సమ్మెటివ్–1(సంగ్రహణాత్మక మదింపు) పరీక్షలు వాయిదా వేస్తూ పాఠశాల విద్య కమిషనర్ సంద్యారాణి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
అనంతపురం ఎడ్యుకేషన్: సమ్మెటివ్–1(సంగ్రహణాత్మక మదింపు) పరీక్షలు వాయిదా వేస్తూ పాఠశాల విద్య కమిషనర్ సంద్యారాణి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప్రశ్నపత్రాలు లీకవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. 8–10 తరగతులకు 11 నుంచి గురువారం వరకు నిర్వహించిన పరీక్షలన్నీ రద్దు చేశారు. అలాగే శుక్రవారం నుంచి ఈ నెల 18 వరకు 6–10 తరగతులకు నిర్వహించే తక్కిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు. తర్వాత ఎప్పుడు నిర్వహించేది షెడ్యూల్ ప్రకటిస్తామని కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా యూటూబ్ ద్వారా ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. సోషియల్ పరీక్ష వరకు అన్ని ప్రశ్నపత్రాలు సోషియల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తేరుకున్న విద్యాశాఖ అన్ని జిల్లాల్లోనూ తనిఖీలకు ఆదేశించింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం జిల్లాలో విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి సుబ్రమణ్యం నేతృత్వంలో పలు బృందాలను నియమించి జిరాక్స్, బుక్‌స్టాళ్లలో తనిఖీలు చేపట్టారు.