పండుటాకుల పాట్లు! | pension problems | Sakshi
Sakshi News home page

పండుటాకుల పాట్లు!

Dec 16 2016 11:54 PM | Updated on Sep 4 2017 10:53 PM

పండుటాకుల పాట్లు!

పండుటాకుల పాట్లు!

ప్రతి నెలా 5వ తేదీలోగా చేతిలోకి వచ్చే పింఛన్‌ డబ్బు ఈ నెల 15వ తేదీ దాటినా అందకపోవడంతో పండుటాకులు విలవిల్లాడుతున్నారు.

పింఛన్‌కు 60వేల మంది దూరం
- బ్యాంకుల వద్ద తప్పని నిరీక్షణ
- సగం నెల గడిచినా అందని నగదు
- నోక్యాష్‌ బోర్డులతో దిగాలు
 
జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పథకం పింఛన్లు
వృద్ధాప్య : 1,21,192
వితంతు : 1,24,773
వికలాంగులు : 39,548
చేనేత : 3,519
కల్లుగీత : 159
అభయహస్తం : 17,902
 
కర్నూలు(హాస్పిటల్‌): ప్రతి నెలా 5వ తేదీలోగా చేతిలోకి వచ్చే పింఛన్‌ డబ్బు ఈ నెల 15వ తేదీ దాటినా అందకపోవడంతో పండుటాకులు విలవిల్లాడుతున్నారు. వికలాంగులు, వితంతువులు బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గంటల తరబడిì  బ్యాంకుల వద్ద వేచి ఉన్నా నో క్యాష్‌ బోర్డులు ప్రత్యక్షమవుతుంటే కంటి నిండా నీళ్లతో ఇంటిముఖం పడుతున్నారు. జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద 3,07,140 మంది పింఛన్‌ లబ్ధిదారులు ఉండగా.. 2,47,143 మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. 61,268 మందికి బ్యాంకు ఖాతాలు లేవని.. ఆధార్‌తో లింకప్‌ కాలేదని గుర్తించారు. వీరికి ఎంపీడీఓల ద్వారా నేరుగా నగదు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు 2వేల మందికి కూడా నగదు పంపిణీ చేయలేకపోయారు. బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి నేరుగా పింఛన్‌ మొత్తాన్ని అకౌంట్లలో జమ చేశారు. ఈ మొత్తాన్ని లబ్ధిదారులు నేరుగా డ్రా చేసుకోవచ్చు. లేదా బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ ద్వారా తీసుకోవచ్చు.
 
బ్యాంకుల్లో నోక్యాష్‌ బోర్డుతో దిగాలు
బ్యాంకుల్లో పడిన మొత్తాన్ని లబ్ధిదారులు బ్యాంకులకు వెళ్లి తీసుకోవాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రతిరోజూ బ్యాంకులకు వెళ్లడం, గంటల తరబడి వేచి ఉండటం, కొందరికి ఇచ్చిన తర్వాత నోక్యాష్‌ బోర్డు ప్రత్యక్షం కావడం పరిపాటిగా మారింది. జిల్లాలోని దాదాపు అన్ని బ్యాంకుల వద్ద ఇదే పరిస్థితి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పడిగాపులు కాస్తున్నారు.
 
పక్షవాతం వచ్చిందన్నా పట్టించుకోలేదు
మాది బుధవారపేట. నాకు కొన్ని నెలల క్రితం పక్షవాతం వచ్చి రెండు కాళ్లు పడిపోయాయి. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నా. ఇప్పటికీ కాళ్లు సరిగ్గా పనిచేయవు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు.
– పుల్లమ్మ, కర్నూలు
 
3 గంటలు నిలబడినా వెనక్కే
గాయత్రి ఎస్టేట్స్‌లోని ఆంధ్రాబ్యాంకు వద్ద మూడు గంటల పాటు నిలబడినా చివరకు డబ్బు ఇవ్వలేదు. ఒకసారి వస్తే బ్యాంకు ఖాతా పనిచేయడం లేదన్నారు. ఇప్పటికే రెండురోజులు తిరిగినా. ఇది మూడవ రోజు. పింఛన్‌ డబ్బులు ఇస్తారో లేదో అర్థం కావట్లేదు.
– నాగమ్మ, కర్నూలు
 
డబ్బులు ఆటో చార్జీలకే సరిపోతున్నాయి
నేను వికలాంగురాలిని. దాచుకున్న డబ్బు బ్యాంకు వద్దకు వచ్చేందుకు ఆటో చార్జీలకే సరిపోతుంది. ఇప్పటికి మూడుసార్లు బ్యాంకు వద్దకు వచ్చినా. డబ్బులు లేవని వెనక్కి పంపిస్తున్నారు. నిలబడలేకపోతున్నా, కళ్లు తిరుగుతున్నాయని చెప్పినా వినిపించుకోరు.
– సాలమ్మ, కర్నూలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement