మురికివాడల్లో ఉంటే మురికి ఆలోచనలే... | Cm chandrababu comments | Sakshi
Sakshi News home page

మురికివాడల్లో ఉంటే మురికి ఆలోచనలే...

Feb 21 2016 7:15 AM | Updated on Aug 21 2018 8:34 PM

మురికివాడల్లో ఉంటే మురికి ఆలోచనలే... - Sakshi

మురికివాడల్లో ఉంటే మురికి ఆలోచనలే...

‘ఎస్సీ కుటుంబంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు’ అంటూ గతంలో దళితుల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబునాయుడు తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

- చదివిన చదువునూ మరచిపోతున్న ప్రభుత్వ టీచర్లు
-  సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

 
సాక్షి, విజయవాడ:
‘ఎస్సీ కుటుంబంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు’ అంటూ గతంలో దళితుల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబునాయుడు తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మురికివాడల్లో ఉంటే మురికి ఆలోచనలే వస్తాయని వ్యాఖ్యానించారు. శనివారం కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తాడేపల్లి చొప్పరమెట్ల గ్రామంలో డాక్టర్ కేకేఆర్ హ్యాపీ వ్యాలీ స్కూల్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ.. మన చుట్టూ మంచి వాతావరణం ఉంటే మంచి ఆలోచనలు వస్తాయని, మురికివాడల్లో ఉంటే మురికి ఆలోచనలు వస్తాయని అంటూ మురికివాడల్లో ఉండే పేదల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.

కేకేఆర్ హ్యాపీ వ్యాలీ స్కూల్ ప్యాలెస్‌లాగా వుందని, మంచి వాతావరణం, మంచి హిల్స్, వ్యాలీలో స్కూల్.. అందులో స్విమ్మింగ్‌పూల్ ఏర్పాటు చేశారని ప్రశంసించారు. ఇది లగ్జరీ అనాలో, అవసరమే అనాలో తనకు తెలియట్లేదని, కానీ ఇటువంటి స్కూల్‌లో తాను చదవలేకపోయినందుకు ఈర్ష్యగా ఉందని అన్నారు. ప్రభుత్వ టీచర్లపైనా చంద్రబాబు ఈ సందర్భంగా వాగ్బాణాలు సంధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పడంతోపాటు వారు చదివిన చదువుల్నే మరిచిపోతున్నారని వ్యాఖానించారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకంటే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ పాఠశాలల్లో మాత్రం రాణించట్లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రానివారు  ప్రైవేటు పాఠశాలల్లో చేరి బోధన చేసి ఐఐటీ గ్రాడ్యుయేట్లను తయారు చేస్తున్నారన్నారు.
 
 2018 జూన్‌కల్లా పోలవరం పూర్తి
 తొమ్మిది ప్రాజెక్టులకు డెడ్‌లైన్: సీఎం
 పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణం 2018 జూన్ కల్లా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులకు డెడ్‌లైన్ పెట్టుకున్నామని, ఆ ప్రకారం పనులు చేయిస్తామని తెలిపారు. ఆయన శనివారం తన కార్యాలయంలో జరిగిన విలేకరులతో మాట్లాడారు. వంశధార తొలి దశను 2017 జూన్ నాటికి, తోటపల్లిని 2016 జూన్‌కి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని 2016 మార్చికి, పోలవరం కుడికాలువను 2016 జూన్‌కి, వెలిగొండను 2017 డిసెంబర్‌కి, గాలేరు-నగరి మొదటి దశను 2016 జూన్‌కి, హంద్రీ-నీవా ప్రాజెక్టును 2016 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం 11 కోట్ల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్, 67 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ చేయాల్సివుందన్నారు. ఈ సంవత్సరం పట్టిసీమ నుంచి 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు తీసుకొస్తామని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement