సిలికాన్ వ్యాలీలో భారతీయ నిపుణుల ఆధిపత్యంపై మరోసారి చర్చ మొదలైంది. గూగుల్‌లో పనిచేసిన ఒక మాజీ కాంట్రాక్టర్ చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారతీయులు ఒక రహస్య నెట్‌వర్క్‌ను నడుపుతున్నారని, అనైతిక మార్గాల్లో తమ వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు అటు అమెరికన్లలో, ఇటు భారతీయ టెక్కీలలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఏమిటా ఆరోపణలు?
జీబీ న్యూస్ రూపొందించిన ‘హెచ్-1బీ డాక్యుమెంటరీ’ కోసం స్టీఫెన్ వివియన్ అనే మాజీ గూగుల్ కాంట్రాక్టర్ మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గూగుల్‌లో పనిచేసే భారతీయ ఉద్యోగులు తమ స్నేహితులకు లేదా పరిచయస్తులకు ఇంటర్వ్యూలో అడిగే రహస్య ప్రశ్నలను ముందుగానే లీక్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. భారతీయులు కేవలం ఇండియన్స్‌నే నియమించుకోవడానికి ఇష్టపడుతున్నారని, దీనివల్ల అర్హత ఉన్న ఇతరులకు అన్యాయం జరుగుతోందని వివియన్ పేర్కొన్నారు. ‘నేను ఒక భారతీయ వ్యక్తితో స్నేహం చేశాను. ఆ క్రమంలోనే నాకు ఈ రహస్యాలు తెలిశాయి. ఇంటర్వ్యూలు పూర్తిగా గోప్యంగా ఉండాలి. కానీ వారు ఆ ప్రశ్నలను పంచుకుంటున్నారు. నిజాయితీ లేని అంశం ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
నెట్టింట ముదిరిన యుద్ధం
వివియన్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మెజారిటీ నిపుణులు ఆయన మాటలను కొట్టిపారేస్తూ, భారతీయ టెక్కీల ప్రతిభను తక్కువ చేయడమేనని మండిపడుతున్నారు. ‘భారతీయులు ప్రపంచస్థాయి కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారంటే అది వారి సామర్థ్యం. ఒక కఠినమైన జాబ్ మార్కెట్‌లో పోటీ పడలేక మొత్తం జాతీయతపై నిందలు వేయడం మీ పక్షపాతాన్ని చూపిస్తుంది’ అని ఒక నెటిజన్ స్పందించారు.
ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త రిచర్డ్ హనానియా స్పందిస్తూ, ‘ఈ వ్యక్తి ఒక డెలివరీ మేనేజర్ మాత్రమే, గూగుల్‌లో కీలక నిర్ణయాధికారి కాదు. ఒక కాంట్రాక్టర్ మాటలను పట్టుకుని భారతీయ నిపుణులందరినీ స్కామర్లుగా ముద్ర వేస్తారా?’ అని ప్రశ్నించారు. అయితే, వివియన్‌కు మద్దతు ఇచ్చే వారు కూడా లేకపోలేదు. ఐటీ రంగంలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల వారు తమ వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని కొందరు వాదిస్తున్నారు.
ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు


