డ్రైవింగ్‌ లైసెన్స్‌లూ ఆన్‌లైన్‌లోనే


– భవిష్యత్‌లో వాహనదారులు కార్యాలయానికి రానవసరం ఉండదు

– ఉపరవాణా కమిషనర్‌ సుందర్‌వద్దీ


అనంతపురం సెంట్రల్‌: వాహనదారులు ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఏ పనైనా ఆన్‌లైన్‌లో చేసుకునేవిధంగా త్వరలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని ఉపరవాణా కమిషనర్‌ సుందర్‌వద్దీ తెలిపారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడారు. ఇప్పటికే నాన్‌ట్రాన్స్‌పోర్టు, ట్రాన్స్‌పోర్టు వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆన్‌లైన్‌ అయిందన్నారు. వారం రోజుల్లో డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు సంబంధించి తొలిఘట్టం ఎల్‌ఎల్‌ఆర్‌ కూడా ఆన్‌లైన్‌ పొందవచ్చునని చెప్పారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద కడప, విజయవాడ, విశాఖపట్నంలో ప్రారంభించినట్లు తెలిపారు. ఈ వారంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ప్రస్తుతం మీ సేవా కేంద్రాల నుంచి దరఖాస్తు చేసుకొని, ఎల్‌ఎల్‌ఆర్‌ కోసం కార్యాలయానికి రావాల్సి ఉంటుందన్నారు.



ఇక నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, ఎక్జామ్‌ ఉంటుందని వెల్లడించారు. అర్హత ఉన్న వారికి ఎల్‌ఎల్‌ఆర్‌ మంజూరు చేస్తామని, ఆన్‌లైన్‌లో తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అనంతరం డ్రైవింగ్‌ లైసెన్స్‌ టెస్టింగ్‌ కోసం మాత్రమే రావాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ టెస్టింగ్, వాహనాల ఫిట్‌నెస్‌ కోసం మాత్రమే కార్యాలయానికి రావాల్సి ఉంటుందన్నారు. మిగిలిన పనులన్నీ ఆన్‌లైన్‌ ద్వారానే చేసుకోవచ్చునన్నారు. దీంతో భవిష్యత్‌ కోసం రహదారుల భద్రతపై ఎక్కువ దృష్టి సారిస్తామని వివరించారు. ఎక్కువ శాతం వాహనాలను తనిఖీ చేసి అనుమతులు లేని వారిపై కేసులు నమోదు చేసి తద్వారా ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తామని వివరించారు. అలాగే రోడ్డు  ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడతామని తెలిపారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top