సర్వత్రా ఉత్కంఠ | hindupur 9th ward by poll scutiny | Sakshi
Sakshi News home page

సర్వత్రా ఉత్కంఠ

Mar 24 2017 11:24 PM | Updated on Sep 5 2017 6:59 AM

సర్వత్రా ఉత్కంఠ

సర్వత్రా ఉత్కంఠ

హిందూపురం మున్సిపాల్టీ 9వ వార్డుకు జరిగే ఉప ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన శుక్రవారం సాయంత్రం వరకు ఉత్కంఠగా సాగింది.

- ప్రతిష్టాత్మకంగా 9వ వార్డు ఉప ఎన్నికలు
- రెండు నామినేషన్ల తిరస్కరణ.. 4 ఆమోదం


హిందూపురం అర్బన్‌ : హిందూపురం మున్సిపాల్టీ 9వ వార్డుకు జరిగే ఉప ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన శుక్రవారం సాయంత్రం వరకు ఉత్కంఠగా సాగింది. మొత్తం ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలనలో రెండు నామినేషన్లు తిరస్కరించినట్లు మున్సిపల్‌ కమిషనర్, ఎన్నికల అధికారి విశ్వనాథ్‌ తెలిపారు. కాగా 9వ వార్డు కౌన్సిలర్‌ గంగమ్మ ఆకస్మికంగా మృతి చెందటంతో ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 9న పోలింగ్‌ జరుగనుంది.

ఎన్నికల అధికారితో పాటు సహాయ ఎన్నికల అధికారులు తులసిరాం, నరసింహులు నామినేషన్లను క్షుణంగా పరిశీలించారు. వైఎస్సార్‌సీపీ ప్రధాన అభ్యర్థి అయిన సునీత అంగన్‌వాడీ కార్యకర్త అంటూ టీడీపీ అభ్యర్థి శాంతతో పాటు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఇరుపార్టీల న్యాయవాదులు తమ వాదనలను ఆధారాలను ఎన్నికల అధికారి ఎదుట ఉంచారు. అలాగే రెండో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గాయిత్రీ కూడా బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించలేదని అభ్యంతరం లేవనెత్తారు. వీటిపై చర్చించి పత్రాలు పరిశీలించిన తర్వాత నిర్ణయం తెలియజేస్తామని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రశాంత్‌గౌడ్, శివ, నాగభూషణం, శ్రీన సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన కొన్ని తీర్పుల రికార్డుల ఉదాహరణ పత్రాలు ఎన్నికల అధికారికి సమర్పించారు. సునీత నామినేషన్‌ దాఖలు చేసే సమయానికి అంగన్‌వాడీ కార్యకర్తగా రాజీనామా చేసి ఉన్నతాధికారులకు అందించినట్టు వివరించారు. సాయంత్రం 5 గంటలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సునీత నామినేషన్‌ను, కుల ధ్రువీకరణ పత్రం లేదని గాయిత్రీ నామినేషన్‌ను తిరస్కరించినట్టు ప్రకటించారు. ప్రస్తుతం రాధ, నాగరత్నమ్మ, శాంతి, రూపా బరిలో ఉన్నారు.

ఎదుర్కొనలేక అడ్డుకున్నారు
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సునీతను నేరుగా ఎదుర్కొనలేక అడ్డదారుల్లో రాజకీయ ఒత్తిళ్లు పెట్టి నామినేషన్‌ తిరస్కరింపజేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, అభ్యర్థి సునీత పేర్కొన్నారు. ఓడిపోతామనే భయంతో టీడీపీ నాయకులు అ«ధికారులపై ఒత్తిడి పెట్టి నామినేషన్‌ తిరస్కరించేలా చేయడం సిగ్గుచేటన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement