కేసీఆర్ ప్రభుత్వం గోదావరి జలాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంతో పెద్దగా ఒరిగేదేమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.
నల్లగొండ: కేసీఆర్ ప్రభుత్వం గోదావరి జలాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం చరిత్రాత్మకమైందేమీ కాదని, దీంతో రాష్ట్రానికి పెద్దగా ఒరిగేదేమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం నల్లగొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహా ఒప్పందంపై కేవలం టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు చేస్తున్న ప్రచార ఆర్భాటమేనని కొట్టిపారేశారు. తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్లకు బదులు 148 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టును నిర్మించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు.
కేంద్రంలోని నరేంద్రమోదీ, తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు కొమ్ముకాసే విధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. దేశంలోని 80 శాతం సంపద, సహజవనరులు కేవలం 15 శాతంగా ఉన్న బడాబాబుల చేతుల్లో ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను, హక్కులను కాలరాసే చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. కొత్త జిల్లాలో ఏర్పాటు విషయంలో అఖిలపక్ష పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.