ప్రియుడితో కలిసి భర్తను అంతం చేసింది

Wife Arrest in Hudband Murder Case in Hyderabad - Sakshi

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని దారుణం

కంటోన్మెంట్‌ : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో మహిళ.  పక్కా ప్రణాళికతో భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి ఊపిరాడకుండా చేసిన నిందితురాలు భర్త గుండెపోటుతో మరణించినట్లు బంధువుల నమ్మించి ఖననం చేయించినప్పటికీ పోలీసుల విచారణలో నేరం బయటపడింది. ప్రధాన నిందితురాలితో పాటు ఆమెకు సహకరించిన మరో నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అనుమానాస్పద కేసుగా నమోదై చివరకు హత్యకేసుగా తేలిన ఈ కేసు వివరాలను బేగంపేట ఏసీపీ రామ్‌రెడ్డి, బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 

నిద్రమాత్రలు ఇచ్చి, గొంతునులిమి..
సిఖ్‌విలేజ్‌ చందూలాల్‌ బౌలికి చెందిన ఇంతి యాజ్‌ ఖాన్‌ (34) అలియాస్‌ బాబాఖాన్‌ స్థానికంగా టైలర్‌ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పన్నెండేళ్ల క్రితమే భార్య ముగ్గురు పిల్లలను వదిలేసిన బాబాఖాన్, ఉప్పల్‌ బీరప్పగడ్డ ప్రాంతంలో నివాసముంటున్న జహేదా బేగంను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. బాబాఖాన్‌తో వివాహం నాటికే జహేదాకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే జహేదాకు కొంతకాలం క్రితం ఓల్డ్‌ బోయిన్‌పల్లి హెచ్‌ఏల కాలనీకి చెందిన ఉబర్‌ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ సయ్యద్‌ ఫయాజ్‌ ఆలంతో కొంతకాలం క్రితం  వివాహేతర సంబం ధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన బాబాఖాన్‌ భార్యను మందలించడంతో పాటు శారీరకంగా, మానసికంగా హింసించాడు.  భార్య కు మొదటి భర్త ద్వారా పుట్టిన కూతురిపట్ల కూడా బాబాఖాన్‌ అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో  భర్త అడ్డుతొలగించుకోవాలని భావించిన జహేదా, ప్రియుడు ఫయాజ్‌తో కలిసి హత్యకు కుట్ర పన్నింది.

ఇందులో భాగంగా గతేడాది నవంబర్‌ 15న రాత్రి 11.00 గంటల సమయంలో బాబాఖాన్‌కు బ్లాక్‌టీలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. బాబాఖాన్‌ గాఢ నిద్రలోకి వెళ్లాకు జహేదా, ఫయాజ్‌తో పాటు అతని మిత్రులు మహ్మద్‌ బాబర్, మహ్మద్‌ అక్రమ్, సయ్యద్‌ సజ్జాద్‌లతో కలిసి గొంతునులిమి చంపేశారు. మధ్యలో మెలకువ వచ్చి తప్పించుకునే ప్రయత్నం చేసిన బాబాఖాన్‌ గొంతుపై గట్టిగా అదిపట్టడంతో గాయాలయ్యాయి. మరునాటి ఉదయం నిద్రలేపేందుకు యత్నించగా, ఎంతకూ లేవడం లేదని జహేదా పొరుగున ఉండే ఓ నర్సుకు సమాచారం ఇచ్చింది. తర్వాత బంధువులకు సమాచారం ఇవ్వగా అదే రోజు సాయంత్రం బషీర్‌బాగ్‌లోని స్మశాన వాటికలో ఖననం చేశారు. ఈ సందర్భంగా బాబాఖాన్‌ గొంతుపై గాయాలను గుర్తించిన అతని సోదరుడు వదినన నిలదీయగా ఆమె చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఈ సందర్భంగా ఆ గాయాల ఫొటోలతో బాబాఖాన్‌ సోదరుడు ఫజ్జుఖాన్‌ బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

పంచనామాలతో బలపడిన అనుమానాలు
అనుమానాస్పద మృతి కేసు విచారణలో భాగం గా బోయిన్‌పల్లి పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి నవంబర్‌ 21న బాబాఖాన్‌ మృతదేహానికి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం లో బాధితుడిని చంపేసినట్లు తేలడంతో హత్యకేసుగా మార్చి విచారణ కొనసాగించారు. ఈ క్రమంలో జహేదాతో పాటు ఆమెతో పాటు హత్య లో పాల్గొన్న నిందితులను అరెస్టు చేసిన పోలీసు లు గురువారం వారిని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు పరిశోధనలో కీలకంగా వ్యహరించిన ఎస్‌ఐ రఘువీర్‌రెడ్డి బృందాన్ని ఏసీపీ అభినందించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top