
5 నుంచి ఆమరణ దీక్ష
‘‘ప్రభుత్వానికి ఇచ్చిన గడువు సోమవారం సాయంత్రంతో ముగిసింది. మా జాతి ఆకలి పోరాటం కోసం నేను, నా భార్య ఈ
♦ భార్యతో కలిసి నిరాహార దీక్ష..
♦ మీడియా సమావేశంలో ముద్రగడ
♦ నా పిలుపునకు ముందే టీడీపీ మూకలు పట్టాలపైకి..
♦ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు విధ్వంసం సృష్టించారు
♦ ఇది ముమ్మాటికీ చంద్రబాబు ఆదేశాలతోనే జరిగింది
♦ కాపు ఐక్య గర్జన వెనుక ఎవరూ లేరు
♦ కాణిపాకం వినాయకాలయంలో ప్రమాణానికి సవాల్
సాక్షి, కాకినాడ: ‘‘ప్రభుత్వానికి ఇచ్చిన గడువు సోమవారం సాయంత్రంతో ముగిసింది. మా జాతి ఆకలి పోరాటం కోసం నేను, నా భార్య ఈ నెల ఐదో తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి నా స్వగృహంలోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నాం. ప్రాణం పోయేవరకు నా జాతి సంక్షేమం కోసం పోరాడతాను’’ అని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శపథం చేశారు. తానెక్కడికీ పారిపోనని, నిన్నటి ఘటనలతో తనను అరెస్టు చేస్తే బెయిల్ తెచ్చుకోనని చెప్పారు. ‘‘ఎన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినా భయపడను. నా గ్రామంలో నా ఇంట్లోనే ఉంటాను. నాతోపాటు నడిచిన వారిపై కూడా అక్రమ కేసులు బనాయిస్తే అందరం కలసి జైలుకు వెళ్తాం.
అక్కడ కూడా నా దీక్షను కొనసాగిస్తాను. ఆడవాళ్ల జైలులో నా భార్య... మగవాళ్ల జైలులో నేను ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తాం. నాకు సంఘీభావంగా ఎవరూ ఇక్కడకు రానవసరం లేదు. మీ గ్రామంలోనే మధ్యాహ్నం భోజనం మానేసి, ఆ తినే కంచంపై కొడుతూ సెంటర్‌లో నిరసన తెలపండి. నా నిరాహార దీక్షతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. ప్రభుత్వానికి నా చావే కావాలనుకుంటే దానికి సిద్ధమే. నా చావు తరువాతైనా సరే మా జాతిని బీసీల్లో చేరుస్తూ జీవో ఇచ్చి తీరాల్సిందే’’ అని స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగ్రహంలో ముద్రగడ విలేకరులతో మాట్లాడారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..
చంద్రబాబు ఆదేశాలతోనే విధ్వంసం...
తునిలో జరిగిన హింసాత్మక ఘటనలన్నీ పథకం ప్రకారం చంద్రబాబు ఆదేశాలమేరకే జరిగాయని ముద్రగడ ఆరోపించారు. ‘‘కాపు ఐక్యగర్జన జనవరి 31వ తేదీన చేయాలని చాలా కాలం క్రితమే నిర్ణయం తీసుకున్నాం. ఆర్టీసీ బస్సులు ఇవ్వక పోవడం, స్కూల్ బస్సులిచ్చే వారిని బెదిరించడం, చివరకు అన్నం వండుకోవాలని స్థలం అడిగితే ఆ స్థల యజమానులను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఐక్య గర్జనను అణచివేసేందుకు సర్కారు ప్రయత్నించింది. అధికార పార్టీ నేతలు అసాంఘిక శక్తులతో సమావేశాలు పెట్టుకుని విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేశారు. నిన్నటి హింసాత్మక ఘటనలన్నీ వారి పథకం ప్రకారమే జరిగాయి.
తొలుత మీటింగ్ తర్వాత వారం పది రోజులు గడువు ఇచ్చి రోడ్డు మీద గాని, రైలు పట్టాల మీద గాని ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచించాం. కానీ గడువు ఇస్తే మా సామాజిక వర్గీయులపై దాడులు జరుగుతాయన్న ఆలోచనతో... అప్పటికప్పుడు శాంతియుతంగా రాస్తారోకో, రైల్‌రోకోకు పిలుపు ఇవ్వడం జరిగింది. రైల్‌రోకో, రాస్తారోకోకు పిలుపునిస్తానని ఏ ఒక్కరికీ తెలియదు. కానీ నేను ఇంకా పిలుపు ఇవ్వకుండానే అధికార పార్టీకి చెందిన అసాంఘిక శక్తులు రైలుపట్టాలపైకి చేరుకుని రైల్‌రోకోకు దిగాయి. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టాయి. అంతటితో ఆగకుండా మా కార్యకర్తలతో కలిసిపోయి పోలీసులపై రాళ్లు రువ్వడం.. వారి జీపులను తగులబెట్టడం.. రూరల్ పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టడం చేశారు.
