తెలంగాణతోనే సమస్యల పరిష్కారం | Telanganatone problems | Sakshi
Sakshi News home page

తెలంగాణతోనే సమస్యల పరిష్కారం

Aug 12 2013 2:51 AM | Updated on Apr 7 2019 4:30 PM

సామాజిక తెలంగాణే అంతిమ లక్ష్యం గా ప్రతి ఒక్కరూ పోరాడాలని, రాష్ట్ర ఏర్పాటుతోనే సమస్యలు పరిష్కారమవుతాయని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కె. మురళీమనోహర్ అన్నారు.

కేయూక్యాంపస్, న్యూస్‌లైన్ : సామాజిక తెలంగాణే అంతిమ లక్ష్యం గా ప్రతి ఒక్కరూ పోరాడాలని, రాష్ట్ర ఏర్పాటుతోనే సమస్యలు పరిష్కారమవుతాయని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కె. మురళీమనోహర్ అన్నారు. కేయూ దూరవిద్యా కేం ద్రంలోని సెమినార్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పాత్ర అంశంపై ఆదివారం చర్చా వేదిక నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ మురళీమనోహర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు యూపీఏ ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమన్నారు. తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా కొట్లాడి తె చ్చుకున్న ప్రత్యేక రాష్ట్ర పునర్నిర్మాణంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మై నార్టీల పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. జనాభాలో అధికశాతం ఉన్న సామాజిక వర్గాలు అనాదిగా దోపిడీకి గురవుతున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మిగులు భూములను పంపిణీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

డాక్టర్ పి. వినయ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ర్టం ఏర్పడే వరకు ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బీసీ జేఏసీ నాయకుడు తిరుణహరి శేషు మాట్లాడుతూ సమైక్యాంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా నష్టపోయింది బీసీ కులస్తులేనని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండే వారినే ఎన్నుకోవాలని సూచించారు. ప్రొఫెసర్ తిరుమళి మాట్లాడుతూ అగ్రవర్ణ పార్టీలను నిలువరించేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు స్వార్థాన్ని వీడి బలమైన పౌరసమాజం, ఐక్య ఉద్యమాలను నిర్మించి చివరకు రాజ్యాధికారం పొందాలన్నారు.

మహాజన జేఏసీ కోల జనార్దన్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఆంధ్రదోపిడీ సంపన్న వర్గాలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ పాలన, సామాజిక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమమని పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ బొబ్బిలి, డాక్టర్ దయానందస్వామి, ప్రొఫెసర్లు నరేంద్రబాబు, విశ్వేశ్వర్‌రావు, డాక్టర్ రమేష్, డాక్టర్ చిర్రరాజు మాట్లాడారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు నకిరకంటి శీనయ్య, సురేశ్, బి. సతీష్, ప్రొఫెసర్ బాంజియా, రాజేంద్రప్రసాద్, జనార్దన్, సిద్ధిఖీ, రహమత్, జైసింగ్‌రాథోడ్, సత్యనారాయణ, కరుణాకర్‌నాయక్, వీరస్వామి, డాక్టర్ చెన్నయ్య, రాజు, పూర్ణేందర్, జగన్, నాగరాజు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement