మిషన్‌కాకతీయ.. అంతా మాయ | Preferred to leave the lake breaks | Sakshi
Sakshi News home page

మిషన్‌కాకతీయ.. అంతా మాయ

Jan 2 2017 1:17 AM | Updated on Sep 5 2017 12:08 AM

మిషన్‌కాకతీయ.. అంతా మాయ

మిషన్‌కాకతీయ.. అంతా మాయ

మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణలో నిర్దేశిత లక్ష్యాలపైనే దృష్టి సారించిన అధికారులు రైతుల ప్రయోజనాలను ...

చెరువులను వదిలి కుంటలకు ప్రాధాన్యం
ఆయకట్టు లేకున్నా చెరువుల పునరుద్ధరణ
లక్ష్యాలపైనే గురి.. పట్టింపులేని రైతుల ప్రయోజనాలు


మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణలో నిర్దేశిత లక్ష్యాలపైనే దృష్టి సారించిన అధికారులు రైతుల ప్రయోజనాలను విస్మరించారు. ఐదు నుంచి 20 ఎకరాలు మాత్రమే ఆయకట్టు ఉన్న చెరువులను, అసలు అయకట్టు లేని, తూములు, అలుగు నిర్మాణాలు లేని కుంటలను ఎంపిక చేశారు. పట్టుమని పదెకరాలు లేని కుంటల కింద 50 ఎకరాలపైన ఆయకట్టు ఉన్నట్లు చూపడంతో కాంట్రాక్టర్లకు కాసుల పంట పండింది. అధికారుల జేబులు నిండాయి.

ఈ చిత్రంలో కట్టకు రెండు వైపులా నీళ్లు కనిపిస్తున్న చెరువు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో ముంపునకు గురైన నందిపేట మండలంలోని గంగగడ్డ నడ్కుడ గ్రామానికి చెందినది. ఎకరం ఆయకట్టు కూడా లేని ఈ చెరువును మిషన్‌ కాకతీయ–2 కింద చేర్చి రూ. 7.85 లక్షలు కేటాయించారు. కాంట్రాక్టరు కట్టపై కొంత మొరం పోసి పనులు మమ అనిపించాడు. మంజూరైన నిధులను మింగేశాడు. అధికారులకు భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

నిజామాబాద్‌ అర్బన్‌ : సాగుభూములకు జీవనాడులుగా ఉన్న చెరువులు, కుంటలకు జలకళతో పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం లక్ష్యం అధికారుల ఇష్టారాజ్యంతో నీరుగారుతోంది. ఎక్కువ ఆయకట్టు ఉన్న చెరువులను వదిలి తక్కువ ఆయకట్టు ఉన్న కుంటలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆసలు ఆయకట్టు లేని కుంటలను, ఐదు నుంచి 20 ఎకరాల లోపు  ఆయకట్టు గల కుంటలను మిషన్‌ కాకతీయ కింద పునరుద్ధరించేందుకు ఎంపిక చేశారు. పలు మండలాల్లో అసలు తూములు, ఆలుగు నిర్మాణాలు లేని కుంటలను ఎంపిక చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ముంపునకు గురైన చెరువులు, కుంటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం విడ్డూరంగా ఉందంటున్నారు. నందిపేట, ఆర్మూర్, బాల్కొండ, నవీపేట మండలాల్లో ఇలాంటి చెరువులనే ఎంపిక చేసారు. ఇప్పటికే జిల్లాలో అత్యధిక కుంటల్లో ఉపాధిహామీ పథకం కింద పూడికతీత పనులు, కట్టబలోపేతం పనులు చేయించారు. ఈ ఏడాది ఉపాధి హామీ పథకం కింద ఖర్చుపెట్టిన రూ. 233.80 కోట్లలో సింహభాగం చెరువు పనులకే కేటాయించారు. దీంతో గుత్తెదారులు పూడికతీత కట్ట బలోపేతం పనులు వదిలి మిగతా పనులు చేస్తున్నారు. నామమాత్రంగా తూములు నిర్మించడం, మత్తడికి పై పూతలు పూసి మమ అనిపించేస్తున్నారు. పనులకు మంజూరైన నిధుల్లో పాతిక శాతం కూడా ఖర్చు చేయడం లేదు. నిధులను కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కలిసి పంచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

పెద్ద చెరువులను వదిలేశారు..
జిల్లాలో ఆయకట్టు లేని కుంటలకు ప్రాధాన్యత ఇచ్చిన ఇంజనీర్లు వందల ఆయకట్టు ఉన్న చెరువులను వదిలేసారు.పెద్ద చెరువులను మిషన్‌ కాకతీయ కింద తీసుకుంటూ లక్ష్యం నెరవేర్చడంలో విఫలం కావడం, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్‌ రాకపోవడం వంటి కారణాలతో ఇంజనీర్లు చిన్నకుంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నా ఆరోపణలు ఉన్నాయి. ఇలా జిల్లాలో వదిలేసిన పెద్ద చెరువులు 40 వరకు ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement