
మహిళను ‘కమిట్‌మెంట్’ అడిగిన కేసులో తూతూమంత్రపు చర్యలు
అసలు నిందితుడిని వదిలేసిన టీడీపీ అధిష్టానం
నిందితుడ్ని వెనకేసుకొస్తున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ?
సాక్షి టాస్క్‌ఫోర్స్: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో మహిళా శానిటరీ వర్కర్‌ను ఉద్యోగం నుంచి తొలగించి.. ఆపై ‘కమిట్‌మెంట్’ ఇస్తే తిరిగి ఉద్యోగం ఇప్పిస్తామని బెదిరించిన వ్యవహారంలో అసలు సూత్రధారి అయిన టీడీపీ నేతను వదిలేసి ఇద్దరు కార్యకర్తలను ఆ పార్టీ బలి చేసింది. శానిటరీ వర్కర్ ఉద్యోగం కోసం ‘కమిట్‌మెంట్’ ప్రతిపాదన చేయించిన టీడీపీ నేత యుగంధర్ అలియాస్ చింటూపై టీడీపీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది.
అసలు నిందితుడిని వదిలేసి ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తులపై మాత్రమే చర్యలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమిట్‌మెంట్ ఇవ్వాలంటూ మహిళను టీడీపీ కార్యకర్తలు ఫోన్‌లో వేధించిన ఆడియో రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మహిళతో ఫోన్ సంభాషణ సాగించిన వ్యక్తి.. చింటూ తన మాట వింటాడని చెప్పడం, డబ్బు అతనికి అవసరం లేదని, కమిట్‌మెంట్ కావాలని అడగడం వంటి అంశాలు ఆడియోలోనే ఉన్నాయి. దీనినిబట్టే ఈ అంశంలో చింటూ ప్రధానంగా ఉన్నట్టు తెలుస్తోంది. అతనిపై టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలూ తీసుకోకుండా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెనకేసుకొస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పోలీసులు సైతం చింటూపై కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. చింటూ అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ ప్రజలను వేధింపులకు గురి చేస్తుంటాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతడి బారిన పడినవారుతమ ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు తీర్చారని సమాచారం. ఇలాంటి వ్యక్తిపై టీడీపీ అమితమైన ప్రేమ చూపించడాన్ని ఆ పార్టీ శ్రేణులే తప్పుబడుతున్నాయి.
ఇద్దరు కార్యకర్తలపై వేటు..
ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు టీడీపీ కార్యకర్తలను ఆ పార్టీ బుధవారం సస్పెండ్ చేసింది. మహిళతో అసభ్యంగా మాట్లాడిన టీడీపీ కార్యకర్తలు కగ్గలప్ప, అతని సోదరుడు నగేష్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలో బాధిత మహిళకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపించిన విషయం విదితమే.