పైగా పెట్రోల్ బాంబులతో ఇష్టమొచ్చినట్టుగా విధ్వంసానికి పాల్పడి ఉద్యమాన్ని ఏదో విధంగా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారు. మరింత విధ్వంసానికి పాల్పడి ఎక్కడ మా జాతికి చెడ్డపేరు తీసుకొస్తారేమోననే భయంతో సోమవారం సాయంత్రం వరకు సర్కారుకు గడువునిస్తూ ఆందోళనలను స్వచ్ఛందంగానే విరమింపచేశాను. ఎన్నో ఉద్యమాలు చేశాను.. ఏనాడూ మావాళ్లు ఇలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడలేదు. అలాంటి దుష్ట సంప్రదాయం నాకు, మా జాతికి లేదు. ఇది ముమ్మాటికీ చంద్రబాబు ఆదేశాలతో ఆ పార్టీ నేతల ప్రోద్బలంతో జరిగిందే. ఈ హింసాత్మక ఘటనలకు పూర్తిగా చంద్రబాబే బాధ్యత వహించాలి.
అన్ని వేలమంది పోలీసులు ఉన్నప్పుడు ఈ అసాంఘిక శక్తులను ఎందుకు అదుపు చేయలేక పోయారో చూస్తుంటే.. అధికార పార్టీ ఆదేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ఈరోజు రకరకాల వార్తలు విన్పిస్తున్నాయి. 144 సెక్షన్ పెట్టారని, మా గ్రామంలో రెక్కీ చేశారని, అమాయకులను కేసుల్లో ఇరికించారని, టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వారిని ఉద్యమానికి రాకపోయినా సరే వారి పేర్లు ఇవ్వాలని బెదిరిస్తున్నారు. ఉద్యమానికి నాయకత్వం వహించింది నేనే... పొరపాట్లు జరిగితే నేను బాధ్యుడ్ని’’ అని చెప్పారు. కానీ అసాంఘిక శక్తులకు నాయకత్వం వహించింది టీడీపీ నేతలు కాబట్టి జరిగిన విధ్వంసానికి చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కాపు ఐక్య గర్జన వెనుక జగన్ లేరు
కాపు ఐక్యగర్జన వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఉన్నారన్న చంద్రబాబు ఆరోపణలను ముద్రగడ ఖండించారు. ‘‘ఒక్క పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మినహా రాష్ర్టంలో మరే ఇతర రాజకీయ పార్టీ అధినేతలు మాకు మద్దతు పలకలేదు. వైఎస్సార్‌సీపీలోని కాపు సామాజిక వర్గ నేతలు మద్దతు పలికారు. బీజేపీలో ద్వితీయ శ్రేణి నేతలతోపాటు, టీడీపీలోని కాపు సామాజిక వర్గ క్యాడర్ పూర్తిగా తరలివచ్చింది. అంతేకానీ నా గర్జన వెనుక జగన్ ఉన్నారని ఆరోపించడం తగదు. ఈ గర్జనకు మద్దతుగా జగన్ ఎప్పుడూ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. నేను ఎప్పుడూ జగన్‌ను కలవలేదు... కనీసం మాట్లాడనూ లేదు. కానీ ఈ గర్జన వెనుక జగన్ ఉన్నట్టుగా నీవు పచ్చి అబద్ధాలాడుతున్నావ్. ఈ విషయంలో కాణిపాకం వినాయక ఆలయంలో నేను ప్రమాణం చేస్తాను. నీవు ప్రమాణం చేయగలవా?’’ అని చంద్రబాబుకు సవాలు విసిరారు.
చావో రేవో తేల్చుకుంటాం...
చంద్రబాబు అన్ని వర్గాలనూ మోసం చేస్తున్నారని, అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని ముద్రగడ ధ్వజమెత్తారు. ‘‘రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. బంగారు వస్తువులు మీ మెడలోకి వచ్చేస్తాయన్నారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చాలంటే బాబు రావాలన్నారు. కాపుల సంక్షేమంకోసం ఏడాదికి రూ.1000 కోట్లు ఇస్తామని హామీలిచ్చారు. మాజాతి ఓట్లతో గద్దెనెక్కి, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పులు.. అవీ ఇవీ అని చెబుతున్నారు. అపారమైన అనుభవం ఉన్న మీకు అప్పుడు ఇవన్నీ తెలియదా? మీరు ఆ రోజు చెప్పి ఉండకపోతే ఈరోజు రోడ్డెక్కి ఉండేవారం కాదు.
నేను జూలై 31న ముఖ్యమంత్రికి లేఖ రాశాను. ‘పద్మనాభం కమిషన్ వేశాను. నెలరోజుల్లో రిపోర్టు వస్తుంది. మీ జాతికి న్యాయం చేస్తానని’ చెప్పి ఉంటే ఇలా ఆందోళన చేసి ఉండేవారం కాదు. కానీ చంద్రబాబు ఇచ్చిన వాగ్దానం నుంచి తప్పించుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. అబద్ధాలు.. మోసాలతో పాలన సాగిస్తున్నారు. ఇప్పటికైనా మాకు జీవో ఇవ్వండి. గత రెండేళ్లుగా ఎమర్జెన్సీ కంటే భయానక రోజులు కనిపిస్తున్నాయి. 2011లో సోషియా ఎకనమిక్ కాస్ట్ సెన్సస్ చేశారు. మా జాతకాలన్నీ మీ దగ్గర ఉన్నాయి. మా పరిస్థితి ఏమిటో తెలిసిపోతుంది. మా జాతిలో చాలామంది నిరుపేదలున్నారు. వారు కనీసం తినడానికి తిండిలేక పిల్లల్ని మధ్యాహ్న భోజనం కోసం బడులకు పంపిస్తున్నారు. మాది ఆకలి పోరాటం.. చావోరే వో తేల్చుకుంటాం’’ అని స్పష్టంచేశారు.