వన్ టౌన్ సీఐ ‘వరద’ తొత్తు
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి ఒన్‌టౌన్ సీఐ మహేశ్వర్ రెడ్డి తొత్తుగా మారి అక్రమార్జనే ధ్యేయంగా వైఎస్‌ఆర్ సీపీ నేతలను..
♦ ప్రతి నెలా రూ. 30 లక్షలు పైగా అక్రమ ఆదాయం
♦ ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రాచమల్లు
కడప అర్బన్ : ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి ఒన్‌టౌన్ సీఐ మహేశ్వర్ రెడ్డి తొత్తుగా మారి అక్రమార్జనే ధ్యేయంగా వైఎస్‌ఆర్ సీపీ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కడపకు విచ్చేసిన ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాటీని కలిసి ప్రొద్దుటూరు ఒన్‌టౌన్ సీఐ మహేశ్వర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలను పక్కకు పెట్టి, వరదరాజులరెడ్డి ఆదేశాల మేరకే పని చేస్తున్నారని తెలిపారు. వైఎస్‌ఆర్ సీపి నాయకులు, కార్యకర్తలపై వరదరాజులరెడ్డి ఇప్పించే తప్పుడు ఫిర్యాదులపై కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారన్నారు.
ఫిర్యాదు ఎవరు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి న్యాయం చేయాలని, అలా కాకుండా వైఎస్సార్ సీపీ నాయకులుగానీ, కార్యకర్తలుగానీ ఫిర్యాదు చేస్తే పక్కన పెట్టడం, అధికార పార్టీ వారు ఫిర్యాదు చేస్తే తమ వాళ్లను అరెస్టు చేయడం దారుణమన్నారు. మంచినీటి కోసం బీజేపీ నాయకులు మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ధర్నా చేస్తే పోలీసు 30 యాక్టు అమలులో ఉందని కేసులు కడతామని బెదిరించారన్నారు. అదే వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు, మున్సిపల్ అధికారులు ధర్నా చేస్తే కేసు నమోదు చేయలేదన్నారు. టీపీఓ, ఇతర అధికారులు టీడీపీ నాయకులపై కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారని, వారిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. తమ సమక్షంలోనే టీపీఓ కౌన్సిలర్ మురళీధర్‌రెడ్డిపై దాడి చేస్తే చర్యలు తీసుకోని పోలీసులు టీపీఓపై దాడి చేశారని నమోదైన కేసులో మురళీధర్‌రెడ్డి ఇంటి వద్దకు అర్దరాత్రి వెళ్లి తనిఖీలు చేశారని తెలిపారు.
అయితే, ఆయన హైకోర్టుకు వెళ్లి అరెస్టు చేయవద్దని ఉత్తర్వులు తెచ్చుకున్నారన్నారు. బంగారురెడ్డి, మురళీధర్‌రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ తప్పుడు కేసులు నమోదు చేశారని, ఎక్కడా వారు కులం పేరుతో దూషించలేదని పేర్కొన్నారు. బంగారురెడ్డిని మూడు రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయ ఆవరణంలోనే అరెస్టు చేసి రిమాండుకు తరలించారన్నారు. సీఐ తన ఆత్మాభిమానాన్ని వరదరాజులరెడ్డి వద్ద తాకట్టుపెట్టారని తెలిపారు. వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఎర్రచందనం అక్రమ రవాణా, సెటిల్‌మెంట్లు, ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా వాటిని అరికట్టడం మాట అటుంచి నెలనెలా దాదాపు రూ. 30 లక్షలు మేరకు అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే రాచమల్లు ఎస్పీకి వివరించారు.


