అబద్ధాన్ని నిజం చేసేందుకే.. | twist in baby kidnap case | Sakshi
Sakshi News home page

అబద్ధాన్ని నిజం చేసేందుకే..

Jul 23 2016 9:41 AM | Updated on Oct 4 2018 8:29 PM

అబద్ధాన్ని నిజం చేసేందుకే.. - Sakshi

అబద్ధాన్ని నిజం చేసేందుకే..

విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో మగ శిశువు అపహరణ కేసులో నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. శిశువును అపహరించిన కొండవీటి నాగమల్లేశ్వరి(27)తోపాటు ఆమెకు సహకరించిన ఉద్యోగులు పీడియాట్రిక్‌ విభాగంలో రికార్డు అసిస్టెంట్‌ ఆర్‌. శ్రీను, సెక్యూరిటీ గార్డులు ముఖర్జీ, కన్నయ్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన భర్తకు చెప్పిన అబద్ధాన్ని నిజం చేసేందుకు నాగమల్లేశ్వరి ఆ శిశువును అపహరించినట్లు గుర్తించారు. ఇం

విజయవాడ(లబ్బీపేట) : విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో మగ శిశువు అపహరణ కేసులో నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. శిశువును అపహరించిన కొండవీటి నాగమల్లేశ్వరి(27)తోపాటు ఆమెకు సహకరించిన ఉద్యోగులు  పీడియాట్రిక్‌ విభాగంలో రికార్డు అసిస్టెంట్‌ ఆర్‌. శ్రీను, సెక్యూరిటీ గార్డులు ముఖర్జీ, కన్నయ్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన భర్తకు చెప్పిన అబద్ధాన్ని నిజం చేసేందుకు నాగమల్లేశ్వరి ఆ శిశువును అపహరించినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు.

నిందితురాలి నేపథ్యం ఇదీ....
అవనిగడ్డకు చెందిన కొండవీటి నాగమల్లేశ్వరి(27) పదో తరగతి వరకు చదువుకుంది. తన బావ వీరబాబును వివాహం చేసుకుంది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన అనంతరం భర్తతో మనస్పర్థలు రావడంతో విడిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఆమె బంధువుల ఇంటికి వెళ్లి అక్కడ ఒక టైలరింగ్‌ షాపులో పనిచేసింది. ఆ సమయంలో రాకేష్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అతనితో నాలుగేళ్లు కలిసి ఉంది. అనంతరం రాకేష్‌ మరొక మహిళను వివాహం చేసుకోవడంతో నాగమల్లేశ్వరి తిరిగి అవనిగడ్డకు చేరుకుని టైలరింగ్‌ పని చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది.

ఈ క్రమంలో ఉల్లిపాలేనికి చెందిన మద్దా జ్యోతి స్వర్ణరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో 2015 మేలో అతడిని వివాహం చేసుకుంది. స్వర్ణరాజుకు గతంలో తనకు వివాహం జరిగిన విషయాన్ని నాగమల్లేశ్వరి చెప్పలేదు. తనకు పిల్లలు పుట్టరనే విషయం రాజుకు తెలిస్తే వదిలేస్తాడని, భావించి గర్భం వచ్చినట్లుగా రాజును నమ్మించింది. తాను బాత్‌రూమ్‌లో కాలుజారి పడటంతో గర్భసంచి కిందకు జారిందని, అందుకే కడుపు ఎత్తుగా లేదని నమ్మబలికింది. ఈ తరుణంలో ఎవరైనా అనాథ శిశువును తెచ్చుకుని తనకు పుట్టిన బిడ్డగా చూపించి భర్త రాజును నమ్మించాలనే ఉద్దేశంతో మగశిశువుల కోసం చాలాచోట్ల ప్రయత్నించింది.

చెన్నై వెళ్లి ఆపరేషన్‌ చేయించుకుంటానని చెప్పి..
తనకు తొమ్మిదో నెల రావడంతో చెన్నై వెళ్లి ఆపరేషన్‌ చేయించుకుంటానని చెప్పిన నాగమల్లేశ్వరి ఇంటి నుంచి జూలై 11న బయలుదేరి వెళ్లింది. అక్కడ మగశిశువు కోసం ప్రయత్నించినా దొరకలేదు. అనంతరం రైల్వే స్టేషన్‌లోని వెయిటింగ్‌ హాలులో పెట్టిన ఒక సోనీ మొబైల్‌ ఫోన్‌ తస్కరించి ఈ నెల 13న సాయంత్రం విజయవాడ రైల్వేస్టేçÙన్‌కు వచ్చింది. అక్కడి నుంచి పాత ప్రభుత్వాస్పత్రికి చేరుకుని మగశిశువు కోసం ఆరా తీసింది. అక్కడ పరిచయం అయిన రికార్డు అసిస్టెంట్‌ శ్రీను(51) అనే వ్యక్తిని తన మాయమాటలతో లోబరుచుకుని, తనకు మగశిశువు కావాల చెప్పడంతోశ్రీను అంగీకరించాడు.

చాణుక్య సాఫ్టవేర్‌ ద్వారా...
చాణుక్య సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి కేసు మిస్టరీ చేధించారు. డీసీపీ కె.పాల్‌రాజు కేసును పర్యవేక్షించారు. కేసులో నిందితురాలుగా ఉన్న నాగమల్లేశ్వరిపై గతంలో ఒక పోలీస్‌ కేసు ఉంది. ఆమె మరొకరిపై ఫిర్యాదు చేసింది. ఆ రెండు వివరాలను చాణుక్య సాఫ్ట్‌వేర్‌ ద్వారా తెలుసుకుని ఆమెను విచారించటంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చాణుక్య సాఫ్ట్‌వేర్‌లో 1.30 కోట్ల క్రైం రికార్డులు ఉన్నాయి. ప్రతి ఫిర్యాదు మొదలుకుని షీటు వరకు అన్నింటిని 2001 నుంచి పోలీస్‌ శాఖ డిజిటలైజేషన్‌ చేసింది. ఈ సాఫ్ట్‌వేర్‌లో మనం వ్యక్తి పేరు ఎంటర్‌ చేస్తే అతనికి సంబంధించిన సమగ్ర చరిత్ర వస్తుంది.

శిశువు అపహరణ ఇలా..
ఈ నెల 14న ఉదయం 9 గంటలకు నాగమల్లేశ్వరి పాత ఆస్పత్రికి వచ్చి రికార్డు అసిస్టెంట్‌ శ్రీనును కలిసింది. అతని సహాయంలో సెక్యూరిటీ గార్డులు ముఖర్జీ, కన్నయ్యలను దాటి ఎస్‌ఎన్‌సీయూలోకి వెళ్లింది. అక్కడ స్టెప్‌ డౌన్‌ బ్లాక్‌లోకి వెళ్లారు. అక్కడ ఐతా కల్యాణి అనే మహిళ వద్ద ఐదు రోజుల శిశువును చూపించి శ్రీను బయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి  సుమారు 10.30 నుంచి 11 గంటల మధ్య నాగమల్లేశ్వరి చాకచక్యంగా శ్రీను చూపించిన శిశువును అపహరించుకుని వెళ్లింది.  బయటకు వచ్చి ఆటోలో రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అక్కడి నుంచి తెనాలి వెళ్లి భర్తను కలిసి ఇంటికి వెళ్లిపోయింది. శ్రీనుతో నాగమల్లేశ్వరి సన్నిహితంగా ఉండటం వల్ల అతనికి తెలిసిన మహిళ అనుకుని ఇద్దరు సెక్యూరిటీ గార్డులు తమ విధులను వదిలిపెట్టి వేరే పనిలో నిమగ్నమవడంతో శిశువు అపహరణకు పరోక్షంగా కారణమయ్యారని సీపీ తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్‌æపోలీస్‌ కమిషనర్‌ హరికుమార్‌తోపాటు, డీసీపీ పాల్‌రాజ్, ఏసీపీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సిబ్బంది సస్పెన్షన్‌ :
శిశువు అపహరణ కేసులో నిందితులుగా ఉన్న రికార్డు అసిస్టెంట్‌ శ్రీనును సిద్ధార్థ వైద్య కళాశాల అధికారులు గురువారం రాత్రి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఇద్దరు కాంట్రాక్టు సెక్యురిటీ గార్డులను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement