breaking news
The restoration of the pond
-
మిషన్‌కాకతీయ.. అంతా మాయ
చెరువులను వదిలి కుంటలకు ప్రాధాన్యం ఆయకట్టు లేకున్నా చెరువుల పునరుద్ధరణ లక్ష్యాలపైనే గురి.. పట్టింపులేని రైతుల ప్రయోజనాలు మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణలో నిర్దేశిత లక్ష్యాలపైనే దృష్టి సారించిన అధికారులు రైతుల ప్రయోజనాలను విస్మరించారు. ఐదు నుంచి 20 ఎకరాలు మాత్రమే ఆయకట్టు ఉన్న చెరువులను, అసలు అయకట్టు లేని, తూములు, అలుగు నిర్మాణాలు లేని కుంటలను ఎంపిక చేశారు. పట్టుమని పదెకరాలు లేని కుంటల కింద 50 ఎకరాలపైన ఆయకట్టు ఉన్నట్లు చూపడంతో కాంట్రాక్టర్లకు కాసుల పంట పండింది. అధికారుల జేబులు నిండాయి. ఈ చిత్రంలో కట్టకు రెండు వైపులా నీళ్లు కనిపిస్తున్న చెరువు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన నందిపేట మండలంలోని గంగగడ్డ నడ్కుడ గ్రామానికి చెందినది. ఎకరం ఆయకట్టు కూడా లేని ఈ చెరువును మిషన్ కాకతీయ–2 కింద చేర్చి రూ. 7.85 లక్షలు కేటాయించారు. కాంట్రాక్టరు కట్టపై కొంత మొరం పోసి పనులు మమ అనిపించాడు. మంజూరైన నిధులను మింగేశాడు. అధికారులకు భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్ : సాగుభూములకు జీవనాడులుగా ఉన్న చెరువులు, కుంటలకు జలకళతో పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం లక్ష్యం అధికారుల ఇష్టారాజ్యంతో నీరుగారుతోంది. ఎక్కువ ఆయకట్టు ఉన్న చెరువులను వదిలి తక్కువ ఆయకట్టు ఉన్న కుంటలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆసలు ఆయకట్టు లేని కుంటలను, ఐదు నుంచి 20 ఎకరాల లోపు ఆయకట్టు గల కుంటలను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించేందుకు ఎంపిక చేశారు. పలు మండలాల్లో అసలు తూములు, ఆలుగు నిర్మాణాలు లేని కుంటలను ఎంపిక చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపునకు గురైన చెరువులు, కుంటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం విడ్డూరంగా ఉందంటున్నారు. నందిపేట, ఆర్మూర్, బాల్కొండ, నవీపేట మండలాల్లో ఇలాంటి చెరువులనే ఎంపిక చేసారు. ఇప్పటికే జిల్లాలో అత్యధిక కుంటల్లో ఉపాధిహామీ పథకం కింద పూడికతీత పనులు, కట్టబలోపేతం పనులు చేయించారు. ఈ ఏడాది ఉపాధి హామీ పథకం కింద ఖర్చుపెట్టిన రూ. 233.80 కోట్లలో సింహభాగం చెరువు పనులకే కేటాయించారు. దీంతో గుత్తెదారులు పూడికతీత కట్ట బలోపేతం పనులు వదిలి మిగతా పనులు చేస్తున్నారు. నామమాత్రంగా తూములు నిర్మించడం, మత్తడికి పై పూతలు పూసి మమ అనిపించేస్తున్నారు. పనులకు మంజూరైన నిధుల్లో పాతిక శాతం కూడా ఖర్చు చేయడం లేదు. నిధులను కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కలిసి పంచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. పెద్ద చెరువులను వదిలేశారు.. జిల్లాలో ఆయకట్టు లేని కుంటలకు ప్రాధాన్యత ఇచ్చిన ఇంజనీర్లు వందల ఆయకట్టు ఉన్న చెరువులను వదిలేసారు.పెద్ద చెరువులను మిషన్ కాకతీయ కింద తీసుకుంటూ లక్ష్యం నెరవేర్చడంలో విఫలం కావడం, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ రాకపోవడం వంటి కారణాలతో ఇంజనీర్లు చిన్నకుంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నా ఆరోపణలు ఉన్నాయి. ఇలా జిల్లాలో వదిలేసిన పెద్ద చెరువులు 40 వరకు ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. -
ఎన్నారైలకు చెరువుల దత్తత!
పునరుద్ధరణ కోసం సహకారం తీసుకోవాలని టీ సర్కార్ నిర్ణయం ఆర్థిక సహకారం కోసం విజ్ఞప్తి చేయనున్న సీఎం కేసీఆర్! హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యమ స్థాయిలో చేపట్టదలచిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో ఎన్నారైలను భాగస్వాములను చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఎన్నారైలు సంపూర్ణ సహకారం అందించిన తరహాలో చెరువుల పునరుద్ధరణకూ తోడ్పడాల్సిం దిగా కోరాలని భావిస్తోంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ఎవరైనా ఎన్నారైలు ముందుకొస్తే... వారికి చెరువులను దత్తత ఇచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రంలో చెరువుల అభివృద్ధిపై ఇప్పటికే పాలనాపరమైన ఏర్పాట్లను పూర్తిచేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం తొలివిడతలో పునరుద్ధరించే చెరువుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. దీనిని వచ్చే నెల 10వ తేదీలోగా పూర్తి చేసి, ఆ తర్వాత టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టాలని భావిస్తోంది. ‘భాగస్వామ్యం’పై కసరత్తు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు సహా అందరి భాగస్వామ్యం ఎలా ఉండాలన్న దానిపై ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే ఎన్నారైల సహకారాన్ని తీసుకోవాలని.. వారు కోరిన చెరువులను దత్తతకు ఇచ్చి, ప్రభుత్వపరంగా అవసరమైన సహాయాన్ని అందించాలని నిర్ణయించి నట్లు తెలుస్తోంది. పునరుద్ధరణ కింద చేపట్టే కట్టల పటిష్టం, పూడికతీత, ప్రధాన చెరువుల కాల్వల కింద ముళ్లపొదల తొలగింపు వంటి కార్యక్రమాలకు... మానవ వనరులతో పాటు జేసీబీలు, ట్రాక్టర్లు, పారలు, తట్టలు, గడ్డపారలు వంటివి భారీగా అవసరమవుతాయి. జేసీబీలు, ట్రాక్టర్లకు డీజిల్ ఖర్చుతో పాటు మిగతా సామగ్రి కొనుగోలుకు నిధులు అవసరం. అయితే వీటిల్లో ఏ పనికోసం ఎన్నారైల నుంచి ఆర్థిక సహకారం తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. చెరువుల పునరుద్ధరణకు ఎన్నారైల మద్దతు కోరుతూ.. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. అంతేగాకుండా చెరువుల పునరుద్ధరణ ప్రక్రియ మొదలవడానికి ముందే ‘మన ఊరు-మన చెరువు’ పేరిట పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేగంగా టెండర్ల ప్రక్రియ చెరువుల పునరుద్ధరణ కింద ఇచ్చే పనులకు టెండర్ల ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా టెండర్ ప్రకటన వచ్చాక పద్నాలుగు రోజుల్లో కాంట్రాక్టర్లు దరఖాస్తులు సమర్పించాలి. దీనిని ఏడు రోజులకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. టెండర్ల మదింపును కూడా ఒక్క రోజులోనే పూర్తిచేయాలని భావిస్తోంది.