సీఎం హామీ.. పూర్తికాదేమీ | double bedroom house Pending in the CM's adopted village | Sakshi
Sakshi News home page

సీఎం హామీ.. పూర్తికాదేమీ

Jul 4 2016 11:23 AM | Updated on Sep 29 2018 4:44 PM

స్వయంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గతేడాది జూలై నాలుగున మండలంలోని చిన్నముల్కనూర్ గ్రామస్తులకు ఇచ్చిన హామీ ‘మూన్నెళ్ల’ ముచ్చటగానే మిగిలిపోయింది.

 ‘మీ ఊరిని దత్తత తీసుకుంటున్న. మూడు నెలల్లో రూపురేఖలు మారిపోతాయి. ఊళ్ల అందరికీ డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా. సీసీ రోడ్లు, మురికికాలువలు కట్టిచ్చి ఊరును అద్దంలా చేస్తా. ఇది నా హామీ.’ అని సీఎం కేసీఆర్ సరిగ్గా ఏడాది కిందట చిన్నముల్కనూర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత గ్రామానికి సీఎం మూడు సార్లు వచ్చారు. కానీ.. ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు పూర్తికాలేదు.. ఊరి పరిస్థితి మారలేదు.          
 
     చిన్న ముల్కనూర్.. అభివృద్ధిలో పూర్
     ముఖ్యమంత్రి దత్తత గ్రామంలో పూర్తికాని డబుల్ బెడ్రూం ఇళ్లు
     మూడుసార్లొచ్చినా.. అభివృద్ధి శూన్యం

 
 ‘మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్న. మూడు నెలల్లో రూపురేఖలు పూర్తిగా మారుస్తా. గ్రామంలోని ప్రతిఒక్కరికీ డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించి ఇస్తా. సీసీ రోడ్లు, మురికికాలువలు నిర్మించి గ్రామాన్ని నందనవనంగా మారుస్తాం.. ఇది నా హామీ. ’ ఇది స్వయంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గతేడాది జూలై నాలుగున మండలంలోని చిన్నముల్కనూర్ గ్రామస్తులకు ఇచ్చిన హామీ. ఆ తర్వాత సీఎం గ్రామానికి మొత్తం మూడుసార్లు వచ్చారు. వచ్చిన ప్రతిసారీ.. ఇదే విషయూన్ని వెల్లడించారు. కానీ.. ఆచరణలో మాత్రం అమలు చేయలేకపోయూరు. దీంతో ఆయన హామీ ‘మూన్నెళ్ల’ ముచ్చటగానే మిగిలిపోయింది.


 చిగురుమామిడి
 ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన మండలంలోని చిన్నముల్కనూర్‌లో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ప్రహసనంగా మారింది. గ్రామంలో 600 పక్కా గృహాలు ఉండగా.. వాటిలో చాలావరకు శిథిలావస్థకు చేరుకున్నారు. దీంతో మొదటి విడతలో భాగంగా 248 మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు అదే ఏడాది 24న ఇళ్లను కూల్చివేసే పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. తీరా 11 నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఏ ఒక్క ఇళ్లును పూర్తిచేయించలేకపోయూరు. మూడు నెలల్లోనే గృహప్రవేశం చేయిద్దామని హామీ ఇచ్చినా.. ఇంకా ఆర్నెల్లు గడిచినా ఇళ్ల నిర్మాణం ముందుకు సాగలేని పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలోని ఇతర దత్తత గ్రామాలపై పెట్టిన ప్రత్యేక దృష్టి చిన్నముల్కనూర్‌పై పెట్టడంలేదనే విమర్శలు గ్రామస్తుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.


 నత్తనడక..
 సీఎం ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ ఏడాది మే 6న డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు చాలా ఇళ్లు పునాదుల్లోనే ఉండిపోయారు.  ఇప్పుడిప్పుడే పిల్లర్లు వేస్తున్నారు. మొదటి విడతలో మంజూరైన 248 ఇళ్ల నిర్మాణాలను మెగా కన్‌స్ట్రక్షన్ కంపెనీ చేపట్టింది.


 అర్హులకు అందని ఇళ్లు
 సీఎం దత్తత గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు అర్హులకందలేదు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల వైఖరితో  నిరుపేదలకు ఇళ్లు అందకుండాపోయూయి. స్థానికంగా నివాసం ఉండనివారికి ఇళ్లు మంజూరైనట్లు ఆరోపణలున్నాయి. కూలీ చేసుకునేవారికి, పాలేరులుగా బతుకుతున్నవారికి మొండిచేయి చూపినట్లు తెలుస్తోంది. విషయూన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయింని బాధితులు వాపోతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లలో ఉంటున్నవారికి, రేకుల షెడ్లలో నివసిస్తున్నవారికి కాకుండా పక్కా ఇళ్లు, స్లాబులలో నివసిస్తున్న వారికి ఇళ్లు మంజూరయినట్లు స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


 పూర్తి కావస్తున్న అభివృద్ధి పనులు
 మిషన్‌కాకతీయ కింద గ్రామంలోని రుద్రకుం ట, బోంకుంటను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయింది. ఆ పనులు పూర్తయ్యూయి. అలాగే శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు, దోబీఘాట్ పనులు సైతం పూర్తయ్యూయి. గ్రామంలో 100 మంది సన్న, చిన్నకారు రైతులకు దాదాపు 50శాతం సబ్సిడీతో రూ.40 లక్షల విలువ గల పాడిపశువులు అందించారు. అర్హులైన రైతులకు కరెంటు మోటార్లు, పైపులైన్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్‌లను అందించారు. గ్రామం నుంచి కోహెడ వరకు రూ.20 కోట్లతో బీటీ రోడ్డును విస్తరించారు. గ్రామంలోని ఆదర్శ పాఠశాల చుట్టూ దాదాపు రూ.10 లక్షలతో ప్రహరీ నిర్మించారు. విస్తర్లు, ప్లేట్ల తయారీపై గ్రామంలో ఆసక్తి ఉన్న స్వశక్తి మహిళలకు నెల పాటు శిక్షణ ఇచ్చారు. దాదాపు రూ.1.50 లక్షల విలువ గల విస్తర్లు, బ్రెడ్ తయారీ మిషన్‌ను కలెక్టర్ మంజూరు చేశారు. ప్రస్తుతం వారు బేకరీ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.


 ఇంకా చేయూల్సిన పనులు
 గ్రామంలో దాదాపు రూ.1.50 కోట్లతో సీసీ రో డ్లు, మురికికాలువలు నిర్మించాల్సి ఉంది. ఐబీ వసతి గృహాన్ని కూల్చలేదు. మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మించాల్సి ఉంది. తిమ్మాపూ ర్ మండలం కొత్తపల్లి నుంచి చిన్నముల్కనూర్ వరకు ఉన్న రోడ్‌ను ఫోర్‌లైన్‌గా విస్తరించాల్సి ఉంది. మిషన్ కాకతీయ కింద ఊరచెరువుకు రూ.1.20 కోట్లు మంజూరైనా పనులు ఇంకా ప్రారంభించలేదు. రైతులకు మినీ మార్కెట్‌యా ర్డు నిర్మిస్తామన్న హామీ అమలు కావడంలేదు. గ్రామంలోని జెడ్పీ పాఠశాల చుట్టూ ప్రహరీ, అదనపు తరగతి గదులు మంజూరు కాలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement