సైకో చేష్టలతో చనిపోతున్నా...

Young Commits Suicide In Srikakulam - Sakshi

‘నేను చనిపోతే ఈ ఏరియాలో మాత్రమే విషయం తెలుస్తుంది.. కానీ నేను తులసీ(ప్రియుడు) అనే సైకో చేష్టల వల్ల ఇలా(సూసైడ్‌) చేసుకున్నానని బీహర్‌ సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌లో కూడా తెలియాలి. ఇది నా చివరికోరిక – మీనాక్షి డైరీ

సాక్షి, కాశీబుగ్గ(శ్రీకాకుళం) : ప్రేమించానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వేధింపులకు గురి చేశాడు. చివరకు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారాలు చేయడంతో కుటుంబ సభ్యుల పరువు పోతుందన్న ఉద్దేశంతో ఆ యువతి కఠిన నిర్ణయం తీసుకుంది. ఐదు నెలలుగా తానూ ఏ విధంగా నరకం అనుభవించిందో తన డైరీలో రాసుకుని పెట్టుకుంది. చివరకు మంచినీటి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పలాస మండలం గురుదాసుపురం గ్రామానికి చెందిన సొర్ర మీనాక్షి(25) మామిడిమెట్టు పంచాయతీ పరిధి రంగోయి గ్రామానికి సమీప రోడ్డు పక్కన ఉజ్జిడమ్మతల్లి గ్రామదేవత ఆలయం వద్ద బావిలో మృతదేహమై తేలింది. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి తల్లిదండ్రులు మోహనరావు, రూపావతిల ఇద్దరు కుమార్తెలు లక్ష్మి, సునీతలకు వివాహాలయ్యాయి. చివరి కుమార్తె మీనాక్షి పలాస–కాశీబుగ్గలో ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదివింది. ఈమెతో కలిసి మందస మండలం రట్టి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ అందాల తులసిరావు కలిసి ఇంటర్‌మీడియట్‌ చదివాడు. బీహార్‌ సీఆర్‌పీఎఫ్‌ యూనిట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈయనతో పాత పరిచయం ఉన్నందున తన ఫోన్‌ నంబరు ఇచ్చింది. అప్పట్నుంచి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. చివరకు సోషల్‌ మీడియా ద్వారా ప్రచారాలు చేసి నరకం చూపించి చనిపోయే విధంగా ప్రేరేపించాడు. 

బావిలో మృతదేహం లభ్యం..
ప్రియుడు తులసీరావు పెట్టిన మానసిక వేధింపులు, తనకు చేసిన అన్యాయాన్ని మీనాక్షి ఈ నెల 5న తన డైరీలో రాసుకుని దాచి పెట్టుకుంది. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు తన మొబైల్‌లో భద్రపరుచుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం రోడ్డు పక్కన బావి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బహుశా శనివారం రాత్రి బావిలో పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. అయితే రెండు రోజులుగా కుమార్తె కనిపించకుండా పోయిందని, ఇంత దారుణానికి ఒడిగడుతుందని ఊహించలేకపోయామని తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ ఎస్‌ఐ మహమ్మద్‌ఆలీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని  సోమవారం ఉదయం బావిలో నుంచి తీయనున్నారు.

సూసైడ్‌ నోట్‌లో....
ఒకప్పుడు తులసీ, కృష్ణ మంచి స్నేహితులు. తులసి నా విషయంలో చేసిన ప్రతీ అన్యాయం  కృష్ణతో చెప్పుకునేదాన్ని. నా ఫోన్‌ నంబర్‌ తీసుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పే వ్యక్తి ఇలా చేస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కానీ పరిస్థితి. పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే నా మనసు అంగీకరించట్లేదు. కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ విలువేంటో నాక్కూడా తెలుసు. నేను పోతే నా కుటుంబానికి తులసీ వాళ్ల కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఉండదు. కారణం నేనే అయినప్పుడు అందరికీ దూరమవుతున్నాను. తను కూడా వాళ్ల నాన్న ప్రాణం కంటే నాకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు. గర్వపడ్డాను.. తన మనస్సులో నాకు ఇంత మంచి స్థానం ఉందా అని? కానీ ఇప్పుడిప్పుడు అర్థమైంది. తనకు నా మీద ఉన్నది ప్రేమ కాదు. నన్ను అందరిలో పరువు తీసి నన్ను నరకం చూపించి నా లోకంలో లేకుండా చేస్తానని వార్నింగ్‌ ఇచ్చేంత వరకు నాకు తెలియలేదు. బతికే పది రోజులైనా ఏ టెన్షన్‌ లేకుండా సరదాగా బతకాలి అనుక్షణం భయంతో బతికితే ఆ బతుకే వేస్ట్‌ ఐ మిస్‌ యూ మై ఫ్యామిలీ. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top