తల్లిదండ్రులు తమ పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో ఓ చిన్నారి మంచినీళ్లు అనుకొని కిరోసిన్ తాగడంతో.. అక్కడికక్కడే మృతిచెందింది.
కిరోసిన్ తాగి రేండేళ్ల బాలుడు మృతి
Jul 18 2016 10:02 AM | Updated on Apr 3 2019 8:07 PM
కోవెలకుంట్ల: అభం...శుభం తెలియని బాలుడు మంచి నీళ్లనుకుని కిరోసిన్ తాగి మృతి చెందాడు. ఈ ఘటన కోవెలకుంట్ల మండలం వల్లంపాడు గ్రామం ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. పండిటి నాగార్జున, మేరమ్మ దంపతులు నిరుపేద కుటుంబం కావడంతో కూలీ పనికి వెళుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒకటో తరగతి చదువుతున్న మల్లిక, అంగన్‌వాడీ కేంద్రానికి వెళుతున్న లత, ప్రభాస్ సంతానం. ఒక్కగానొక్కకుమారుడు కావడంతో ప్రభాస్‌ను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఆదివారం నాగార్జున పనివెళ్లాడు. ఆడపిల్లలు వీధిలో ఆడుకుంటుండగా మేరమ్మ ఇంట్లో మిషన్ కుట్టుకుంటోంది. ఇంట్లో ఆడుకుంటున్న ప్రభాస్ బయటకు వచ్చి వంట వండుకుంటున్న ప్రదేశంలో క్వాటర్ బాటిల్‌లో ఉన్న కిరోసిన్‌ను మంచినీళ్లని భావించి తాగుతుండగా పక్కింటికి చెందిన మహిళ గమనించింది. హుటాహుటిన అక్కడకు చేరుకుని బాటిల్‌ను లాక్కుని చికిత్స నిమిత్తం బాలుడిని కోవెలకుంట్లలో ప్రాథమిక కేంద్రానికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నంద్యాల, కర్నూలు ఆసుపత్రులకు తరలించగా కోలుకోలేక సోమవారం ఉదయం మృత్యువాత పడ్డాడు.
Advertisement
Advertisement