భారీగా కలప స్వాధీనం    | wood is Heavily captured | Sakshi
Sakshi News home page

భారీగా కలప స్వాధీనం   

Apr 11 2018 1:20 PM | Updated on Aug 10 2018 9:42 PM

wood is Heavily  captured - Sakshi

కోనలోవలో పొలంలో స్వాధీనం చేసుకున్న టేకు కలప  

రంపచోడవరం: అడ్డతీగల మండలం కోనలోవ గ్రామంలో టీడీపీ నాయకుడి పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను రాజమహేంద్రవరం నుంచి వచ్చిన ఫారెస్ట్‌ స్క్వాడ్‌ అధికారులు మంగళవారం దాడి చేసి పట్టుకున్నారు.

ఫారెస్టు స్క్వాడ్‌ డీఆర్‌ఓ సోమరాజు సిబ్బందితో ఈ దాడులు నిర్వహించారు. అక్రమంగా టేకు కలప నిల్వ చేసిన టీడీపీ నాయకుడు బూర్లు హరిబాబుపై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న కలపను కోనలోవ సెక్షన్‌ అధికారికి అప్పగించారు.

దీనిపై స్క్వాడ్‌ అధికారులు టేకు అక్రమ నిల్వపై హరిబాబును ప్రశ్నించారు. సమీపంలో కొట్టపాలెం గ్రామంలోని గిరిజనుడు పొలం నరికి వేసిన చెట్లను తాను తీసుకువచ్చి గృహోపకరణాలు చేస్తున్నట్టు తెలిపారు. దీనిపై ఇదీ చట్టరీత్యా నేరమని స్క్వాడ్‌ అధికారి సోమరాజు తెలిపారు.

అటవీ చట్టాలు ఏం చెబుతున్నాయి..

ఏజెన్సీలో సొంత పొలంలో ఉన్న విలువైన టేకు, వేప తదితర జాతుల చెట్లును నరకాలంటే ముందుగా అటవీశాఖ అనుమతి తప్పని సరిగా తీసుకోవాలి. అయితే హరిబాబు పొలంలో స్వాధీనం చేసుకున్న కలపకు ఎటువంటి అనుమతులు లేవు. దీంతో ఫారెస్టు అధికారులు కేసులు నమోదు చేశారు.

అయితే ఇదే పొలంలో అటవీశాఖ ఎన్‌ఆర్‌జీఎస్‌ అనుసంధానంతో నర్సరీ నిర్వహిస్తోంది. ప్రతిరోజూ అటవీ అధికారులు ఈ నర్సరీని సందర్శించి మొక్కల పరిస్థితి, కూలీల గురించి పర్యవేక్షణ చేస్తారు. అయితే నర్సరీ పరిసరాల్లోనే భారీ టేకు కలపను నిల్వ చేసి సైజులుగా కోసినా స్థానిక అటవీ అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా కోనలోవ అటవీ సెక్షన్‌ పరిధిలో టేకు ప్లాంటేషన్‌ల్లో టేకు చెట్లను స్మగర్లు నరికి వేసినట్టు సమాచారం. దీనిపై అటవీశాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయని పలువురు చెబుతున్నారు. అలాగే నర్సరీలోనూ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణాలు ఉన్నాయి.

ఎక్కడో విజయవాడలో చదువుతున్న ఇద్దరు యువకుల పేరున ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ మస్తర్లు నమోదు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు చెబుతున్నారు. నర్సరీ వ్యవహరంపై విచారణ జరిపితే నిజాలు తేటతెల్లమవుతాయంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement