్పుడు వారికి ఈ జ్ఞానం ఎందుకు కలగలేదో అనూహ్యం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement