పోలీసుశాఖ అమరవీరుల రన్ | TS DGP announces 10k run for police martyrs | Sakshi
Sakshi News home page

పోలీసుశాఖ అమరవీరుల రన్

Oct 9 2016 6:59 PM | Updated on Aug 21 2018 7:46 PM

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరపోలీసుల జ్ఞాపకార్థం..

- అక్టోబర్ 16 నుంచి నెక్లస్‌రోడ్‌లో మూడు రోజుల పాటు నిర్వహణ
- ఆన్‌లైన్‌,11 పోలీస్‌స్టేషన్లలో నమోదుకు అవకాశం

హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరపోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 16 నుంచి మూడు రోజుల పాటు 2కె, 5కె, 10కె రన్ పోటీలను నిర్వహించనున్నట్లు డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. పోలీసుశాఖ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఆయన సీనియర్ అధికారులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోటీల్లో ప్రజలను భాగస్వామ్యం చేసి, పోలీసు సేవలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. రన్ లో దాదాపు 5వేల మంది పోటీపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

దేశంలోనే మొట్ట మొదటి సారిగా అమరపోలీసుల సంస్మరణ రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో ట్విన్ టవర్స్ ఘటన అనంతరం న్యూయార్క్ పోలీసు డిపార్టుమెంటు(ఎన్‌వైపిడీ) ప్రతి ఏటా రన్ నిర్వహిస్తోందని, అదే మాదిరిగా రాష్ట్రంలో కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రతి ఏటా రన్ ఈ పోటీలను నిర్వహిస్తామన్నారు. 2కె, 5కె, 10కె రన్ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. రన్ లో పాల్గొనేందుకు మాదాపూర్, కూకట్‌పల్లి, సరూర్‌నగర్, కుషాయిగూడ, అబిడ్స్, బంజారాహిల్స్, చార్మినార్, పంజాగుట్ట, ఉస్మానియా యూనివర్శిటీ, అంబర్‌పేట, నారాయణగూడ పోలీస్‌స్టేషన్లలో లేదా ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేయించుకోవచ్చని తెలిపారు.

2కె రన్‌లో పాల్గొనే వారు రూ.250, 5కె రన్ పాల్గొనేవారు రూ.300, 10కె రన్‌లో పాల్గొనేవారు రూ.350లను రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. జర్నలిస్టులు ప్రవేశ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, గుర్తింపుకార్డును చూపితే రన్ కు అనుమతిస్తామన్నారు. రన్‌లో విజయం సాధించిన వారికినెగ్గిన వారికి బహుమతులు అందజేస్తామని చెప్పారు. పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ టీ-షర్ట్‌లు ఉచితంగా అందజేస్తామన్నారు.

అదే విధంగా పోలీసు సేవలపై అక్టోబర్ 15, 16తేదీలలో పీపుల్స్ ప్లాజాలో 'ఎక్స్ పో' నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర విభాగాలకు చెందిన పోలీసు స్టాళ్లు ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తామని  చెప్పారు. ఈ సమావేశంలో శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్‌ త్రివేది, సైబరాబాద్ కమిషనర్ సందీప్‌ శాండిల్య, రాచకొండ కమిషనర్ మహేష్‌ భగవత్, సీఐడీ చీఫ్ సౌమ్యా మిశ్రా, సీనియర్ ఐపీఎస్ అధికారి రమేశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement