16 ఏళ్ల బాలిక కిడ్నాప్‌.. అత్యాచారం | Two youth rape on minor girl at shamshabad | Sakshi
Sakshi News home page

16 ఏళ్ల బాలిక కిడ్నాప్‌.. అత్యాచారం

Jul 3 2016 3:46 PM | Updated on Oct 1 2018 6:38 PM

బాలికను అపహరించిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. ఆపై ఆమెకు పురుగులమందు తాగించారు. అందులో ఓ నిందితుడు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

- పురుగుల మందు తాగించి.. తనూ తాగిన నిందితుడు
శంషాబాద్ : బాలికను అపహరించిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. ఆపై ఆమెకు పురుగులమందు తాగించారు. అందులో ఓ నిందితుడు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సాతంరాయి కాలనీ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాలనీ పక్కనే ఉన్న జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం గృహాల్లో నివాసముండే ఓ ఆటో డ్రైవర్ కుమార్తె (16) స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. అదే కాలనీలో నివాసముంటూ ఫిల్టర్ నీళ్లు ఆటోలో సరఫరా చేసే జంగయ్య అలియాస్ జంగ్లీ (21)తోపాటు మరో వ్యక్తి కలిసి శనివారం రాత్రి 7 గంటలకు ఆ బాలికను నమ్మించి, బైక్‌పై ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతంలోని ఓ గదిలోకి తీసుకెళ్లారు.

అక్కడ ఆమెపై అత్యాచారం చేసిన దుండగులు, అనంతరం బాలికకు పురుగులమందు తాగించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం వీరి నుంచి తప్పించుకొని వచ్చిన సదరు బాలిక సమీపంలోని రాళ్లలో పడిపోయింది. ఉదయం 10 గంటలకు కట్టెల కోసం వెళ్లిన స్థానికులు ఆమెను గమనించి ఆరాతీశారు. మెల్లగా.. తన తండ్రి ఫోన్ నంబరు చెప్పిన ఆ బాలిక వెంటనే స్పృహ కోల్పోయింది. దీంతో వారు బాలిక కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వివరాలు సేకరించిన పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చూడడంతో.. ఆ గది పక్కనే స్పృహ కోల్పోయి ఉన్న జంగయ్య కనిపించాడు.

భయంతో అతడు కూడా పురుగుల మందు తాగినట్టు గుర్తించిన పోలీసులు అతడిని కూడా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జంగయ్య వెంట ఉన్న మరో వ్యక్తి ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడు పరారీలో ఉన్నాడు. బాలికతోపాటు నిందితుడు కూడా స్పృహలోకి రాకపోవడంతో పోలీసులు పూర్తి సమాచారాన్ని రాబట్టలేకపోయారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement