
ప్రపంచ సాంకేతికత, ఆవిష్కరణలకు కేంద్రమైన సిలికాన్ వ్యాలీ నుంచి మల్టి నేషనల్ కంపెనీలు సైబరాబాద్ వైపు దృష్టి మళ్లిస్తున్నాయి. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుకు దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపిస్తుంటే.. నగరంలో స్థిరాస్తి కొనుగోళ్లు, పెట్టుబడులకు ప్రవాసులూ మొగ్గు చూపిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ పెట్టుబడులు సిలికాన్ వ్యాలీ నుంచి సైబరాబాద్‌కు వలస వస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో
హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో ప్రవాసుల వాటా 30 శాతం వరకు ఉంటుంది. ప్రధానంగా డల్లాస్, బూస్టన్, కాలిఫోర్నియా వంటి నగరాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా ప్రవాసులు ఉంటారు. భౌగోళిక రాజకీయ అస్థిరత, పెరుగుతున్న సుంకాలు, ఉద్యోగ విపణిలో అనిశ్చితులు వంటి అమెరికా, యూరప్ దేశాలలో నెలకొన్న అనిశ్చితి వాతావరణం నగర స్థిరాస్తి మార్కెట్‌కు బాగా కలిసి వస్తోంది. ప్రపంచదేశాల్లోని ప్రవాసులు స్వదేశానికి తిరిగొస్తున్నారు. కేవలం కుటుంబం కోసమే కాదు.. అవకాశాలు, పెట్టుబడుల కోసం కూడా.. ఈ పరివర్తనకు హైదరాబాద్ కేంద్రంగా ఉద్భవిస్తోంది. ఏడాది కాలంలోనే ఐదు ప్రధాన అమెరికా ఆధారిత కంపెనీలు ఇండియాలో జీసీసీ కేంద్రాలను ఏర్పాటు చేయడమే ఇందుకు ఉదాహరణ.
జీసీసీలకు కేంద్రం..
జీసీసీల విస్తరణ కేవలం సాంకేతికతకు మాత్రమే సంబంధించినది కాదు.. ఇది ప్రతిభ, మౌలిక సదుపాయాల అభివృద్ధిని కూడా సూచిస్తుంది. హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), ఇంటెలెక్చువల్ క్యాపిటల్‌గా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఏడాది జూన్ నాటికి హైదరాబాద్‌లో 350కి పైగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ) పనిచేస్తున్నాయి. ఫైనాన్షియల్, రిటైల్, క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్(క్యూఎస్‌ఆర్), హెల్త్‌కేర్, టెక్నాలజీ రంగాలలో 3 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఎలి లిల్లీ, మెక్ డొనాల్డ్స్ వంటి కంపెనీలు నగరంలో జీసీసీలను ఏర్పాటు చేశాయి. దేశంలోని 2 వేలకు పైగా జీసీసీలు ఉండగా.. ఇందులో హైదరాబాద్ వాటా దాదాపు 15 శాతం.
ప్రవాసులే లక్ష్యంగా..
డెవలపర్లు కూడా ప్రవాసులను లక్ష్యంగా చేసుకొని హైఎండ్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, కోకాపేట్ వంటి ప్రాంతాలకు చేరువలోని గేటెడ్ కమ్యూనిటీలు, స్మార్ట్ హోమ్ ప్రాజెక్ట్‌లకు ప్రవాసులకు అనుకూలం. గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్, కో–వర్కింగ్ హబ్‌లు, డేటా సెంటర్లలో పెట్టుబడులకు బహుళ జాతి సంస్థలు ఆసక్తిని చూపిస్తున్నాయి. చట్టపరమైన డాక్యుమెంటేషన్, ఇంటీరియర్ డిజైన్ వంటి స్థానిక సేవలను అందించే మధ్యవర్తులు, నాణ్యమైన ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది.