కొరవడుతున్న శిక్షణ, నైపుణ్యం
డ్రైవింగ్ పరీక్షలు లేకుండానే ఇచ్చేస్తున్న ఆర్టీఏ
నైపుణ్యం లేని డ్రైవర్ల కారణంగానూ రోడ్డు ప్రమాదాలు
సాక్షి, హైదరాబాద్: పరిమితికి మించిన వేగం. ర్యాష్ డ్రైవింగ్. ట్రాఫిక్ నిబంధనలపై కొరవడిన కనీస అవగాహన.‘డ్రైవింగ్ సెన్స్’ లేకుండానే భారీ వాహనాలతో దూకుడు.. శాస్త్రీయమైన శిక్షణ, నైపుణ్యం లేని నాసిరకం డ్రైవర్లు రవాణా రంగాన్ని హడలెత్తిస్తున్నారు. రహదారి భద్రతకే సవాల్ విసురుతున్నారు. డ్రైవింగ్‌ను ఉపాధిగా ఎంచుకొని ఈ రంగంలోకి ప్రవేశిస్తున్న కొత్తతరం డ్రైవర్లు అరకొర నైపుణ్యంతోనే లారీలు, టిప్పర్లు, ఆరీ్టసీ, ప్రైవేట్ బస్సులను నడుపుతున్నారు. అపరిమితమైన వేగంతో దూసుకెళ్తూ వాహనాలను అదుపుచేయలేక ప్రమాదాలకు కారణమవుతున్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దుర్ఘటనలో ఓవర్‌లోడ్‌తో పాటు మితిమీరిన వేగంతో వస్తున్న టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోయాడు. దీంతో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఎలాంటి శిక్షణ, నైపు ణ్యం లేని ఇలాంటి డ్రైవర్లకు ఎల్‌ఎంవీ (లైట్‌మోటార్ వెహికల్), హెవీ (భారీ) వాహనాలను నడిపే డ్రైవింగ్ లెసెన్సులు అంగడి సరుకుల్లా లభించడం గమనార్హం. రవాణాశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డ్రైవింగ్ టెస్ట్‌ట్రాక్‌లు, ఆర్టీఏ అనుమతితో నడిచే డ్రైవింగ్ స్కూళ్లు, దళారులు మూకుమ్మడిగా అందుకు దోహదం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఇదొక వ్యవస్థీకృత కార్యకలాపంగా కొనసాగుతోంది.
‘డబ్ల్యూ’అంటే వితౌట్ టెస్ట్..
సాధారణంగా టెస్ట్ ట్రాక్‌లలో పరీక్షలు నిర్వహించి డ్రైవింగ్ లైసెన్సులను అందజేస్తారు. వివిధ రాష్ట్రాల్లో ప్రధాన రహదారులపైన ఈ పరీక్షలు నిర్వహిస్తుండగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు, తెలంగాణ అంతటా ‘హెచ్’, ‘ఎస్’, ‘8’ ‘యూ’ వంటి వివిధ ఆకారాల్లో రూపొందించిన ట్రాక్‌లలో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. నాగోల్ వంటి కొన్ని ప్రధానమైన టెస్ట్‌ట్రాక్‌లు మినహాయించి మిగతా చోట్ల ఎలాంటి పరీక్షలు లేకుండానే లైసెన్సులు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం వంటి కొన్ని శివారు కార్యాలయాల్లో ఈ దందా బాహటంగానే కొనసాగుతోంది. డ్రైవింగ్ స్కూళ్లు, దళారులు, ఏజెంట్‌ల ద్వారా వచ్చే అభ్యర్ధులకు ఈ ‘డబ్ల్యూ’ లైసెన్సులు ఇస్తారు. ‘డబ్ల్యూ’ అనేది ఒక కోడ్. అంటే ‘వితౌట్’ అని అర్థం. డ్రైవింగ్ పరీక్షలు లేకుండా ఇచ్చే లైసెన్సులు ఇవి. దళారులు వాహనదారుల నుంచి ‘డబ్ల్యూ’ లైసెన్సుల కోసం అధికమొత్తంలో వసూలు చేస్తున్నారు.
‘సెన్స్’లెస్ డ్రైవింగ్...
టిప్పర్లు, లారీలు, డీసీఎంలు తదితర సరుకు రవాణా వాహనాలను నడిపే డ్రైవర్లు, ఆర్టీసీ అద్దె బస్సులు, స్కూల్ బస్సులు నడిపేవారికి రోడ్డు నియమాలపై సరైన అవగాహన ఉండడం లేదని నిపుణుల విశ్లేషణ.ఈ తరహా డ్రైవర్లు ఒకవైపు భారీ వాహనాలను నడుపుతూ పరిమితికి మించిన వేగంతో దూసుకెళ్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడుతున్నారు.
మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ కిలోమీటర్ల కొద్దీ బండ్లను ముందుకు దూకిస్తున్నారు.
ఈ డ్రైవర్లలో ఏ మాత్రం ‘డ్రైవింగ్ సెన్స్’ ఉండడం లేదు.


