ముగ్గురూ.. ముగ్గురే | Sakshi
Sakshi News home page

ముగ్గురూ.. ముగ్గురే

Published Sun, Oct 9 2016 3:40 AM

ముగ్గురూ.. ముగ్గురే - Sakshi

 
  •  టీడీపీ సర్వేలో ఎమ్మెల్యేల మీద జనం అసంతృప్తి
  •  కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు
  • ఉదయగిరి ఎమ్మెల్యే అందుబాటులో లేడని ప్రజల ఆగ్రహం
  • ముగ్గురి తీరుపై సీఎం చంద్రబాబు అసహనం
 
సాక్షి ప్రతినిధి – నెల్లూరు :
 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన కోవూరు, వెంకటగిరి, ఉదయగిరి ఎమ్మెల్యేల తీరుపై ఆ నియోజక వర్గాల ప్రజలు, పార్టీ కేడర్‌ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ జరిపిన సర్వేలో వెల్లడైంది. జనానికి దగ్గర కాకపోతే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిత్వం దక్కడం అనుమానమేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వీరికి పరోక్ష హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి కావడంతో ఇక వచ్చే ఎన్నికలకు సరంజామా సిద్ధం చేసుకునే పనిలో పడింది. ఎమ్మెల్యేలు, నియోజక వర్గ పార్టీ ఇన్‌చార్జ్‌ల పనితీరు, వ్యవహార సరళి, ప్రజలు వీరి గురించి ఏమనుకుంటున్నారు అనే అంశాలపై పార్టీ నాయకత్వం ఇటీవల రహస్య సర్వే జరిపించింది. గుంటూరు జిల్లాలోని కేఎల్‌ యూనివర్సిటీలో మూడు రోజుల కిందట జరిగిన శిక్షణా తరగతుల సందర్భంగా సర్వే వివరాలను వీరికి సీల్డ్‌ కవర్లలో ఉంచి అందచేశారు. సర్వే ఫలితాల వివరాలు రహస్యంగా ఉంచుకుని ప్రతికూల అంశాలను అధిగమించాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. శిక్షణా తరగతుల సందర్భంగా చంద్రబాబు ఇటీవల వెంకటగిరి ఎమ్మెల్యే రైల్వే కాంట్రాక్టు సంస్థను రూ.5 కోట్లు అడిగినట్లు వచ్చిన ఆరోపణలు, వీటి మీద జిల్లాలోని ఇతర నాయకులు స్పందించక పోవడం లాంటి అంశాలను కూడా మాట్లాడినట్లు తెలిసింది. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, ఆరోపణలను కూడా జిల్లా నాయకులు సరిగా తిప్పి కొట్టలేక పోతున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారని సమాచారం. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి ఉంటుందని కొందరిని ఘాటుగా హెచ్చరించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సర్వేలో జనం వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రామ రామ.. కృష్ణ కృష్ణ
  •  వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఈ రెండేళ్లలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా చేసే ప్రతి పని తామే చేయాలని పట్టుబట్టడం, ఇతర కాంట్రాక్టర్లను బెదిరించడం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల నుంచి పర్సెంటేజీలు వసూలు చేస్తున్నారు. పార్టీ కోసం ఎంతో కాలంగా పనిచేస్తున్న  కేడర్‌కు చిన్న పనులు కూడా ఇవ్వడం లేదు. ఆయన అభిప్రాయాలను అంగీకరించని పార్టీ నాయకులు, మాట వినని అధికారులతో ఆయన వ్యహరిస్తున్న తీరుపై జనం అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుని పోలేక పోతున్నారు.

నిధులు.. గోవిందా

  • కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నియోజక వర్గంలో జరిగే ప్రతి అభివృద్ధి పనిలో నేరుగా వాటాలు తీసుకుంటున్నారు. నియోజక వర్గంలో జరిగిన నీరు–చెట్టు పనుల్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిధులు కొల్లగొట్టారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారికి కూడా కమీషన్లు లేనిదే పనులు ఇవ్వడం లేదు. ఎమ్మెల్యే తీరుతో ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ పనిచేయాలంటే భయపడుతున్నారు. ప్రజలకు దగ్గర కాలేక పోతున్నారు. ప్రభుత్వ, సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకుని పోలేకపోతున్నారు.

రామా.. రావు

  • ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఎమ్మెల్యేగా గెలిచింది మొదలు జనానికి అందుబాటులోనే ఉండటం లేదు. నియోజక వర్గంలోని చాలా మంది ప్రజలు ఆయనను ఇప్పటి దాకా చూడనే లేదు. ఆయన తరఫున ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చూస్తున్న నాయకులు ఎవరికి వారు సొంత వ్యాపారాల్లో మునిగిపోయారు. ఎమ్మెల్యే పేరు చెప్పి చోటా నాయకులు కాంట్రాక్టర్ల నుంచి బలవంతంగా పర్సెంటేజీలు పిండేస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకుని వెళ్లలేక పోతున్నారు. నియోజక వర్గంలో ఏవైనా సమస్యలు వస్తే ప్రజలు మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి దగ్గరకు వెళుతున్నారు.
 
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement