సిలికాన్ వ్యాలీలో ఘనంగా మనబడి స్నాతకోత్సవం | Siliconandhra Manabadi Graduation Ceremony in Silicon Valley | Sakshi
Sakshi News home page

సిలికాన్ వ్యాలీలో ఘనంగా మనబడి స్నాతకోత్సవం

May 26 2016 12:01 AM | Updated on Sep 2 2018 4:12 PM

సిలికాన్ వ్యాలీలో ఘనంగా మనబడి స్నాతకోత్సవం - Sakshi

సిలికాన్ వ్యాలీలో ఘనంగా మనబడి స్నాతకోత్సవం

మనబడి విద్యార్ధులను చూస్తుంటే తెలుగుభాష భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండబోతోందని తెలుస్తోందని డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు.

సిలికాన్ వ్యాలీ : మనబడి విద్యార్ధులను చూస్తుంటే తెలుగుభాష భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండబోతోందని తెలుస్తోందని డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. మనబడి నిర్వహిస్తున్న ఈ అద్భుత కార్యక్రమం అందరికీ ఆదర్శ ప్రాయమైనది అని స్పష్టం చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా తెలుగు భాషా పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సిలికానాంధ్ర మనబడి హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధంగా నిర్వహిస్తున్న 'మనబడి ' స్నాతకోత్సవం ఆదివారం శాన్ హోసే లోని పార్క్ సైడ్ కన్వెన్షన్ సెంటర్ లో అత్యంత వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ శ్రీ కె. రామచంద్రమూర్తి మాట్లాడుతూ...  ఆంధ్రులు ఆరంభ శూరులు అని అంటుంటారని ... కానీ సిలికానాంధ్రులు ఏదైనా మొదలు పెడితే విజయం సాధించే వరకూ వెనుతిరగరని రుజువు చేశారని 150 మందితో మొదలుపెట్టి నేడు 6000 మందికి పైగా విద్యార్ధులు చదువుకునే విధంగా ఈ  విద్యా వ్యవస్థను నిర్వహించడం ద్వారా సిలికానాంధ్ర మనబడి నిర్వాహుకులు ఆ సత్యాన్ని నిరూపించారని కొనియాడారు.

2015-16 విద్యా సంవత్సరానికి తెలుగు విశ్వ విద్యాలయం నిర్వహించిన పరీక్ష విశేషాలను రిజిస్ట్రార్ ఆచార్య తోమాసయ్య వివరిస్తూ మనబడి విద్యార్ధులు భాషను లోతుగా అభ్యసించడంలో చూపుతున్న అంకిత భావం తమను ముగ్ధులను చేసిందని ప్రశంసించారు. 2007లో ' మనబడి ' ప్రారంభించింది మొదలు అనేక అద్భుతాలను సృష్టిస్తూ, కొద్దికాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద తెలుగు భాషా బోధన కార్యక్రమంగా పేరు పొందిందని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ సంతోషం వ్యక్తం చేశారు.  


మనబడి అద్యక్షులు రాజు చమర్తి ప్రసంగిస్తూ, మనబడి 10 కి పైగా దేశాల్లో, అమెరికాలో దాదాపు 35 రాష్ట్రాలలో 250 కి పైగా శాఖలతో 1000 కి పైగా భాషా సైనికులతో ఒక  భాషాఉద్యమంలా వ్యాప్తి చెందుతోందని చెప్పారు. ఈ ఏడాది 6000 మంది విద్యార్ధులు తెలుగు నేర్చుకుంటున్నారని ఆనంద్ వెల్లడించారు.

మనబడి ఉపాధ్యక్షులు దీనబాబు కొండుభట్ల మాట్లాడుతూ...  తెలుగు విశ్వవిద్యాలయం నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తూ మనబడి కొనసాగుతున్నదని స్పష్టం చేశారు. ఈ కోర్సు చదివిన వారికి అమెరికాలోని వివిధ స్కూల్ డిస్ట్రిక్ట్లో ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్స్ లభిస్తున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమం లో తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య తోమాసయ్య, అంతర్జాతీయ తెలుగు కేంద్రం అధిపతి డా. మునిరత్నం నాయుడు, పరీక్షల విభాగం అధిపతి డా. వై. రెడ్డి శ్యామల, ప్రజా సంబంధాల అధికారి డా. జె.చెన్నయ్య, సిలికానాంధ్ర వైస్ చైర్మెన్ దిలీప్ కొండిపర్తి, అద్యక్షులు సంజీవ్ తనుగుల, రవీంద్ర కూచిభొట్ల, కిషోర్ బొడ్డు, ప్రభ మాలెంపాటి, మృత్యుంజయుడు తాటిపామల, శ్రీరాం కోట్ని, మనబడి ఉపాద్యక్షులు శాంతి కూచిభొట్ల, భాస్కర్ రాయవరం, శ్రీదేవి గంటి, శిరీష చమర్తి, శ్రీవల్లి కొండుభట్ల, ప్రియ తనుగుల, స్నేహ వేదుల, అనిల్ అన్నం, జయంతి కోట్ని, పాత్రికేయులు బుద్ధవరపు జగన్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు. 

Advertisement
 
Advertisement
Advertisement