
ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణిని అడ్డుకున్న మధురేపల్లి వాసులు
భూమిపూజ చేసి 11 ఏళ్లయినా గ్రామానికి రోడ్డు లేదని ఆవేదన
సాక్షి, చిలమత్తూరు: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరకు నిరసన సెగ తగిలింది. శుక్రవారం ఆమె మండలంలోని తమ్మినాయనపల్లి గ్రామ రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరుతుండగా.. కోడూరు పంచాయతీ పరిధిలోని మధురేపల్లి గ్రామస్తులు ఆమెను అడ్డుకున్నారు.
కేవలం భూమిపూజలేనా.. పనులు కూడా చేస్తారా అంటూ ప్రశ్నించారు. తమ గ్రామ రహదారి నిర్మాణం కోసం 2014 సంవత్సరంలో భూమి పూజ చేశారని, పదకొండేళ్లయినా ఇంత వరకూ రోడ్డు నిర్మాణం చేపట్టలేదని వాపోయారు. రోడ్డు లేకపోవడంతో కోడూరు తోపులోని ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏడాదికోసారి నాయకులు రావడం, భూమి పూజ చేయడం, వెళ్లిపోవడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్డు సరిగా లేని కారణంగా వర్షాకాలం గ్రామం నుంచి రావాలంటే ఇబ్బందిగా మారిందన్నారు. అత్యవసర సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారమన్నారు. వెంటనే తమ గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. దీంతో వసుంధర స్పందిస్తూ విషయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివాదంలో బాలకృష్ణ..
మరోవైపు.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీరు వివాదంగా మారింది. హిందూపురంలో బాలకృష్ణ సతీమణి వసుంధర షాడో ఎమ్మెల్యేగా రంగంలోకి దిగడంపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా వసుంధర హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం పట్ల స్థానికులు, పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న సుపరిపాలన-తొలి అడుగు కార్యక్రమం బాలకృష్ణ సతీమణి వసుంధర నిర్వహించడం వివాదానికి దారి తీసింది. ఎమ్మెల్యే బాలకృష్ణ షూటింగుల్లో బిజీ బిజీగా ఉండటం.. అధికారిక కార్యక్రమాల్లో వసుంధర భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.