కోడలిపై హత్యాయత్నం | Murder attempt on daughter in law | Sakshi
Sakshi News home page

కోడలిపై హత్యాయత్నం

Sep 5 2016 1:30 AM | Updated on Oct 20 2018 6:19 PM

కోడలిపై హత్యాయత్నం - Sakshi

కోడలిపై హత్యాయత్నం

ఆడపిల్లకు జన్మనివ్వబోతుందన్న కోపంతో కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన అత్త, ఆడ బిడ్డను ముత్తుకూరు పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు

నెల్లూరు (క్రైమ్‌) : ఆడపిల్లకు జన్మనివ్వబోతుందన్న కోపంతో కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన అత్త, ఆడ బిడ్డను ముత్తుకూరు పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. మూలాపేటలోని నెల్లూరు రూరల్‌ డీఎస్పీ డాక్టర్‌ కె.తిరుమలేశ్వర్‌రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘటనకు దారి తీసిన పరిస్థితులను వివరించారు. తోటపల్లిగూడూరు మండలం పోట్లపూడికి చెందిన గిరిజకు ముత్తుకూరు మండలం బోడిస్వామి కండ్రిగకు చెందిన తాండ్ర శ్రీనివాసులతో 2014లో వివాహమైంది. గిరిజకు 14నెలల కిందట ఆడపిల్ల జన్మించింది. అయితే ఆడపిల్ల పుట్టడం భర్త శ్రీనివాసులు, అత్త లక్ష్మీకాంతమ్మ, ఆడపడుచు సుభాషిణికి ఇష్టం లేదు. అప్పటి నుంచే వారు గిరిజతో ముభావంగా ఉంటూ వచ్చారు. ఇటీవల ఆమె మరోసారి గర్భం దాల్చడంతో గిరిజ అత్త, ఆడబిడ్డలు  గిరజకు ఏ బిడ్డ పుడుతుందని తెలుసుకునేందుకు స్థానిక జ్యోతిష్కుడు శ్రీనివాసులను సంప్రదించారు.

ఆయన రెండో సారి కూడా ఆడబిడ్డ పుడుతుందని చెప్పాడు. దీంతో ఎలాగైనా గిరిజను, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపి శ్రీనివాసులకు రెండో వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. గత నెల 18వ తేదీన శ్రీనివాసులు, ఆయన తండ్రి ఇంట్లో లేని సమయంలో లక్ష్మీకాంతమ్మ, సుభాషిణి కలిసి గిరిజపై సల్ఫ్యూరిక్‌యాసిడ్‌ కలిపిన కిరోసిన్‌ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. వారి నుంచి తప్పించుకున్న గిరిజ అదే రోజు ముత్తుకూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం నిందితులు లక్ష్మీకాంతమ్మ, సుభాషిణి నెల్లూరు బారకాస్‌సెంటర్‌లో ఉండగా కృష్ణపట్నం పోర్టు సీఐ జి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముత్తుకూరు ఎస్‌ఐ బి. శ్రీనివాసరెడ్డి వారిని అరెస్ట్‌ చేశారు. జ్యోతిష్కుడు పరారీలో ఉన్నాడు. ఈ కేసులో మొదట నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్‌ సిబ్బంది తీరుపై కూడా విచారణ చేపడుతున్నట్లు విలేకరులు అడిగిన ప్రశ్నకు డీఎస్పీ సమాధానం చెప్పారు. నిందితులను అరెస్ట్‌ చేసిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. కృష్ణపట్నం పోర్టు సీఐ జి. శ్రీనివాసరావు, ముత్తుకూరు ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement