వహ్‌ చైనా.. వాట్‌ ఏ డబుల్‌ గేమ్‌! | Iran War: USA Intel Suspect China Double Game | Sakshi
Sakshi News home page

వహ్‌ చైనా.. వాట్‌ ఏ డబుల్‌ గేమ్‌!

Apr 11 2026 1:13 PM | Updated on Apr 11 2026 1:15 PM

Iran War: USA Intel Suspect China Double Game

పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు పాకిస్తాన్‌ చేస్తున్న ప్రయత్నాలపై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువ వినిపిస్తున్నాయి. లెబనాన్‌ను కాల్పుల విరమణ పరిధిలోకి తేకపోవడమే ఇందుకు కారణం. ఈ తరుణంలో ఇస్లామాబాద్‌ చర్చలు తేడా కొడితే.. అంతర్జాతీయంగా ఆ దేశం పరువు పోవడం ఖాయంగా కనిపిస్తోంది.  అయితే అమెరికా-ఇరాన్‌ను శాంతి చర్చలకు ఒప్పించి సైలెంట్‌గా క్రెడిట్‌ కొట్టేసిన చైనా.. డబుల్‌ గేమ్‌కి తెర తీసినట్లు తెలుస్తోంది.

రెండు వారాల యుద్ధ విరమణలో అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీర్ఘకాలిక శాంతి స్థాపనే ధ్యేయంగా ఇరు వైపులా చేసిన ప్రతిపాదనలపై చర్చించబోతున్నారు. అయితే ట్రంప్‌ వార్నింగ్‌ను బట్టి ఒప్పందం కుదరకపోతే మాత్రం యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం లేకపోలేదు. ఈ తరుణంలో.. ఇరాన్‌కు రహస్యంగా ఆయుధాలు సరఫరా చేసేందుకు చైనా సిద్ధమవుతున్నట్లు అమెరికా గూఢచార సంస్థలు నివేదికలు ఇచ్చాయి!.

సీఎన్‌ఎన్‌ కథనాల ప్రకారం.. ‘‘చైనా త్వరలో ఇరాన్‌కు కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను పంపేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా మాన్‌పాడ్స్ (MANPADs.. భుజంపై మోసుకెళ్లే యాంటీ-ఎయిర్ మిసైల్ వ్యవస్థ)లను రహస్యంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ రవాణా నేరుగా కాకుండా ఇరు దేశాలకు నమ్మకంగా ఉన్న మూడో దేశం ద్వారా జరగొచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారం’’ అని పేర్కొంది.

ఎందుకిలా..
ఒకవైపు ఇరాన్–అమెరికా మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ శాంతి చర్చలకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటిస్తూనే.. మరోవైపు ఇరాన్‌కు సీక్రెట్‌గా ఆయుధాల్ని సరఫరా చేయాల్సిన అవసరం చైనాకు ఎందుకు?.. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ విషయంలో  చైనా ద్వంద్వ వ్యూహాన్ని సూచిస్తోంది.

ఇరాన్‌ చమురు చైనాకు అవసరం. కాబట్టే శాంతి చర్చల ద్వారా చమురు సరఫరా స్థిరంగా ఉండేలా చూడాలనుకుంది. అలాగే అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం చేయడం ద్వారా ప్రపంచ శాంతి దూతగా తనను చూపించుకోవాలని.. తన ప్రతిష్టను పెంచుకోవాలని ప్రయత్నించింది. వీటన్నింటి కంటే హర్ముజ్‌ జలసంధి చైనాకు ఎంతో కీలకం. అందుకే మధ్యవర్తిత్వం జరిపింది. అదే సమయంలో..

అమెరికా ఆంక్షల మధ్య ఇరాన్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా.. ఆ ఆధిపత్యాన్ని ప్రశ్నించినట్లైంది. అదే సమయంలో చైనా తన “Axis of Autocracy (అమెరికా, పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని సవాల్‌ చేసే ధోరణి.. రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్‌ లాంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి) భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటోంది.

అందుకే..  బహిరంగంగా శాంతి ప్రయత్నాలు చేస్తూ, రహస్యంగా ఇరాన్‌కు మిలిటరీ సహాయం అందిస్తూ..  రెండు వైపులా లాభం పొందాలని ప్రయత్నిస్తోందన్నది విశ్లేషకుల మాట.  

అంతర్జాతీయంగా ఆందోళనలు కలిగిస్తున్న సీఎన్‌ఎన్‌ కథనంపై అమెరికా విదేశాంగ శాఖ, వైట్ హౌస్, వాషింగ్టన్‌లోని చైనా దౌత్య కార్యాలయం ఇంకా స్పందించలేదు. చైనా యుద్ధం మొదలైనప్పటి నుంచి బహిరంగంగానే ‘‘మేము ఎవరికి ఆయుధాలు ఇవ్వడం లేదు’’ అని చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ప్రచారాలను కూడా తోసిపుచ్చే అవకాశం లేకపోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement