అసాంఘిక శక్తుల ఆటకట్టిస్తామని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ హెచ్చరించారు.
కదిరి: అసాంఘిక శక్తుల ఆటకట్టిస్తామని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన కదిరిలోని పోలీస్ గెస్ట్ హౌస్‌లో డీఎస్పీ కరీముల్లా షరీఫ్‌తో కలిసి సబ్‌డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మట్కా, గ్యాంబ్లింగ్, లాటరీ నిర్వాహకులు ఎంతటివారైనా సరే వదిలే ప్రసక్తే లేదన్నారు. కదిరి ప్రాంతంలో ఇటీవల చిన్నపిల్లల అపహరణలు ఎక్కువయ్యాయని, వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.
ఇక పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, దానికోసం ప్రత్యేకంగా ఒక ఎస్‌ఐతో పాటు సబ్‌డివిజన్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఒక్కో కానిస్టేబుల్ సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కు కూత వేటుదూరంలో రిక్రియేషన్ ముసుగులో పేకాట జోరుగా సాగుతోందన్న విలేకరుల ప్రశ్నకు తాను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని చెప్పారు. అనంతరం ఆయన ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.