'పురం'లో మళ్లీ దొంగలుపడ్డారు! | theft in hindupuram | Sakshi
Sakshi News home page

'పురం'లో మళ్లీ దొంగలుపడ్డారు!

Jun 9 2017 11:12 PM | Updated on Sep 5 2017 1:12 PM

హిందూపురంలోని వేర్వేరు ప్రాంతాల్లోని మూడిళ్లల్లో దొంగలుపడ్డారు. గోకుల్‌నగర్‌లోనే రెండు ఇళ్లలో చోరీలు జరిగాయి.

హిందూపురం అర్బన్‌ : హిందూపురంలోని వేర్వేరు ప్రాంతాల్లోని మూడిళ్లల్లో దొంగలుపడ్డారు. గోకుల్‌నగర్‌లోనే రెండు ఇళ్లలో చోరీలు జరిగాయి. 22 తులాల బంగారు నగలు, రూ.56 వేలు నగదును దొంగలు ఎత్తుకుపోయినట్లు బాధితులు టూ టౌన్‌ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. గోకుల్‌నగర్‌కు చెందిన వెంకటచలపతి ఈ నెల 4న కర్ణాటక ప్రాంతానికి పని నిమిత్తం వెళ్లారు. వారింట్లో అద్దెకు ఉంటున్న చంద్రమోహన్‌ తన పిల్లల పరీక్షల కోసం బెంగళూరు వెళ్లారు. నాలుగైదు రోజుల నుంచి తాళాలు వేసిన రెండు ఇళ్లలో దొంగలు చొరబడి బీరువాల్లోని నగదు, బంగారు ఎత్తుకెళ్లారు.

వెంకటాచలపతికి చెందిన ఇంటిలో 18 తులాల బంగారు. రూ.40 వేలు నగదు ఎత్తుకుపోగా, చంద్రమోహన్‌ ఇంటిలో 4 తులాల బంగారు నగలు, రూ.16 వేల నగదు చోరీ చేశారు. ఉదయం వచ్చిన చలపతికి ఇంటి తాళాలు తెరచి ఉండటంతో చోరీ జరిగిందని తెలుసుకుని చంద్రమోహన్‌కూ ఫోన్‌ చేసి పిలిపించారు. ఇద్దరూ కలసి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని మేళాపురంలో బేల్దారి నరసింహమూర్తి ఇంటిలోనూ గురువారం రాత్రి చోరీ జరిగింది. బెంగళూరుకెళ్లి వచ్చేలోగానే ఇంటిలోని బీరువాలో దాచి ఉంచిన బంగారు నగలు, నగదు చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement