breaking news
MLA varadarajula Reddy
-
ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి టీడీపీ షాక్..!
సాక్షి ప్రతినిధి, కడప: క్షేత్రస్థాయిలో విలువ దక్కకపోయినా అధిష్టానం వద్ద పరపతి తగ్గలేదు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని కాదని, మాజీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సిఫార్సుల వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. ప్రతి చిన్న విషయానికి అటు ఎమ్మెల్యే వరద ఇటు ప్రవీణ్‌కుమార్ పోటీ పడుతున్నారు. పైచేయి సాధించేందుకు ఎత్తులు..పైఎత్తులు వేస్తున్నారు. ప్రొద్దుటూరులో ప్రవీణ్ పాత్ర అతిస్వల్పం అని చూపించేందుకు ఎమ్మెల్యే తనయుడు కొండారెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తున్నారు. తాజాగా అధిష్టానం వద్ద ప్రవీణ్కుమార్రెడ్డిదే అప్పర్ హ్యాండ్ అయ్యింది. ప్రొద్దుటూరు సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా (ఏజీపీ) వినోద్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు ముందు ప్రొద్దుటూరు ఇన్చిర్జిగా ఉక్కు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చురుగ్గా ఉండేవారు. సమీకరణల్లో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నంద్యాల వరదరాజులరెడ్డి తెరపైకి వచ్చారు. అప్పటి వరకు కలిసికట్టుగా ఉన్నట్లు అనిపించినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వరద అన్నింటా తనదే పైచేయి ఉండాలనే దిశగా అడుగులు వేశారు. ఈక్రమంలో పరస్పర దాడులు వరకు వెళ్లారు. ఎప్పటికప్పుడు ఎవరికి వారు చోటుచేసుకున్న పరిస్థితులను అధిష్టానానికి వివరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వ నియామకాలపై కూడా ఎప్పటికప్పుడు ఆయా వర్గీయులు అభ్యర్థులను సిఫార్సు చేస్తూ వచ్చారు. ఏజీపీగా వినోద్‌కుమార్ నియామకం... ప్రొద్దుటూరు సివిల్ జడ్జి కోర్టు ఏజీపీగా అడ్వకేట్‌గా ఈ.వినోద్‌కుమార్‌ను నియమిస్తూ జీఓ ఆర్టీ నెం.259 ద్వారా సెప్టెంబర్ 11న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏజీపీ నియామకం కోసం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అడ్వకేట్ నిర్మలను నియమించాలని సూచించారు. ఈవిషయాన్ని ఇన్చార్జి మంత్రి సవిత, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు టీడీపీ మాజీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అడ్వకేట్ వినోద్‌కుమార్‌ను ఏజీపీగా నిమించాలని మంత్రి నారా లోకేష్‌కు విన్నవించినట్లు సమాచారం. ప్రవీణ్ అభ్యర్థన మేరకు సిఫార్సులు పంపాల్సిందిగా సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ కావడం, ఆమేరకు నియామకపు ఉత్తర్వులు వెలుబడినట్లు విశ్వసనీయ సమాచారం. కొండారెడ్డి చర్యలతోనే పలుచబడ్డ పరపతి.... ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అయినప్పటీకీ అనధికార పెత్తనమంతా తనయుడు నంద్యాల కొండారెడ్డి కొనసాగిస్తున్నారు. ప్రత్యేక కోటరీ ఏర్పాటు చేసుకొని కోటరీ సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మట్కా, గుట్కా, జూదం లాంటివి విచ్చలవిడిగా ఉన్నాయని స్వయంగా ఎమ్మెల్యే వరద బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అలాంటి వ్యక్తులనే కొండారెడ్డి ప్రోత్సహిస్తూ వారి సిఫార్సులకు అనుగుణంగా నడుచుకుంటున్నారని విశ్లేషకులు సైతం వివరిస్తున్నారు. ఇసుక అక్రమదందా, సెటిల్మెంట్లు ఈమారు ప్రొద్దుటూరులో సైర్వవిహారం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో అధిష్టానం వద్ద ఎమ్మెల్యే వరద పరపతి పలుచబడినట్లు సమాచారం. ఆమేరకే ఎమ్మెల్యే సిఫార్సులను కాదనీ, ఉక్కు ప్రవీణ్ సిఫార్సులకు అనుగుణంగా ఏజీపీ నియామకం చోటుచేసుకున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఇచ్చింది రెండు.. మెలికెలు మెండు.. -
వన్ టౌన్ సీఐ ‘వరద’ తొత్తు
♦ ప్రతి నెలా రూ. 30 లక్షలు పైగా అక్రమ ఆదాయం ♦ ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రాచమల్లు కడప అర్బన్ : ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి ఒన్‌టౌన్ సీఐ మహేశ్వర్ రెడ్డి తొత్తుగా మారి అక్రమార్జనే ధ్యేయంగా వైఎస్ఆర్ సీపీ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కడపకు విచ్చేసిన ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ నవీన్గులాటీని కలిసి ప్రొద్దుటూరు ఒన్‌టౌన్ సీఐ మహేశ్వర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలను పక్కకు పెట్టి, వరదరాజులరెడ్డి ఆదేశాల మేరకే పని చేస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్ సీపి నాయకులు, కార్యకర్తలపై వరదరాజులరెడ్డి ఇప్పించే తప్పుడు ఫిర్యాదులపై కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారన్నారు. ఫిర్యాదు ఎవరు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేసి న్యాయం చేయాలని, అలా కాకుండా వైఎస్సార్ సీపీ నాయకులుగానీ, కార్యకర్తలుగానీ ఫిర్యాదు చేస్తే పక్కన పెట్టడం, అధికార పార్టీ వారు ఫిర్యాదు చేస్తే తమ వాళ్లను అరెస్టు చేయడం దారుణమన్నారు. మంచినీటి కోసం బీజేపీ నాయకులు మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ధర్నా చేస్తే పోలీసు 30 యాక్టు అమలులో ఉందని కేసులు కడతామని బెదిరించారన్నారు. అదే వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు, మున్సిపల్ అధికారులు ధర్నా చేస్తే కేసు నమోదు చేయలేదన్నారు. టీపీఓ, ఇతర అధికారులు టీడీపీ నాయకులపై కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారని, వారిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. తమ సమక్షంలోనే టీపీఓ కౌన్సిలర్ మురళీధర్‌రెడ్డిపై దాడి చేస్తే చర్యలు తీసుకోని పోలీసులు టీపీఓపై దాడి చేశారని నమోదైన కేసులో మురళీధర్‌రెడ్డి ఇంటి వద్దకు అర్దరాత్రి వెళ్లి తనిఖీలు చేశారని తెలిపారు. అయితే, ఆయన హైకోర్టుకు వెళ్లి అరెస్టు చేయవద్దని ఉత్తర్వులు తెచ్చుకున్నారన్నారు. బంగారురెడ్డి, మురళీధర్‌రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ తప్పుడు కేసులు నమోదు చేశారని, ఎక్కడా వారు కులం పేరుతో దూషించలేదని పేర్కొన్నారు. బంగారురెడ్డిని మూడు రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయ ఆవరణంలోనే అరెస్టు చేసి రిమాండుకు తరలించారన్నారు. సీఐ తన ఆత్మాభిమానాన్ని వరదరాజులరెడ్డి వద్ద తాకట్టుపెట్టారని తెలిపారు. వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఎర్రచందనం అక్రమ రవాణా, సెటిల్మెంట్లు, ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా వాటిని అరికట్టడం మాట అటుంచి నెలనెలా దాదాపు రూ. 30 లక్షలు మేరకు అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే రాచమల్లు ఎస్పీకి వివరించారు.


