మోటార్‌ సైకిల్‌ను ఢీకొన్న ట్రాక్టర్‌ | Women Died in Bike And Tractor Accident | Sakshi
Sakshi News home page

మోటార్‌ సైకిల్‌ను ఢీకొన్న ట్రాక్టర్‌

Feb 2 2019 8:29 AM | Updated on Feb 2 2019 8:29 AM

Women Died in Bike And Tractor Accident - Sakshi

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మంగ మంగ (ఫైల్‌)

విజయనగరం, తెర్లాం: ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్, మోటార్‌ సైకిల్‌ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కూనాయవలస గ్రామానికి చెందిన మల్లేడ మంగ (22) ఆమె భర్త రమేష్‌ తెర్లాం నుంచి సొంత గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. సరిగ్గా సూరీడు తోట దాటిన తర్వాత ఉన్న మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న మంగ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న తెర్లాం ఎస్సై ఎ.నరేష్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రమేష్‌ను వెంటనే రాజాం ఆస్పత్రికి తరలించారు. మంగ మృతదేహానికి కుటుంబ సభ్యుల సమక్షంలో శవపంచనామ చేపట్టి పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించారు.

ఏడాదిన్నర కిందట వివాహం
 కునాయవలసకు చెందిన మల్లేడ రమేష్‌కు మంగతో ఏడాదిన్నర కిందట వివాహం కాగా వీరికి ఆరు నెలల పాప ఉంది. మంగకు అనారోగ్యంగా ఉండడంతో తెర్లాంలోని ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.  మంగ మృతితో కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement