
హైదరాబాద్: దేశంలో ప్రముఖ ఇన్‌ఫ్రా సంస్థలలో ఒకటైన రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ) నుండి రూ.2,085 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఈ ఒప్పందం గోదావరి తాగునీటి సరఫరా పథకం - ఫేజ్ II & ఫేజ్ IIIకి సంబంధించినది. ఇందులో భాగంగా మూసీ నది పునరుజ్జీవనానికి సహాయపడటానికి ఉస్మాన్సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లను గోదావరి నీటితో నింపనున్నారు.
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం) కింద రాంకీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ అయిన మల్లన్నసాగర్ వాటర్ సప్లై లిమిటెడ్ ద్వారా ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఒప్పందంలో భాగంగా, రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రెండేళ్లలో నిర్మాణాన్ని చేపడుతుంది. పూర్తయిన తరువాత 10 సంవత్సరాల పాటు నిర్వహణను చూసుకుంటుంది.
"ఈ ప్రాజెక్ట్ పెరుగుతున్న తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా స్థిరమైన నీటి మౌలిక సదుపాయాలను నిర్మించాలనే మా నిబద్ధతను బలోపేతం చేస్తుంది. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీతో భాగస్వామ్యం కావడం మాకు గర్వంగా ఉంది" అని రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ యంచర్ల రత్నాకర నాగరాజా పేర్కొన్నారు.