చిరంజీవీ.. మీకిది తగునా? | Sakshi
Sakshi News home page

చిరంజీవీ.. మీకిది తగునా?

Published Wed, Jul 22 2015 10:16 PM

చిరంజీవీ.. మీకిది తగునా? - Sakshi

వీఐపీ ఘాట్ (రాజమండ్రి): పుష్కరాల్లో తమ పూర్వీకులకు పిండప్రదానం చేయడం సంప్రదాయం. ఈ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వర్తించడంలో ప్రతి ఒక్కరూ అత్యంత శ్రద్ధ తీసుకుంటారు. అయితే కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి రాజమండ్రి వీఐపీ ఘాట్‌లో బుధవారం పుష్కర స్నానం చేసి, తన పూర్వీకులకు చేసిన పిండప్రదాన తంతును అసంపూర్తిగా చేసి వెళ్లిపోవడం పలు విమర్శలకు దారి తీసింది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తన బావమరిది అల్లు అరవింద్, దర్శకుడు బి.గోపాల్, మేనల్లుడు అల్లు శిరీష్‌తో కలిసి వీఐపీ ఘాట్‌కు చేరుకున్నారు. చిరంజీవిని చూసేందుకు అప్పటికే వేలాదిగా యాత్రికులు ఎదురు చూస్తున్నారు.

పోలీసు బందోబస్తు నడుమ ఆయన ఘాట్‌లోకి వెళ్లి గోదావరిలో స్నానమాచరించారు. అప్పటికే ఘాట్ మెట్లపై పిండప్రదానానికి ఏర్పాట్లు చేశారు. చిరంజీవి తదితరులు అక్కడకు చేరుకుని ఆ క్రతువు ప్రారంభించారు. ఐదు నిమిషాల వ్యవధిలోనే ఆ తంతు ముగించేసేశారు. ఈలోగా అభిమానులు, యాత్రికులు ఆయనను చూసేందుకు ఎగబడటంతో రద్దీ పెరిగింది. ఇంతలో చిరంజీవి పిండ్రపదానంలో తీర్థవిధులు పూర్తి చేసి, వాటిని గోదావరిలో కలపకుండా మెట్లపైనే వదిలేసి వెళ్లిపోయారు. ఇది చూసిన అభిమానులు, యాత్రికులు విస్తుపోయారు. పిండాలు గోదావరిలో కలపకుండా అలా వదిలేశారేమిటా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

ఈ క్రతువు చేయించిన పురోహితుడు నోట మాట రాక అలాగే ఉండిపోయాడు. ఇంతలో అది సరికాదని భావించిన అభిమానులు.. పారిశుధ్య కార్మికుల సాయంతో చిరంజీవి వదిలేసిన తీర్థవిధులను ఎత్తించి చెత్తకుండీలో వేయించారు. ఈవిధంగా చేయడం శాస్త్రవిరుద్ధమని పలువురు పురోహితులు అన్నారు. గోదావరిలో కలపకపోతే పిండప్రదానం పూర్తయినట్టు కాదని, ఇది ఫలితం ఇవ్వదని అన్నారు. పుష్కర స్నానం అయిన తరువాత చిరంజీవి విలేకర్లతో మాట్లాడుతూ పుష్కర మాహాత్మ్యం, స్నానం చేస్తే చేకూరే పుణ్యం గురించి గొప్పగా చెప్పడం విశేషం.

Advertisement
Advertisement