ప్రియురాలిని కత్తితో నరికి చంపిన ప్రియుడు!
విశాఖ నగరంలోని లక్ష్మీనర్శింహనగర్‌లో శనివారం రాత్రి దారుణం జరిగింది.
విశాఖపట్నం: విశాఖ నగరంలోని లక్ష్మీనర్శింహనగర్‌లో శనివారం రాత్రి దారుణం జరిగింది. ఇద్దరు వివాహిత మహిళలపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి విచక్షణారహితంగా నరకంతో ఒకరి ప్రాణాలు పోయాయి. మరో మహిళ తీవ్ర గాయాలతో కేజీహెచ్‌లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం..
శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలం బీరపాడుకు చెందిన భోగమ్మ తన కుమార్తె రూపతో కలిసి లక్ష్మీనర్శింహనగర్ నివశిస్తోంది. ఇళ్లల్లో పనులు చేసుకుంటూ వీరు జీవిస్తున్నారు. కాగా అదే జిల్లా,అదే మండలం నలుగు గ్రామానికి చెందిన రమణకు రూపతో పరిచయం ఏర్పడింది. రమణ నగరంలో పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ నేపధ్యంలో మూడు నెలల క్రితం రూపను రమణ తీసుకువెళ్లిపోయాడు. ఆ సమయంలో మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ అతని భార్య కేసు పెట్టింది. అయితే అతనిని వదిలి రూప తల్లి దగ్గరకు వచ్చేసింది. అనంతరం గ్రామ పెద్దల వద్ద పంచాయతీలు కూడా నడిచాయి. దీంతో ఆగ్రహానికి లోనైన రమణ శనివారం వారు నివసిస్తున్న ప్రాంతానికి వచ్చి అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు.
ముందుగా తల్లిని అనంతరం వెంటాడి కూతురిని నరికి పరారయ్యాడు.రక్తపు మడుగులో ఉన్న బాధితులను స్థానికులు కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రూప మరణించింగా భోగమ్మ పరిస్థితి విషమంగా ఉంది. సీఐ బెండు వెంకట్రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.