
ప్రతీకాత్మకచిత్రం
కట్నం కోసం ఒత్తిడి చేస్తున్న అత్తింటి వారు మహిళను, మూడు నెలల కుమార్తెను సజీవ దహనం చేసిన ఘటన యూపీలో వెలుగు చూసింది.
లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లోని రాంపూర్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. కట్నం తేలేదని మహిళతో పాటు మూడు నెలల పసికందును అత్తింటి వారు సజీవ దహనం చేయడం కలకలం రేపింది. తన సోదరికి నాలుగేళ్ల కిందట వివాహమైందని, ఆమెకు మూడేళ్ల కుమారుడు, మూడు నెలల కుమార్తె ఉన్నారని, కట్నం కోసం అత్తిటి వారు ఒత్తిడి చేస్తుండగా ఆమె కొద్దినెలలుగా పుట్టింట్లో ఉందని బాధితురాలి సోదరుడు మహ్మద్ జావేద్ చెప్పారు. బుధవారం తన సోదరిని అత్తింటివారు తమ ఇంటికి తీసుకువెళ్లి అదే రోజు ఆమెను, మూడు నెలల కుమార్తెను సజీవ దహనం చేశారని తెలిపారు. తన సోదరి షబ్నం, ఆమె కుమార్తెల గురించి అత్తింటి వారు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ఇరుగు పొరుగు వారు ఈ ఘటనపై తమకు సమాచారం అందించారని చెప్పారు. జావేద్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరకట్నం, హత్య కేసును నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని రాంపూర్ ఎస్పీ అజయ్ శర్మ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించామని చెప్పారు.