కోటంరెడ్డి అరెస్ట్‌.. తీవ్ర ఉద్రిక్తత

YSRCP MLA Kotamreddy Sridhar Reddy Arrest - Sakshi

సాక్షి, నెల్లూరు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్‌ చేయటంతో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులను ప్రశ్నించినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో సర్వేల పేరుతో ఓట్లు తొలగిస్తున్న వారిని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. కానీ ఓట్లు తొలగిస్తున్న వారిపై కాకుండా వారిని పట్టించిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారు.

దీంతో పోలీసుల తీరుపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను విడుదల చేయాలని పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. అయితే కోటంరెడ్డి పోలీసులను దూషించారంటూ కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయనను ఐదోనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు కోటంరెడ్డిని వైద్య పరీక్షలకోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కోటంరెడ్డి అరెస్ట్‌పై ఆయన కుటుంబంసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై భైఠాయించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top