ప్రియుడు మోజులో భర్త హత్య

Wife Killed Husband With Lover in Karnataka - Sakshi

భార్య అరెస్టు  

పరారీలో ప్రియుడు  

ఆనేకల్‌ వద్ద దారుణం  

దొడ్డబళ్లాపురం: అనైతిక సంబంధం రెండు సంసారాల్లో చిచ్చు పెట్టింది. వివాహిత ప్రియునితో కలిసి భర్తను హత్య చేసి, పోలీసులకు దొరికిపోయిన సంఘటన అనేకల్‌ లో చోటుచేసుకుంది.  శ్రీనివాస్‌ (30) హత్యకు గురైన వ్యక్తి. శ్రీనివాస్‌ భార్య ప్రతిభ (25)తన ప్రియుడు బాలక్రిష్ణతో కలిసి భర్తనే బలితీసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. బాగేపల్లికి చెందిన శ్రీనివాస్, ప్రతిభ ఇద్దరూ 10 సంవత్సరాల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 

ఉద్యోగ రీత్యా సంసారాన్ని అనేకల్‌ తాలూకా హిలలిగె గ్రామానికి షిఫ్ట్‌ చేశారు. శ్రీనివాస్‌ సెక్యూరిటీ గార్డ్‌ ఉద్యోగం చేసేవాడు. ప్రతిభకు పక్కింట్లో నివసిస్తున్న బాలక్రిష్ణతో పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరినీ చూడకూడని స్థితిలో చూసిన భర్త శ్రీనివాస్‌ గొడవచేశాడు. తమ ఆనందానికి అడ్డుగా శ్రీనివాస్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్రతిభ, తన భార్యను కూడా చంపేయాలని బాలకృష్ణ తీర్మానించుకున్నారు.  

పొడిచి చంపి, చెరువులో పడేశారు  
కుట్రలో భాగంగా బాలక్రిష్ణ తన భార్య లక్ష్మిని, ప్రతిభ తన భర్త శ్రీనివాస్‌ను ఉద్యోగం ఒకటి ఉందని నమ్మించి చందాపుర సమీపంలోని సూర్యనగర్‌ బీఎంటీసీ బస్‌ డిపో వద్దకు తీసుకువచ్చారు. శ్రీనివాస్‌ను కత్తితో గొంతుకోసి చంపిన ఇద్దరూ, లక్ష్మినిచంపాలని యత్నించారు.అయితే ఆమెకు పురిటి బిడ్డ ఉండడంతో వదిలేసారు. శ్రీనివాస్‌ శవాన్ని సమీపంలోని చెరువులో విసిరేసి వెళ్లిపోయారు. అనంతరం బాలక్రిష్ణ భయంతో పరారయ్యాడు. ప్రతిభ అద్దె ఇంటిని యజమానిని కలిసి ఇల్లు ఖాళీ చేస్తున్నామని, అడ్వాన్స్‌ వెనక్కి ఇవ్వాలని ఒత్తిడి చేసింది. ఓనర్‌కు ఆమె భర్త శ్రీనివాస్‌ కనబడకపోవడంతో అతని తమ్ముడు మధుకి సమాచారమిచ్చాడు. మధు గ్రామానికి చేరుకోగా ఇరుగుపొరుగు అంతా వివరించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు ప్రతిభను అరెస్టు చేశారు. శ్రీనివాస్‌ శవాన్ని చెరువులో నుండి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరో నిందితుడు బాలక్రిష్ణ పరారీలో ఉన్నాడు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top