విజయవాడలో మహిళ దారుణ హత్య

Woman brutally murdered in Vijayawada - Sakshi

గొంతు కోసి ఆభరణాల చోరీ చేసిన దుండగులు 

భవానీపురం (విజయవాడ పశ్చిమ): భవానీపురంలో జరిగిన మహిళ దారుణ హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పాత నేరస్తుడే హంతకుడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆరేళ్లుగా నిందితుడు పోలీసులకు చిక్కకుండా నేరాలకు పాల్పడుతున్నాడు. అతడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ సంఘటనతో మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందాల్సిన పని లేదని పోలీసులు భరోసా ఇస్తున్నారు.

కాగా ఒంటరిగా ఉన్న మహిళను గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం సాయంత్రం విజయవాడ భవానీపురంలో జరిగిన విషయం తెలిసిందే. భవానీపురం క్రాంబ్వే రోడ్‌కు అనుసంధానంగా ఉన్న కెనరా బ్యాంక్‌ రోడ్‌లో యేదుపాటి వెంకటేశ్వర్లు, పద్మావతి(55) దంపతులు నివసిస్తున్నారు. వెంకటేశ్వర్లు ఇసుక, ఇటుక, కంకర వ్యాపారం చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం దంపతులు ఇద్దరూ స్థానికంగా ఉన్న అమ్మపాద అపార్ట్‌మెంట్‌లో ఫంక్షన్‌కు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. భార్య పద్మావతిని ఇంటి దగ్గర దింపేసిన వెంకటేశ్వర్లు పనులపై బయటకు వెళ్లిపోయారు.

ఇంటికి వచ్చిన తరువాత పద్మావతి తమ సమీప బంధువుకు ఫోన్‌ చేశారు. అయితే, ఆమె ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. సాయంత్రం 4 గంటల సమయంలో ఫోన్‌లో మిస్డ్‌ కాల్‌ చూసుకున్న బంధువు తిరిగి పద్మావతికి ఫోన్‌ చేయగా ఆమె ఫోన్‌ ఎత్తలేదు. దీంతో ఆమె మిన్నకుండిపోయింది. రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన వెంకటేశ్వర్లు రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్య జరిగిన తీరు చూస్తుంటే పాత నేరస్తుల పని అయి ఉంటుందని భావిస్తున్నామని డీసీపీ విక్రాంత్‌ పాటిల్‌ చెప్పారు. దుండగులు పద్మావతిని దారుణంగా గొంతు కోసి హత్య చేశారని చెప్పారు.

బాధితురాలి ఒంటిపై ఉన్న 10 కాసుల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారని తెలిపారు. కప్‌ బోర్డ్‌లో ఉన్న నగలు, నగదు ముట్టుకోలేదని తెలుస్తోందన్నారు. వేలి ముద్రలు కనిపించకుండా కారం చల్లారని చెప్పారు. గతంలో హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో జరిగిన హత్య కేసులో దొరికిన వేలి ముద్రలు ఉత్తరప్రదేశ్‌కు చెందిన పాత నేరస్తుడి వేలి ముద్రలతో సరిపోయాయని, అయితే సదరు నేరగాడు ఇంకా దొరకలేదని అన్నారు. పద్మావతి హత్య కూడా ఆ తరహాలోనే జరిగింది కాబట్టి ఉత్తరప్రదేశ్‌ నేరస్తుల పనేనా అన్నది విచారణలో తేలుతుందన్నారు. కాగా, డాగ్‌ స్క్వాడ్‌ టీమ్‌ తీసుకొచ్చిన జాగిలం పీఆర్‌కే బిల్డింగ్‌ వద్ద కాసేపు ఆగి, తిరిగి స్వాతి సెంటర్‌ వరకు వెళ్లింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top