ఐపీఎల్‌ మ్యాచ్‌ చూసి వెళ్తుండగా.. | 3 died in road accident at chivvemla | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ మ్యాచ్‌ చూసి వెళ్తుండగా..

May 1 2017 8:05 AM | Updated on Aug 30 2018 4:10 PM

ఐపీఎల్‌ మ్యాచ్‌ చూసి వెళ్తుండగా.. - Sakshi

ఐపీఎల్‌ మ్యాచ్‌ చూసి వెళ్తుండగా..

ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు

చివ్వెంల: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

వివరాలు.. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన నలుగురు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన సన్‌రైజర్స్‌- కోల్‌కతా ఐపీఎల్‌ మ్యాచ్‌ చూసి తిరిగి కారులో వెళ్తుండగా.. గుంపుల తిరుమలగిరి వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మరో ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి
చివ్వెంల మండలం కుడకుడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతిచెందాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనాథ్‌ ఆదివారం రాత్రి డ్యూటీ ముగించుకొని స్వగ్రామమైన నూతనకల్‌కు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన శ్రీనాథ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement