జేఎన్‌టీయూపై సర్కార్‌ ముద్ర | Sakshi
Sakshi News home page

జేఎన్‌టీయూపై సర్కార్‌ ముద్ర

Published Wed, Feb 22 2017 11:41 PM

జేఎన్‌టీయూపై సర్కార్‌ ముద్ర - Sakshi

నిరాడంబరతకు ఆయన నిలువెత్తు నిదర్శనం.. ఉన్నతోద్యోగిగా ఉన్నా.. సాధారణ వ్యక్తిలాగే అందరిలోనూ కలిసిపోయేవారు. మృదు స్వభావి...  అందరినీ ఆప్యాయంగా పలుకరించే వ్యక్తిత్వం ఆయన సొంతం. చిరుద్యోగిని సైతం గౌరవిస్తూ పలకరించే ఆయనే జేఎన్‌టీయూ(ఎ) ఉపకులపతి ఎం.ఎం.ఎం. సర్కార్‌. 1953లో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ..  జేఎన్‌టీయూ(ఎ) అభివృద్ధిలో తనదైన ముద్రను వేశారు.
- జేఎన్‌టీయూ (అనంతపురం)

ప్రస్థానం ఇలా...
ప్రాథమిక విద్య : పశ్చిమ గోదావరి జిల్లా అకివీడు
ఇంజినీరింగ్‌ : కాకినాడలోని ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల
ఎంటెక్‌ : ఆంధ్రా యూనివర్సిటీ
కెరీర్‌ ప్రారంభం : 1978, జులై నుంచి ఆంధ్రా యూనిర్సిటీ లెక్చరర్‌గా
పొందిన పదవులు : అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌, హెడ్‌ ఆఫ్‌ డిపార్ట్‌మెంట్‌; అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ ఆంధ్రా యూనివర్సిటీ, ఎంసెట్‌ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైజాగ్‌, మెంబర్‌ ఆఫ్‌ కాలేజీ రీసెర్చ్‌ కమిటీ
- 2008–09లో హియరింగ్‌ కమిటీ – ఏఐసీటీఈ సభ్యులుగా
- 74 ఇంటర్నేషనల్‌ జర్నల్స్, 15 నేషనల్‌ జర్నల్స్‌లో ప్రచురణలు
- ‘కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌ అండ్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌,’  ‘టూల్‌ డిజైన్‌,’ ‘మెషిన్‌ విజన్‌ అండ్‌ ఇమేజ్‌ ప్రాసెసింగ్‌’ అనే రచనలు
– 17 పీహెచ్‌డీ అవార్డుల ప్రదాతగా గుర్తింపు
– 35 ఏళ్ల బోధన, పరిశోధనలో విశేష అనుభవం, ఏప్రిల్‌ 2013లో పదవీవిరమణ
– 2015 అక్టోబర్‌ 26న ఆయన జేఎన్‌టీయూ ఉపకులపతిగా బాధ్యతల స్వీకరణ

పాలనలో వైవిధ్యం
ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సర్కార్‌ జేఎన్‌టీయూ ,అనంతపురం పురోగతికి విశేషమైన కృషి చేశారు. నవ సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు, నవకల్పనల కేంద్రంగా జేఎన్‌టీయూను తీర్చిదిద్దేందుకు వివిధ ప్రణాళికలు అమలు చేశారు.
– విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన నోడల్‌ సంస్థ ద్వారా ప్రత్యేక తర్ఫీదు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు.
– ఈసెట్‌-16ను రాష్ట్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు.
– ఏటా  1,10,365 మంది బీటెక్‌ విద్యార్థులకు ప్రణాళికాబద్ధంగా పరీక్షల నిర్వహణ, క్రమం తప్పకుండా ఫలితాలు విడుదల చేయడంలో సంస్కరణలు చేపట్టారు. పరీక్షల విభాగంలో బయోమెట్రిక్‌ను అమలు చేసి పారదర్శకతను పెంచారు.
– టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌లో 164, అసెంచర్‌లో 128, జెన్‌ప్యాక్ట్‌లో 13, సాక్ట్రోనిక్స్‌ 09, ఆర్వీ అసోసియేట్స్‌ 4, ఆర్టీసాన్‌ ఎంబీడెడ్‌ సిస్టమ్‌లో 2 ఉద్యోగాలను జేఎన్‌టీయూ విద్యార్థులకు క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా దక్కేలా చేశారు. జేఎన్‌టీయూ క్యాంపస్‌ ఎంబీఏ విభాగంలో పార్లేజీలో 5, ఒసోమైస్‌ 6, వేద ఐఐటీ కంపెనీలో 3 ఉద్యోగాలు దక్కాయి.
– చికాగో స్టేట్‌ యూనివర్సిటీ, కార్క్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ లాంటి వర్సిటీలతో వివిధ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని విదేశాలలో రాయితీలతో కూడిన విద్యను అందించేలా చొరవ తీసుకున్నారు.
 – క్రీడలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్ధేశంతో వర్సిటీ పరిధిలోని 28 జట్లు సౌత్‌జోన్‌ , ఆలిండియా ఇంటర్‌ వర్సిటీ క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సాహం అందించారు.
–నిర్మాణ దశలోనే ఏళ్లుగా మగ్గుతున్న ఆడిటోరియంను ఆధునిక హంగులతో పూర్తి చేయించారు.
–రూ.72 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జేఎన్‌టీయూ పరిధిలో జరుగుతున్నాయి.
–క్యాంపస్‌ కళాశాలలో రోడ్డు వెడల్పు చేయించి సుందరీకరించారు.
–సోలార్‌ విద్యుదుత్పత్తితో విద్యుత్‌ ఛార్జీలు భారం తగ్గించాలనే సదుద్ధేశ్యంతో ఒక మెగావాట్‌ సోలార్‌ విద్యుదుత్పత్తి అమల్లోకి తెచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

మూగబోయిన విశ్వవిద్యాలయం :
జేఎన్‌టీయూ ఉపకులపతి ఆచార్య సర్కార్‌ హఠాన్మరణంతో విశ్వవిద్యాలయం మూగబోయింది. ప్రొఫెసర్లు,  ఉద్యోగులు, విద్యార్థులు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి భారీగా చేరుకున్నారు. çవిషన్నవదనాలతో ఘన  నివాళి అర్పించారు. బుధవారం ఉదయం నుంచి పాలక భనవంలో ఉన్న ఉపకులపతి సాయంత్రం అయ్యేసరికి ఇకలేరన్న సంగతి తెలియగానే విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement